Thursday, January 23, 2025

పొగత్రాగడం మానే దమ్ముందా?

- Advertisement -
- Advertisement -

World No-Tobacco Day

దశాబ్దాల క్రితం పొగాకు ఎండబెట్టి శుభ్రపరచి దానిని పాయలుగా విడదీసి మోదుగ ఆకుల్లో చుట్టి రెండు రాళ్ల రాపిడితో నిప్పు రవ్వలు పుట్టించి … గ్రామీణ ప్రాంతాలలోని వారు పొగను పీల్చే దశ నుండి బీడీలు, చుట్టలతో పాటు అత్యంత ఫ్యాషన్‌గా సిగరెట్స్ వచ్చి చేరాయి. సినీ తారల వ్యాపార ప్రకటనలతో, సినిమాలలో నటులు పొగ తాగే సన్నివేశాలను అధికంగా చూపడం వలన వారి హావభావాలతో ప్రజలందరూ అనుకరించడం ఆరంభమైంది అనడంలో అతిశయోక్తి లేదు. ఒక సిగరెట్ తాగడం వలన 11 నిమిషాల ఆయుర్దాయం తగ్గుతుంది అని అందరికీ తెలుసు.

అయినా లెక్క చేయకుండా బంధు, మిత్రుల ప్రోద్బలంతో ఒక్క పఫ్ అని మొదలు పెట్టడం. ఆ తర్వాత పొగ తాగడం ఒక స్టైల్ గా, స్టాటస్ సింబల్‌గా భావించడం. దాని వలన కలిగే దుష్పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తెలిసినా పెద్దగా పట్టించుకోకపోవడం పరిణామక్రమంలో… కిక్ కోసం అంటూ పొగ తాగడంతో పాటు మరికొన్ని మత్తు పదార్థాలున్న సిగరెట్‌కి బానిసలవుతున్నారు. పొగ తాగే వారిలో కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాని ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే.. పొగ తాగే వారి కన్నా, వారు బయటికి వదిలే పొగను పీల్చే వారు త్వరగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులకు గురవడం. పొగ తాగేవారిలో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో పాటు పెదవి నుండి ముక్కులోపలి భాగాలలో, నోటి లోపల, గొంతులో స్వరపేటిక, అన్నవాహిక, జీర్ణాశయం, కాలేయం, కిడ్నీలు చివరికి ఎముకల మజ్జలో కూడా కేన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఈ పొగాకులో ఉండే నికోటిన్ పీల్చిన వెంటనే అది మెదడుకు చేరి కేంద్ర నాడీమండలాన్ని ఉత్తేజితం చేస్తుంది. ఉత్తేజంతో పాటు అది నేరుగా రక్తంలో కలుస్తుంది. ఫలితంగా మూత్రపిండాల పడపోతలో ఇది వాటిని దెబ్బతీసి కిడ్నీ కేన్సర్‌కి కారణమవుతుంది. అక్కడి నుండి మూత్రనాళాలకు వ్యాప్తి చెందుతుంది. పొగాకులో ఉండే నికోటిన్ ఇతర రసాయనాలు ఒక క్రమపద్ధతిలో జన్యువుల చేత నియంత్రించబడే కణాల పెరుగుదలని అకస్మాత్తుగా పెంచి వేస్తుంది. ఫలితంగా శరీరంలో కణతలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని దుష్ఫలితాలుంటాయని తెలిసినా ఈ దురలవాటుకి బానిసలవుతూనే ఉన్నారు. పొగ రక్కసి కోరల్లో చిక్కి జీవితాన్ని బలి పెట్టుకుంటూ తమ కుటుంబ సభ్యులను అనాథలుగా మిగులుస్తున్నారు. గుండె జబ్బుల్లో 50 శాతం ఈ అలవాటు కారణంగానే సంక్రమిస్తున్నాయి.

