Sunday, November 24, 2024

ప్రధాని మోడీకి ప్రపంచ నేతల అభినందనలు

- Advertisement -
- Advertisement -

ప్రధాని మోడీకి ప్రపంచ నేతల అభినందనలు
ఎన్నికల్లో చరిత్రాత్మక విజయానికి ప్రశంస
ఎన్‌డిఎకు సుఖప్రదమైన ఆధిక్యం
మోడీతో సన్నిహితంగా పని చేస్తామని ఆకాంక్ష
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ సంకీర్ణం విజయంపై ప్రధాని నరేంద్ర మోడీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె, నేపాల్ ప్రధాని పుష్ప కుమార్ దహల్ ‘ప్రచండ’ అభినందించారు. మోడీతో సన్నిహితంగా పని చేయాలన్న ఆకాంక్షను వారు వ్యక్తం చేశారు. లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలను భారత ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

భారతీయ జనతా పార్టీ (బిజెపి) 543 సీట్లలోకి 240 సీట్లు గెలుచుకోగా కాంగ్రెస్‌కు 99 సీట్లు వచ్చాయి. బిజెపి నేతృత్వంలోనిఎన్‌డిఎ మెజారిటీ స్థాయి 272కు మించి సీట్లతో సుఖప్రదమైన ఆధిక్యం సాధించింది. అయితే, 2014 నుంచి తొలిసారిగా బిజెపి సొంతంగా ఆధిక్యం సాధించలేకపోయింది. ‘కొత్త ఎన్నికల విజయానికి నరేంద్ర మోడీకి అభినందనలు. మెరుగైన కృషికి నా సాదరపూర్వక శుభాకాంక్షలు. ఇటలీ, ఇండియాలను సంఘటితం చేసే మైత్రి పటిష్ఠతకు కలసి కృషి చేస్తూనే ఉంటాం.

మన దేశాల, ప్రజల సంక్షేమం కోసం మనల్ని నిబద్ధం చేసే వివిధ అంశాలపై సహకారాన్నిపటిష్ఠం చేస్తాం’ అని మెలోని ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు. మోడీ సారథ్యంలో ప్రగతి, సౌభాగ్యంపై భారత ప్రజల విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ విజయం సాధించినందుకు బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎకి శ్రీలంక అధ్యక్షుడు విక్రమసింఘె సుహృద్వావపూర్వక అభినందనలు తెలిపారు. ‘అత్యంత సమీప పొరుగు దేశంగా శ్రీలంక భారత్‌తో భాగస్వామ్యాన్ని మరింత దృఢతరం చేసేందుకు ఎదురు చూస్తోంది’ అని శ్రీలంక అధ్యక్షుడు‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు. బిజెపి నేతృత్వంలోని కూటమి ఎన్నికల విజయానికి భారత ప్రధాని మోడీని నేపాల్ ప్రధాని ‘ప్రచండ’ అభినందించారు. ‘వరుసగా మూడవ సారి లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి, ఎన్‌డిఎ విజయంపై ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు.

భారత ప్రజలు ఉత్సాహంతో పాల్గొనగా ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలుసుకుని మేము ఆనందిస్తున్నాం’ అని ఆయన ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. మోడీ చరిత్రాత్మక విజయానికి మోడీని మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జగ్‌నాథ్ అభినందించారు. ‘చరిత్రాత్మక మూడవ దఫా ఘన విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి అభినందనలు. మీ హయాంలో అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ గణనీయమైన ప్రగతి కొనసాగించగలదు. మారిషస్, భారత ప్రత్యేక అనుబంధం వర్ధిల్లాలి’ అని జగ్‌నాథ్ ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మొహమద్ ముయిజ్జు కూడా ప్రధాని మోడీని అభినందించారు. ద్వైపాక్షిక సంబంధాల పురోగతికి భారత ప్రధానితో కలసి పని చేయాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు.

చైనా అనుకూల నేత ముయిజ్జు నిరుడు నవంబర్‌లో పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత చేసిన వ్యాఖ్యలు, తీసుకున్న చర్యలు ద్వైపాక్షిక సంబంధాలను ఒకింత దెబ్బ తీసిన విషయం విదితమే. వరుసగా మూడవ సారి చరిత్రాత్మక విజయం సాధించినందుకు ప్రధాని మోడీని, ఎన్‌డిఎను భూటాన్ ప్రధాని షెరింగ్ తోబ్‌గే కూడా అభినందించారు. మోడీతో కలసి పని చేయడం కోసం తాను ఎదురుచూస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించినందుకు నా మిత్రుడు ప్రధాని నరేంద్ర మోడీజికి, ఎన్‌డిఎకు అభినందనలు. ఆయన సమున్నత శిఖరాలకు భారత్‌కు సారథ్యం వహిస్తున్నందున మన రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత దృఢతరం చేసేందుకు ఆయనతో కలసి పని చేయడానికి ఎదురుచూస్తున్నాను’ అని తోబ్‌గే ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు.

మోడీ, ఎన్‌డిఎలకు చైనా ప్రశంస
సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ సాధించిన విజయంపై ప్రధాని నరేంద్ర మోడీన చైనా బుధవారం అభినందించింది. ద్వైపాక్షిక సంబంధాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో కలసి పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చైనా తెలియజేసింది. ‘భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలను గమనించాం. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బిజెపి, ఎన్‌డిఎ విజయానికి అభినందనలు తెలియజేస్తున్నాం’ అని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ పేర్కొన్నారు. భారత సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై మీడియా గోష్ఠిలో ప్రశ్నలకు మావో నింగ్ సమాధానం ఇస్తూ, పటిష్ఠమైన, సుస్థిరమైన భారత భాగస్వామ్యం రెండు దేశాల ప్రయోజనాలకు, ఈ ప్రాంతంలోను, వెలుపల శాంతి, అభివృద్ధికి అనుగుణమైనదని చెప్పారు. మన సంబంధాల మొత్తం ప్రయోజనాల దృష్టా రెండు దేశాల, ప్రజల ప్రాథమిక శ్రేయస్సు కోసం భారత్‌తో కలసి పని చేయడానికి చైనా సిద్ధంగా ఉందని మావో నింగ్ తెలిపారు.

నెతన్యాహు అభినందన
భారత సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి, ఎన్‌డిఎ విజయంపై ప్రధాని నరేంద్ర మోడీని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అభినందించారు. భారత, ఇజ్రాయెల్ సంబంధాలు ‘కొత్త శిఖరాలకు’ పురోగమిస్తాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ‘వరుసగా మూడవ సారి తిరిగి ఎన్నికైనందుకు ప్రధాని నరేంద్ర మోడీకి నా సాదరపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. భారత, ఇజ్రాయెల్ సంబందాలు కొత్త శిఖరాల దిశగా సాగుతూనే ఉండుగాక. శుభాకాంక్షలు’ అని నెతన్యాహు ‘ఎక్స్’ పోస్ట్‌లో పేర్కొన్నారు. 1992లో ఉభయ దేశాల మధ్య దౌత్య సంబంధాలు నెలకొన్న తరువాత ఇజ్రాయెల్‌ను సందర్శించిన తొలి భారత ప్రధాని మోడీ. ఆయన 2017లో ఇజ్రాయెల్‌ను సందర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News