Thursday, November 14, 2024

గుండె జబ్బులపై అవగాహన అవసరం

- Advertisement -
- Advertisement -

సెప్టెంబర్ 29… ప్రపంచ హృదయ దినోత్సవం
రామ కిష్టయ్య సంగన భట్ల… 9440595494

world heart day
హృదయ వ్యాధి ఈ రోజు ప్రపంచం లోనే నంబర్ వన్ కిల్లర్. జీవితంలో కొన్ని చిన్న మార్పులు చేయడం ద్వారా, మన గుండె జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ప్రపంచ హృదయ దినోత్సవం ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబరు 29 న జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్ హార్ట్ ఫెడరేషన్ లు సంయుక్తంగా నిర్వహిస్తాయి. ఈ రోజున ప్రతి ఒక్కరు గుండె జబ్బులపై అవగాహన పెంచుకొని గుండె జబ్బులు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసు కోవాలి.

గుండెపోటు, గుండె జబ్బులను నివారించడం కోసం 1946లో జెనీవా దేశంలో వరల్ హార్ట్ ఫెడరేషన్ సంస్థ ఏర్పాటయింది. 1999లో అప్పటి వరల్ హార్ట్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ తొలిసారిగా ఈ దినోత్సవాన్ని జరిపాడు. అలా 2000 నుండి ప్రపంచ వ్యాప్తంగా ప్రారంభించ బడింది. 2010 వరకు సెప్టెంబరు నెలలోని ఆఖరి ఆదివారం నిర్వహించ బడిన ఈ దినోత్సవం, 2011వ సంవత్సరం నుంచి సెప్టెంబరు 29వ తేదీన నిర్వహించ బడుతోంది. గుండె విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి, తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ ప్రపంచ హృదయ దినోత్సవం జరుపు కుంటారు. మన శరీరంలోని మిగిలిన భాగాల కంటే కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇతర శారీరక అవయవాలు మన శారీరక ఆరోగ్యానికి చాలా అవసరం అయితే, గుండె మన మానసిక ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. ప్రతి సంవత్సరం గుండె జబ్బులు పెరుగు తున్నాయి. గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువ కావడానికి మన జీవన విధానం ముఖ్యమైన కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
గుండెను ఆరోగ్యంగా చూసు కోవడం, వ్యాధి రాకుండా అవగాహన కలిగించడం మొదలైన అంశాలపై ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజున ప్రచారం చేస్తారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్ హార్ట్ ఫెడరేషన్ సంయుక్తంగా దాదాపు 100 దేశాలలో 196 కార్డియాలజీ సొసైటీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఆరోగ్య తనిఖీలు నిర్వహించడం, నడక పరుగులకు సందబంధించిన ఆటలు ఆడించడం, బహిరంగ చర్చలు సైన్స్ ఫోరాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యక్తులు, కుటుంబాలు, సంఘాలు, ప్రభుత్వాలు మొదలైనవి గుండె ఆరోగ్యం, ఇతరుల బాధ్యతలను స్వీకరించే కార్యకలాపాల్లో పాల్గొంటాయి. ఈ ప్రచారం ద్వారా అన్ని దేశాల ప్రజలను ఏకంచేసి, ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య కరమైన జీవితాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ కార్యక్రమాలను నడిపిస్తుంది. గుండె జబ్బులు రావడానికి కారణాలను పరిశీలిస్తే…మారిన ఆహారపు అలవాట్లు, సిగరెట్లు, మందు తాగడం, శరీరానికి అవసరమైన వ్యాయామం లేకపోవడం, ఉబకాయం ఇవన్నీ గుండె జబ్బులకు దారితీస్తాయని వైద్యులు చెపుతున్నారు. దశాబ్ద కాలం క్రితం వరకూ ఆసుపత్రిలో హృద్రోగంతో బాధపడే స్త్రీల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. ఇప్పుడు పురుషులతో సమానంగా స్త్రీల సంఖ్య కూడా ఉంటోంది. దీనికి ఒకటే కారణం స్త్రీలు కూడా పురుషులతో సమానంగా సిగరెట్లు, మద్యం తాగడం అంటున్నారు నిపుణులు. గుండెకు సంబంధమైన వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటే జీవిత కాలాన్ని మరికొంత కాలం సుఖ సంతోషాలతో గడప వచ్చు. వివిధ రకాల గుండె జబ్బులతో బాధ పడుతున్న వ్యక్తులు సాధారణ చిట్కాలను పాటించటం ద్వారా నివారించ వచ్చు.