cigarette Smoke problems

ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 లక్షల మంది పొగాకు కారణంగా సంక్రమించిన వ్యాధుల వలన అకాల మృత్యువాత పడుతున్నప్పటికీ, తగ్గేదేలే… అంటూ ధూమపాన ప్రియులు ఏడాదికి దాదాపు 6000 మిలియన్లకు పైగా సిగరెట్లను తగలేస్తున్నారు. తత్ఫలితంగా వాయు కాలుష్యం, వాతావరణ కాలుష్యం పెరుగుతోంది. వీరి చేష్టల వలన చిన్న పిల్లలు, పొగ తాగని ఇతర వ్యక్తులు ఎన్నో ఆరోగ్య సమస్యలను ఎదుర్కోనాల్సి వస్తుంది. అంతేకాదూ పొగాకు ప్రాసెసింగ్‌కూ పెద్దఎత్తున వంట చెరకు కావాలి. పొగాకు సాగు, పొగాకు ప్రాసెసింగ్ కోసం ప్రతి సంవత్సరం పచ్చని అడవులు నరికివేతకు గురవుతుండడం వలన పర్యావరణానికి ఎనలేని నష్టం వాటిల్లుతుంది. పొగాకు వినియోగం ద్వారా నష్టాలు గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 1987 మే ‘15న ఒక తీర్మానాన్ని ఆమోదించి 1988 సంవత్సరం ఏప్రిల్ 7న ప్రపంచ పొగాకు ప్యతిరేక దినోత్సవంగా జరుపుకోవాలని పిలుపునిచ్చింది. అలాగే ఏప్రిల్ 7 తేదిన 24 గంటల పాటు పొగాకు ఉత్పత్తులను వాడకుండా ఉండమని కోరింది. దీనిని అనుసరించి 1989లో జరిగిన తదుపరి సమావేశంలో ప్రతి సంవత్సరం మే 31న పొగాకు వినియోగం వలన కలిగే ప్రతికూల ప్రభావాలపై దృష్టిని కేంద్రీకరించే దిశగా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపునిచ్చింది. పొగాకును సిగరెట్, బీడీలు, హుక్కా, గుట్కా ఏ రూపంలో తీసుకున్న నష్టాలే అధికం. పొగాకు శరీర అవయవాలపై తీవ్రప్రభావాన్ని చూపిస్తుందని ముఖ్యంగా ఊపిరితిత్తులకు ముప్పు వాటిల్లి ఎంఫసియా, క్రానిక్ అబ్ స్ట్రక్టివ్, ఫల్మనరీ డిసీజ్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు సోకడమే కాకుండా మెదడులో రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడడం, గొంతు కేన్సర్‌తో పాటు గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని, స్వరపేటిక, నోటి కేన్సర్ ఎముకలు, చర్మం, రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతినడంతో పాటుగా వైరల్, బాక్టీరియల్ ఇన్ ఫ్లేక్షన్స్, వంధ్యత్వానికి గురికావడం, స్తీలలో గర్భస్రావం, అకాల జననాలు, శరీర ఇతర అనారోగ్యాలకు కారణమవుతుంది.

అంతే కాకుండా పరిసరాలలో ఉండేవారు వదిలిన పొగతో కూడిన గాలిని పీల్చుకొవడం వలన చాలా మంది వారికి తెలియకుండానే పలు రకాల వ్యాధుల బారిన పడుతున్నారు. పలు అవగాహన కార్యక్రమాల ఫలితంగా భారత దేశంలో పొగ తాగే వారి సంఖ్య 33.8 శాతం నుంచి 23 శాతానికి తగ్గిందని వైద్య నిపుణుల అంచనా. ప్రపంచ వ్యాప్తంగా 110 కోట్ల మంది పొగ తాగుతున్నారని ఫలితం గా సంవత్సరానికి 80 లక్షల మందికి పైగా మరణిస్తున్నారని పొగ తాగే అలవాటు లేకున్నా పొగ తాగే వారు వదిలే గాలిని పీల్చుకుని సంవత్సరానికి 12 లక్షల మందికి పైగా మరణిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక తెలియజేస్తోంది. ఆఫ్రికాలో ‘ఖాట్’ అనే మొక్క ఆకులను ఎక్కువగా నములుతూ ఉంటారు. ఈ ఆకులు స్ట్రాంగ్ కాఫీ తాగిన భావనను కలిగిస్తాయట. దీని వలన కూడా పొగాకుకు చాలా మంది దూరమయ్యారని సమాచారం. కఠినమైన నిబంధనలు, అవగాహనా సదస్సుల వలన, సిగరెట్ పై విధించిన పన్నుల కారణంగా అభివృద్ధి చెందిన దేశాలలో ధూమపానం తగ్గుముఖం పట్టింది. దీనితో పొగాకు సంస్థలు అభివృద్ధి చెందిన దేశాలనే లక్ష్యంగా చేసుకుంటున్నాయి.

