మయామి : ప్రపంచంలో అత్యంత భారీ క్రూజ్ నౌక “ఐకాన్ ఆఫ్ ది సీస్” మొదటిసారి తన ప్రయాణానికి సిద్ధమైంది. రాయల్ కరీబియన్ సంస్థకు చెందిన ఈ నౌక అమెరికా లోని ఫ్లోరిడా రాష్ట్రం మయామీ పోర్టు నుంచి స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం బయలుదేరి వారం రోజుల పాటు కరీబియన్ లోని వివిధ దీవులను చుట్టివస్తుంది. 365 మీటర్లు (1,197 అడుగులు )పొడవు, 20 డెక్కులున్న ఈ నౌకలో ఆరు వాటర్ స్లైడ్‌లు, ఏడు ఈత కొలనులు, ఐస్ స్కేటింగ్ రింక్, సినిమా థియేటర్, 40 కి పైగా రెస్టారెంట్లు, బార్లు , లాంజ్‌లు ఉన్నాయి. 2 బిలియన్ డాలర్లు (1.6 బిలియన్ పౌండ్లు)తో తుర్కు, ఫిన్‌లాండ్‌లో దీన్ని నిర్మించారు.2300 సిబ్బంది, 7600 మంది ప్రయాణికులను తీసుకెళ్లే సామర్ధం ఈ నౌకకు ఉంది.
ఇందులో ప్రయాణించేవారికి అద్బుతమైన అనుభూతి కలిగించేలా నౌకలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని రాయల్ కరీబియన్ సంస్థ సీఈఒ జాసన్ లిబర్టీ వివరించారు. సంప్రదాయ సాగర ఇంధనం కన్నా ఎల్‌ఎన్‌జి చాలా శుభ్రంగా మండినప్పటికీ, కొంత గ్యాస్ తప్పించుకునే రిస్క్ ఉంటుందని, ఫలితంగా మెథేన్ వాతావరణం లోకి లీక్ అయ్యే ప్రమాదం ఉంటుందని భయ పడుతున్నారు. కార్బన్‌డైయాక్సైడ్ కన్నా మెథేన్ చాలా శక్తివంతమైన గ్రీన్ గ్యాస్. సముద్ర నౌకలకు ఇంధనంగా ఎల్‌ఎన్‌జిని వినియోగించడం వల్ల 120 శాతం వరకు సముద్ర ఇంధనం ఉద్గారాలను విడుదల చేస్తుందని ఐసిసిటీ మెరైన్ ప్రోగ్రామ్ డైరెక్టర్ బ్రియాన్ కార్నర్ హెచ్చరించారు. అత్యంత ఎక్కువగా గ్రీన్‌హౌస్ గ్యాస్ ఉద్గారాలు విడుదల అవుతాయని పేర్కొన్నారు.