బహుశా పాట అంత పురాతనమైంది ఆశు కవిత్వం కూడా నేమో. మనిషి తనలోని ఉద్వేగాలను వ్యక్తం చేసేందుకు ఎంచుకున్న అనేక మాధ్యమాలలో ఇవి రెండూ ముఖ్యమైనవి. అంతేకాదు మానవులకి తమ స్వప్నాలను, కోరికలను, అలవికాని ఊహలను వ్యక్తం చేసేందుకు కూడా కవిత్వం ఒక సాధనం అయింది. ఇంతకీ కవిత్వం అంటే ఏమిటి? ఎందుకోసం, ఎవరి కోసం రాస్తా రు? అనే ప్రశ్నలను వేసుకోని, కవితాత్మకంగా సమాధానం చెప్పేందుకు ప్రయత్నం చేయని కవులు ఎవరూ లేకపోవచ్చు.
కవిత్వం హృదయ గతమైంది. అంతరాంతరాళాల్లో ని వ్యక్తావ్యక్త ఆలోచనలని, ఉద్విగ్న భావాలను చెప్పే ప్రయత్నాన్ని తూచేందుకు కొలమానాలు దొరకటం కష్టమేనేమో. శ్రీశ్రీ అన్నట్టు కవిత్వం ఒక తీరని దాహమే. అలాగే ఆయనే అన్నట్లు కవిత్వం రాయడానికి అనర్హమైన వస్తువు కూడా ఏదీ లేదు. ప్రపంచం అంతటా కవిత్వంలో అనేక ధోరణులు, ప్రయోగాలు చిరకాలంగా జరుగుతూనే ఉన్నాయి.
కవిత్వానికి జనహృదయాల్ని కదిలించే, గెలిచే, మనిషి ఆలోచనల్ని ప్రభావితం చేసే శక్తి ఉంది కాబట్టే, దాన్ని సామాజిక మార్పు కోసం, ఒక మంచి సమాజాన్ని తీసుకొచ్చేందుకు తమ నిరసనను, ధిక్కారాన్ని వ్యక్తం చేసేందుకు తమ సాధనంగా చేసుకున్న కవులు ఎందరో ఉన్నారు. అందువల్లేనేమో పదుగురికి ఉపయోగపడే, కొన్ని మంచి మాటల్ని చెప్పేందుకు యునెస్కో కూడా కవిత్వాన్ని ఒక మాధ్యమంగా ఎంచుకుంది.1999లో యునెస్కో కవిత్వ అభివ్యక్తి ద్వారా అంతరించిపోతున్న భాషలతో సహా, వివిధ భాషలకు ప్రాధాన్యత ఇవ్వడం, కవిత్వం రాయడాన్ని, చదవడాన్ని సమాజంలో ప్రోత్సహించాలని భావిస్తూ , మార్చ్ 21వ తేదీ నాడు ప్రపంచ కవితా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరపాలని ఒక ప్రతిపాదనను చేసింది. అప్పటి నుంచి ప్రపం చ కవితా దినోత్సవాన్ని ప్రతి ఏడాది మార్చ్ 21వ తేదీన జరుపుకోవడం ఒక ఆనవాయితీగా మారింది. ప్రతిసారి ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఒక ప్రధానమైన అంశాన్ని కవిత్వ థీమ్ గా యునెస్కో ప్రకటిస్తుంది. ఇప్పుటి వరకు స్వేచ్ఛ, మార్పు, రాసే హక్కు, ప్రజలతో సంబంధాలు ఇలా అనేక అంశాలని కవిత్వ థీమ్స్ గా ప్రకటించింది.
ఈ ఏడాది 2025 ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా‘శాంతి, ఐక్యత కొరకు కవిత్వం‘అనే థీమ్‌ని తీసుకున్నారు. ఈ కవిత ఉత్సవాన్ని ఎలా జరిపితే బాగుంటుందో కూడా అది కొన్ని సూచనలని చేసింది. పాఠశాలలో, కళాశాలలో విద్యార్థులకు కవిత్వ పోటీలను పెట్టడంతోపాటు, వివిధ ప్రాంతాలలో సభలు, సమావేశాలు, కవి సమ్మేళనాలు, ఊరేగింపులు నిర్వహిస్తూ 2025 సంవత్సరానికి గాను యునెస్కో ఇచ్చిన ‘శాంతి ఐక్యతల కోసం’ కవిత్వాన్ని ప్రచారం చేయాలని కోరింది. దేశంలోనూ, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నూ ఈ సందర్భం గా కవులు కలుసుకోవడం, సభలను, కవి సమ్మేళనాలను నిర్వహించడం కొంతకాలంగా జరుగుతూ ఉంది. ప్రపంచమంతటా మార్చి 21న కవిత్వ కార్యక్రమాలు ఒక ఉత్సవంగా సాగుతాయి. కవిత్వాన్ని రాసిన కవులు కనుమరుగవచ్చు కానీ వారు రాసిన మంచి కవిత్వం చిరకాలం మరణం లేకుండా మనుషుల హృదయాల్లో, సమాజంలోనూ నిలిచి ఉంటుంది.