Smoking is Injurious to Health
Smoking is Injurious to Health

ప్రపంచంలో అత్యధికంగా పొగాకును ఉత్పత్తి చేసేది చైనానే. ఈ దేశంలో దాదాపు 30 కోట్ల మంది ప్రజలు పొగ తాగుతున్నారు. ఘనా, ఇథియోపియా, నైజీరియా ఎరిత్రియా, పనామా.. ఈ ఐదు దేశాలు అతి తక్కువగా పొగ తాగే దేశాలలో ముందు జాబితాలో ఉన్నాయి. ఆఫ్రికాలో 14 శాతం మంది పొగ తాగుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రపంచ సగటు 22 శాతం. ఇక్కడ పొగతాగే వాళ్లలో 85 శాతం మగ వాళ్లు. స్త్రీలకు ఆర్థిక స్వాతంత్య్రం తక్కువగా ఉండటం వలన, స్త్రీలు పొగ తాగడాన్ని చాలా చోట్ల అనైతికంగా భావించడం వలన కూడా అక్కడి మహిళల్లో ఆ అలవాటు తక్కువగా ఉండడానికి ప్రధాన కారణమైంది. ప్రపంచంలోనే అత్యధికంగా ఈస్ట్ తైమూర్‌లో 80 శాతం మంది మగవారు పొగ తాగితే, స్త్రీలు 6 శాతం మంది ఆడవాళ్లు మాత్రమే తాగుతారు. ప్రపంచంలో ఈ దేశానిది 4వ స్థానం. ఇక్కడ ప్రతి సిగరెట్ డబ్బాపైన హెచ్చరికలున్నప్పటికీ నిరక్షరాస్యత కారణంగా 50 శాతం మంది వాటిని చదువలేకపోవడమే ప్రధాన కారణం. రష్యా లో 15 సంవత్సరాలు పైబడినవారిలో మగవారు 60 శాతం ఉంటే, 23 శాతం మంది స్త్రీలున్నారు. కొన్ని దేశాలలో బహిరంగ ప్రదేశాలలో ధూమపానం నిషేధించినప్పటికీ అక్కడ పరిస్థితి మాత్రం మారడం లేదు. ధూమపాన సమస్య ప్రపంచమంతా ఉన్నప్పటికీ ఫ్రాన్స్ లో చేపట్టిన రకరకాల చర్యల కారణంగా అక్కడ సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఫ్రాన్స్ పబ్లిక్ హెల్త్ సంస్థ ప్రకారం 2016-17 మధ్య ఆ దేశంలో దాదాపు 10 లక్షల మంది ధూమపానం మానేశారు. 2006 సంవత్సరంలో ఏదైనా శస్త్రచికిత్స తర్వాత సిగరేట్ తాగని వారు కోలుకున్నంత త్వరగా కోలుకోవడం లేదని ఇతరత్రా సమస్యలు తలెత్తుతున్నాయని సిగరెట్ మానందే మీ తుంటి ఎముకలను, మోకాలి చిప్పలను, ఇతరత్రా సరిచేయలేమంటూ బ్రిటన్ వైద్యులు తెగేసి చెప్పడంతో… ఒక స్వచ్ఛంద సంస్థ జోక్యం చేసుకొని అత్యవసరంగా సర్జరీలు చేయాల్సి వచ్చినపుడు పొగ రాయుళ్లను కనికరించాలని ఆసుపత్రులను ఒప్పించడం జరిగింది.

కాని ప్రభుత్వాలు ఎన్ని నియంత్రణా చర్యలు చేబట్టినప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా పొగతాగే వారి సంఖ్య మాత్రం రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉందని ప్రపంచ నివేదికలు తెలియజేస్తున్నాయి. ధూమపానం మానేసినచో కలిగే ప్రయోజనాలు పరిశీలిస్తే..- 24 గంటలలో నికోటిన్ శరీరం నుండి వైదొలుగుతుంది.- 48 గంటలలో రుచి వాసన చూడటం మెరుగవుతుంది.- 78 గంటలలో శ్వాసక్రియ అభివృద్ధి చెందుతుంది.- 9 నెలల్లో దగ్గు 10 శాతం తగ్గుతుంది.- 12 నెలలలోపు గుండె జబ్బుల ప్రమాదం 50 శాతం తగ్గిపోతుంది.- 10 సంత్సరాలలో ఊపిరితిత్తుల కేన్సర్ 58 శాతం తగ్గిపోతుందని, ముఖ్యంగా మానేసిన వెంటనే చిరాకు, కోపం, మలబద్దకం, మగత నిద్ర వంటి ఇబ్బందులు తొలిగిపోతాయి అని వైద్యులు నివేదికల రూపంలో వెల్లడిస్తున్నారు. కాబట్టి ధూమపానం మానేస్తే అంతా ఆరోగ్యమే..

కాకపోతే’ మానే దమ్ముండాలి’. ధూమపానానికి దూరంగా ఉండాలనుకునే వారు వైద్యులను సంప్రదించాలి. వ్యసనం నుంచి బయటపడేందుకు కౌన్సిలింగ్ తీసుకోవాలి. అవసరమైతే వైద్యుల మార్గదర్శకంలో మందులు కూడా వాడవలసి ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక థీమ్ తో కార్యక్రమం నిర్వహించే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ 2022 సంవత్సరంకుగాను ‘పొగాకు -మన పర్యావరణానికి ముప్పు’ అనే థీమ్‌తో నిర్వహించుకుందామని పిలుపునిచ్చింది. వ్యక్తి ఎవరైనా సరే తన ఆరోగ్యం తాను పాడు చేసుకుంటే మనకు ఎటువంటి అభ్యంతరం లేదు. కాని మన ఆరోగ్యాన్ని పాడు చేసే హక్కు మాత్రం ఇతరులెవరికీ లేదు. నలుగురు కూడిన చోట నా ఇష్టం అంటూ ఎవరైనా పొగ తాగడం మొదలు పెడితే నీ ఇష్టం నీ ఇంట్లో కాని బజారులో కాదంటూ ప్రతిఘటించాల్సిన అవసరంతో పాటు పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి పై ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News