దావోస్ : కరోనా కన్నా ఉధృత స్థాయిలో మానవాళిని ఎక్స్ అనే అంటువ్యాధి కబళించనుందని వెల్లడైంది. దావోస్‌లో ఇప్పుడు జరుగుతోన్న ప్రపంచ ఆర్థిక సమాఖ్యలో ప్రపంచ దేశాల నేతలు పొంచి ఉన్న ఈ వ్యాధిపై విస్తృతంగా చర్చించారు. దీనిని తట్టుకునేందుకు తీసుకోవల్సిన చర్యల గురించి సమీక్షించారు. ఇటువంటి భయానక వ్యాధి వైరస్ ఉత్పన్నమైన విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్లుహెచ్‌ఒ) 2018లోనే కనుగొంది. పలు పరిశోధనల తరువాత దీనికి ఎక్స్ వ్యాధి అనే పేరు పెట్టారు. ఇది ప్రపంచ స్థాయి మహమ్మారి అవుతుందని ఆరోగ్య సంస్థ విశ్లేషించింది. కోవిడ్ 19తో పోలిస్తే ఈ వ్యాధి 20 రెట్లు ఎక్కువ స్థాయిలో ముప్పు కల్గిస్తుందని అంచనావేశారు. దీనిని అరికట్టేందుకు ప్రపంచ దేశాల మధ్య మరింత సమన్వయం , పరిశోధనలు, సంసిద్ధతలు అవసరం అని నేతలు నిర్ణయించారు.
ఈ ఎక్స్ వైరస్‌తో తలెత్తే వ్యాధి వల్ల దాదాపు ఐదు కోట్ల మందివరకూ చనిపోతారని ప్రమాదకర విశ్లేషణ వెలువడింది. తీవ్రస్థాయి ప్రమాద ఘంటికలకు దారితీస్తోన్న ఈ సూక్ష్మకణజీవి లేదా వైరస్ ఇప్పటికైతే మనుష్యులలో ఎక్కడా ఎవరికి సోకిన దాఖలాలు లేవు. అయితే వ్యాపిస్తే ఇది ఓ పట్టానా వదిలే ప్రసక్తే ఉండదని, అంతా అప్రమత్తతతో ఉండాలని హెచ్చరించారు. దావోస్‌లో ఏర్పాటైన ప్రపంచ వేదిక నుంచి చర్చకు వచ్చిన పలు విషయాలలో ఈ ఎక్స్ వైరస్ అత్యంత కీలకం అయింది. సాధారణంగా ఈ వైరస్ జూనోటిక్ రకం. అంటే మనుష్యుల నుంచి జంతువులకు , జంతువుల ద్వారా మనుష్యులకు సోకుతుందని నిర్థారించారు. అయితే ప్రభావం చూపిన దాఖలాలపై అనిశ్చితత ఉంది.
అయితే ఇది మనుష్యులకు ఎబోలా, ఎయిడ్స్, హెచ్‌ఐవి లేదా ఇటీవలి కోవిడ్ 19 మాదిరిగా సోకే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధిని మార్టిన్ బెల్ సిండ్రోమ్ అని కూడా పిలుస్తారు. ఎదుగుదల ఆగిపోవడం, ఆలోచనా శక్తి క్షీణించడం , గ్రహణశక్తి లోపాలు వంటివి ఈ వ్యాధి ప్రధాన లక్షణాలు. ఆటిజం సమస్య , ఆందోళన , మానసిక ఉద్రిక్తత వంటివి కూడా కన్పిస్తుంటాయి.