న్యూఢిల్లీ: ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టుగల దేశాల జాబితాలో ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రపంచంలోని 194 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించే సౌకర్యాన్ని ఈ దేశాలు కల్పిస్తున్నట్లు తాజా హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ వెల్లడించింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్(ఐఎటిఎ) ఇచ్చిన గణాంకాల ఆధారంగా ఈ ర్యాంకింగ్ ఇచ్చారు. గడచిన ఐదేళ్లుగా జపాన్, సింగపూర్ మొదటి ర్యాంకులో నిలుస్తున్నాయి. ఇటీవలి ర్యాంకింగ్‌లలో ఐరోపా దేశాలు ముందంజలోకి వచ్చాయి. 193 దేశాలకు వీసా రహిత ప్రయాణం కల్పించి ఫిన్‌ల్యాండ్, స్వీడన్, దక్షిణ కొరియా రెండవ స్థానంలో నిలిచాయి.
ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్‌ల్యాండ్, నెదర్‌ల్యాండ్స్ 192 దేశాలకు వీసా రహిత ప్రయాణంతో మూడవ స్థానంలో నిలిచాయి. ఇండోనేషియా, మలేషియా, థయ్‌ల్యాండ్ తదితర 62 దేశాలకు వీసా రహిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న భారత్ ఈ జాబితాలో 80వ స్థానంలో ఉంది. ఉజ్బెకిస్తాన్ కూడా 80వ ర్యాంకులో ఉండగా పాకిస్తాన్ 101వ ర్యాంకులో ఉంది. 28 దేశాలకు మాత్రమే వీసారహిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న అఫ్ఘానిస్తాన్ జాబితాలో అట్టడుగు స్థానంలో నిలిచింది. 29 దేశాలకు వీసారహిత ప్రయాణం కల్పిస్తున్న సిరియా కింద నుంచి రెండవ స్థానంలో ఉండగా 31 దేశాలతో ఇరాక్ కింద నుంచి మూడవ స్థానంలో, 34 దేశాలతో పాకిస్తాన్ కింద నుంచి నాలుగవ స్థానంలో నిలిచాయి.