Monday, January 13, 2025

హక్కులకై ధిక్కార కవిత్వం

- Advertisement -
- Advertisement -

శతాబ్దాలుగా ఎన్నో యుద్ధాలను, హింసను మానవ హక్కుల ఉల్లంఘనను ఈ ప్రపంచం చవిచూసింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఐక్యరాజ్యసమితి ఒక డిక్లరేషన్‌లో ప్రపంచంలో ఉండే మానవులందరూ సమానమే అంటూ, డిసెంబర్ 10ని ప్రపంచ మానవ హక్కుల దినంగా ప్రకటించింది. ఆ ప్రకటన వచ్చి 75 ఏళ్ల కాలం గడిచిపోయిన తర్వాత కూడా మానవులందరూ సమానమే అనే భావన గానీ, ఆచరణ గానీ ఇంకా మన సమాజంలో అమలు జరగడం లేదు. ప్రపంచ పరిస్థితి మరింత దిగజారింది. ఎక్కడా యుద్ధాలు, హింస ఆగలేదు. అన్ని రకాల అసమానతలు ఎక్కడికీ పోలేదు. కవులు రాస్తారు. వాళ్ళ వేదన, శోధన తమ కోసం, తమ ఆనందం కోసమే కాదు. ఈ లోకం కోసం కూడా రాస్తారు. అణిచివేత, వివక్ష, హింస, ఆర్థిక, సామాజిక అసమానతలు, మానవుల్ని మానవులుగా పరిగణించని ఈ దుర్మార్గమైన లోకం వాళ్ళ హృదయాన్ని కల్లోల పరుస్తుంది.

కవులు కలలు కంటారు. ఒక అద్భుతమైన ప్రపంచాన్ని ఆ కలల్లో ఊహిస్తారు. మానవులందరూ సుఖశాంతుల తో, సమానంగా, గౌరవప్రదంగా బతకాలని, అందరికీ సమాన హక్కులు వుండాలని వాళ్లు కోరుకుంటారు. ఇట్లా కవిత్వం రాసేందుకు, వాళ్ళ అక్షరానికి వాళ్ళు నిబద్ధులైనందుకు ప్రవాసాలను, జైలు శిక్షలను, మరణాన్ని ఎదుర్కొవలసి వచ్చినా వాళ్ళు లెక్క చేయలేదు. హక్కుల కోసం, సమానత్వం కోసం రాసిన కవిత్వం ఇంకా మరణించలేదు. ఎందుకంటే సమాజం అందరూ సమానమే అనేటువంటి స్థితికి ఇంకా చేరుకోలేదు కాబట్టి. అనేక హక్కుల పోరాటాలలో కవిత్వం ప్రజల నాలుకలపై మోగే నినాదం అయింది. సమాజంలో కవిత్వ స్థానం నిజంగా ఎంతో కీలకమైంది. హక్కుల కోసం జరిగే ప్రతి ఆందోళనలోను ఈ కవిత్వం యథార్థ స్థితిని చెప్పడమే కాక, ఆ స్థితి మారాలని ప్రగాఢంగా కోరుకుంది. ప్రతి సందర్భంలోనూ కవిత్వం ఒక శక్తివంతమైన సాధనంగా పని చేసింది. సమానత్వం కోసం, హక్కుల కోసం పోరాడమనే స్ఫూర్తిని ఇస్తూ, ప్రజలను చైతన్యపరిచిన ధిక్కార, ప్రతిఘటనా స్వరాలు, ప్రజల్ని ఎంతో ఉత్తేజితులను చేసినా, వంద ఏళ్లు గడిచినా ఇంకా ప్రభావితం చేస్తున్న కవితలు ప్రపంచమంతటా అనేక కాలాల్లో ఉన్నాయి.

కాజీ నజ్రుల్ ఇస్లాం, ఫైజ్ అహమ్మద్ ఫైజ్, కైఫీ అజ్మీ, మాగ్దుమ్, హబీబ్ జలీబ్, శ్రీశ్రీ, వరవరరావు, చెరబండరాజు నుండి మొదలుకొని మొన్నటికి మొన్న ‘కాగజ్ నహి దిఖాయేంగే’ రాసిన వరుణ్ గ్రోవర్ వరకు భయం ఎరుగని కవులు అన్యాయాన్ని, హక్కుల ప్రశ్నించకుండా వుండలేదు. మాయా యాంజిలో ఒక స్త్రీగా, నల్లజాతికి చెందిన దానిలా ఎదుర్కొంటున్న వివక్షను ‘స్టిల్ ఐ రైజ్’ కవితలో ఎంతో ప్రతిభావంతంగా చెప్పింది. అది ఒక మార్చింగ్ సాంగ్ లాగా మహిళల హక్కుల ఉద్యమంలో నిలిచిపోయింది. అలాగే నల్లజాతి ప్రజలు పైన సాగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా జరిగిన ‘హేర్లమ్ రెసిస్టెన్స్’ సందర్భంలో రాసిన ‘ఇఫ్ వుయ్ మస్ట్ డై’ నేటికీ నిలిచివున్నది. ఇలా ప్రతి దేశంలోనూ ఆణిముత్యాలై, అగ్నిశిఖలు అనదగ్గ కవిత్వాన్ని వందల ఏళ్ళు గడిచిన పోరాటాల పతాక గీతాలుగా ఉండదగిన కవిత్వాన్ని రాశారు. మనం నడిచే దారిలో దీప స్తంభాలై నిలిచే మన తెలుగు కవిత్వంలో మచ్చుకు కొన్ని.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News