వ్యాయామం, శారీరక శ్రమ: అంటే మీరు ప్రతి రోజూ చేసే పనిలో శారీరక శ్రమను కూడా భాగం చేసుకోవాలి. అంటే సైకిల్ తొక్కడం, మెట్లను ఎక్కడం, వీలైనప్పుడంతా నడవడం చేయాలి. శుభ్రమైన గాలి పీల్చడానికి నడవాల్సి వస్తే నడవాలి. రోజుకు రెండు సార్లు స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు ఐదు నిమిషాల పాటు చేయొచ్చు. ఈ చిన్న చిన్న శ్రమలన్నీ ఆరోగ్య ఖాతాలో పడతాయి. ఆహారం, పండ్లు మరియు కూరగాయలలో ఫైబర్ తో పాటుగా, విటమిన్లు, ఖనిజాలు మరియు అనామ్ల జనకాలు, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. రక్తపోటు నిర్వహణ విషయానికి వస్తే తినే ఆహారంలో పొటాషియం పెంచడం, సోడియం తగ్గించడం చాలాముఖ్యం. పొటాషియం, సోడియం ప్రభావాలు తక్కువ, అధిక రక్తపోటులకు సహాయం చేస్తాయి. సిట్రస్ పండ్లు, అరటిపండ్లు, బంగాళా దుంపలు, టమాటాలు మరియు బీన్స్ లలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. అలాగే తేలిక ఆహారాలను తీసుకోవాలి. ఇటీవల ఒక అధ్యయనం ప్రకారం తెల్ల పండ్లు మరియు కూరగాయలు (ఆపిల్స్, దోసకాయలు, కాలీఫ్లవర్ వంటి) అధికంగా తిన్న ప్రజలకు స్ట్రోక్ వచ్చే ప్రమాదం 52 శాతం తగ్గిందని తేలింది. గుండె పోటుకు ప్రధాన కారణం మానసిక ఒత్తిడి. ఒక వ్యక్తి అధిక మానసిక ఒత్తిడికి గురైనప్పుడు, ఆ వ్యక్తికి గుండె పోటు వస్తుందని గమనించి ఉండవచ్చు. కాబట్టి అతిగా ఆందోళన చెందకుండా సంతోష మైనా లేదా విచారకరమైన మానసిక స్థితి కానీ ఎక్కువ ఉద్వేగానికి లోనవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

అందుకు యోగా సహాయ పడుతుంది. మన గుండె ఒక పంపులా పనిచేస్తూ శరీరంలోని అన్ని భాగాలకు రక్త సరఫరా చేస్తుంటుంది. మామూలు పంపులు పని చేయటానికి విద్యుత్తు అవసరమైనట్టే మన గుండె నిరంతరం కొట్టు కోవటానికి కూడా శక్తి కావాలి. ఇందుకు గుండె పైగదుల్లో కుడి వైపున సైనో ఏట్రియల్ నోడ్ (ఎస్‌ఏ నోడ్), ఏట్రియో వెంట్రిక్యులార్ నోడ్ (ఏవీ నోడ్) అనే కేంద్రాలుంటాయి. వీటి నుంచి నిరంతరం విద్యుత్ ప్రేరేపణలు వెలువడు తుంటాయి. ’ఎస్‌ఏ నోడ్’ నుంచి వెలవడే విద్యుత్ ప్రేరణలు గుండె పైగదులైన కుడి కర్ణిక నుంచి ఎడమ కర్ణికకు చేరుకొని.. అవి రెండూ మూసుకునేలా చేస్తాయి. దాంతో రక్తం వేగంగా నెట్టినట్టుగా కింది గదులైన జఠరికల్లోకి వస్తుంది. అప్పుడు ’ఏవీ నోడ్’ నుంచి వెలువడే విద్యుత్ ప్రేరణలు జఠరికలు మూసుకునేలా చేస్తాయి. ఇదంతా ఒక క్రమపద్ధతిలో, లయాత్మకంగా, నిరంతరాయంగా జరుగు తుండటం వల్ల రక్తం ధమనుల్లోకి పంప్ అవుతుంది. అయితే కొన్నిసార్లు రకరకాల సమస్యల కారణంగా ఈ విద్యుత్ ప్రేరణలు గతితప్పి, గుండె లయ దెబ్బ తినొచ్చు. దీన్నే ’అరిత్మి యాసిస్’ అంటారు. దీంతో గుండె కొట్టుకునే వేగం క్రమంగా తగ్గటం (బ్రాడీకార్డియా), అనూహ్యంగా పెరగటం (టెకీకార్డియా) వంటి పరిస్థితులు తలెత్తవచ్చు. హార్ట్ ఎటాక్ కు కార్డియాక్ అరెస్టుకు తేడా ఉంది.

కరోనరీ ధమనులు (కరోనరీ ఆర్టెరీస్)లో బ్లాకులు ఏర్పడినప్పుడు హార్ట్ ఎటాక్ వస్తుంది. గుండె కండరానికి (కార్డియాక్ మజిల్) రక్త ప్రసరణ చేసే రక్త నాళాలనే కరోనరీ ధమనులు అంటారు. అలా బ్లాకులు ఏర్పడి నప్పుడు గుండెకు ఆక్సిజన్ నిండిన రక్తం అందదు. ఆ బ్లాకులు త్వరగా తెరుచు కోకపోతే మనిషి చనిపోతాడు. ఇక కార్డియాక్ అరెస్టు అంటే…ఒక్కసారిగా గుండె.. రక్త సరఫరాను ఆపేస్తుంది. మెదడుకి ఆక్సిజన్ అందదు. అప్పుడు మనిషి ఒక్కసారిగా కుప్పకూలి, ఊపిరాడక స్పృహ కోల్పోతాడు. గుండె కొట్టుకోవడం పూర్తిగా ఆగిపోతుంది. దీనినే కార్డియాక్ అరెస్ట్ అంటారు. కొందరు తరచూ కెరీర్, ఆర్థిక పరమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ ఒత్తిడి గుండె పని తీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న మనిషి గుండె నిమిషానికి 70 నుంచి 80 సార్లు కొట్టు కుంటుంది. మనిషి ఒత్తిడికి గురైనప్పడు గుండె వేగం 120 నుంచి 150సార్లకు పైగా కొట్టు కుంటుంది. గుండె నుంచి ఇతర శరీర భాగాలకు రక్త ప్రసరణ వేగంగా సాగాల్సిన సమయంలో రక్త నాళాలు చిన్నవిగా కుచించుకు పోతాయి. అప్పటి వరకూ రక్తనాళాల్లో బ్లాకులు లేక పోయినా& ఒత్తిడి వల్ల అవి కుచించుకు పోయి సడెన్ కార్డియాక్ అరెస్ట్‌కు కారణం అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News