Sunday, December 22, 2024

వ్యత్యాసాలే పేదరిక మూలాలు

- Advertisement -
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా 2030 నాటికి పేదరికాన్ని నిర్మూలించాలన్న లక్ష్యం చేరుకోవటం సాధ్యం కాదని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. ప్రపంచ జనాభాలో ఇప్పటికీ 72 కోట్ల మంది అత్యంత పేదరికంలో జీవిస్తున్నారని ప్రపంచ బ్యాంకు నివేదిక వెల్లడించింది. ఆఫ్రికా ఖండంలోని దేశాలలో ఎక్కువ పేదరికం ఉన్నదని పేర్కొన్నది. ప్రపంచ బ్యాంకు వెల్లడించిన పేదరికం లెక్కలు కూడా వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పేదరికం తీరుతెన్నుల పై బహుముఖ పేదరిక సూచి మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఎంపిఐని యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ (ప్రోగ్రామ్ యుఎన్ పిడి) ఆక్స్‌ఫర్డ్ పావర్టీ అండ్ హ్యుమన్ డెవలప్‌మెంట్ ఇనీషియేటివ్ ఇటీవల వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా పేదలు ఎదుర్కొనే అనేక రకాల అంశాలను, అంటే చదువు లేకపోవటం, పోషకాహారం లేకపోవటం, సరైన వైద్య సహాయం అందక పోవటం, రక్షిత మంచి నీరు లేకపోవటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ సూచి రూపొందించామని ఒపిహెచ్ ప్రచురించిన నివేదిక పేర్కొంది. ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న 105 దేశా ల్లో 130 కోట్ల మంది పేదలు ఉన్నారని నివేదిక పేర్కొన్నది.

పేదరికం బాధ గురించి అనేక మంది ప్రముఖులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇలా ఉన్నాయి: ‘పేదరికం అనుభవించే వారి బాధను గుడ్డివారు కూడా చూడగలరు- అని ఆర్థికవేత్త నోబెల్ అవార్డు గ్రహిత అమర్త్యసేన్, పేదరికమనే సముద్రపు దీవుల్లో మనం ఎంత మాత్రం సంతోషంగా జీవించలేము- ఆర్ధికవేత్త స్వామినాథన్. పేదరికం అత్యంత తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన- కెజి బాలకృష్టన్- సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. భారత దేశంలో పేదరికం లెక్కలు తీవ్ర గందరగోళంగా ఉన్నాయి. భారత పాలకులు పేదరికాన్ని ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపుతున్నారు. భారత దేశంలో సుమారు 60 కోట్ల మంది రోజుకి 3.65 డాలర్ల కంటే తక్కువ సంపాదనతో జీవస్తున్నారని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. ఇది కూడా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి చెప్పింది కాదు. చాలా మంది పేదలకు వంద రూపాయలకు మించి సంపాదన లేదు. తినితినక బతుకు తున్నారు. 2005- 06, 2015- 16 మధ్య 63.5 కోట్ల నుంచి 36.4 కోట్లకు పేదరికం తగ్గిందనే లెక్కలు చెబుతున్నారు. నీతి ఆయోగ్ 2021 నివేదిక ప్రకారం భారత దేశంలో మొత్తం పేదరికం 25%గా ఉంది. అంటే దేశ జనాభా రీత్యా సుమారు 35 కోట్ల మంది పేదరికంలో ఉన్నారు.

పేదరికం అనేది ఆర్ధిక అసమానతల ఫలితంగా ఏర్పడినది. కనీస అవసరాలైన తిండి, గూడు, బట్టలు, వైద్యం, విద్యను పేదరికం దూరం చేస్తుంది. ఒక వ్యక్తి రోజుకి 2300 కేలరీల కంటే తక్కువ ఆహారం తీసుకుంటే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నట్లుగా చెబుతున్నారు. భారత దేశంలోని గ్రామీణ ప్రాంతంలో 2400 కేలరీలు, పట్టణ ప్రాంతాల్లో 210 0కేలరీల ఆహారం అవసరమని ప్రణాళికా సంఘం తెలిపింది. ఇది ప్రపంచ బ్యాంకు చెప్పిన ప్రమాణాల కన్నా తక్కువ. స్వాతంత్య్రానికి పూర్వం దాదాబాయ్ నౌరోజీ జైల్లలోని కనీస పౌష్టికాహారం ఆధారంగా పేదరికాన్ని అంచనా వేశాడు. పావర్టీ అండ్ ఇన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకంలో మన దేశం నుంచి బ్రిటన్‌కు సంపద తరిలిపోవటమే భారతదేశంలో పేదరికానికి కారణమని పేర్కొన్నారు. స్వాతంత్య్రానంతరం, పిడి ఓఝా, దండేకర్, నీలకంఠన్ నాద్, మిన్హాస్, పికె బర్దన్, మాంటెక్ సింగ్, ఆహ్లువాలియా గౌరవదత్, రావెల్లీస్, లక్డావాలా తదితరులు పేదరికంపై అంచనా వేశారు. 1960కి పూర్వం పేదరికానికి సంబంధించిన అంచనాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. మన్హాస్ 37%, అహ్లువాలియా 56%, పికె బర్దన్ 54% గా పేదరికాన్ని పేర్కొన్నారు.

1950లో జాతీయ నమూన సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఒ) భారత దేశంలో ఏర్పాటైంది. ఈ సంస్థ 1950 నుంచి 1973 వరకు ప్రతి సంవత్సరం పేదరిక గణాంకాలను అంచనా వేసింది. నెలసరి తలసరి వినియోగ వ్యయాన్ని గ్రామీణ ప్రాంతంలో రూ. 49, పట్టణ ప్రాంతంలో 56 రూపాయలగా నిర్ణయించారు. 1972 -73 నుంచి ప్రతి ఐదు సంవత్సరాలకొకసారి పేదరిక గణాంకాలను సేకరించింది. 2019లో జాతీయ నమూన సర్వే సంస్థను, కేంద్ర గణాంకాల సంస్థ (సిఎస్‌ఒ)ను విలీనం చేసి జాతీయ గణాంకాల (ఎన్‌ఎస్‌ఒ)సంస్థను ఏర్పాటు చేశారు. నాలుగవ పంచవర్ష ప్రణాళిక కాలంలో (1969-74) ఇందిరా గాంధీ 197 లో గరీబో హఠావో నినాదం ఇచ్చింది. 5 పంచవర్ష ప్రణాళికలో 1974-79) పేదరిక నిర్మూలనకు ప్రధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించి ఇందిరాగాంధీ 20 సూత్రాల పధకాన్ని ప్రకటించింది. దీని ద్వారా పేదరిక నిర్మూలన చేస్తానని ప్రకటించింది.

పాలకుల పేదరిక నిర్మూలనకు చేపట్టిన కార్యక్రమాలు, పథకాలు ఆచరణలో విఫలమైనాయి. దీన్ని మభ్యపెట్టటానికి పేదరిక అంచనాకు కమిటీల పరంపర ప్రారంమైంది. 1979లో వైకె ఆలఘ్ కమిటీ, 1993లో డాక్టర్ లక్డావాలా కమిటీ, 2005లో సురేష్ డి.తెందూల్కర్ కమిటీ అందులో భాగమే. 1993లో లక్డావాలా అధ్యక్షతన ఉన్న కమిటీ రాష్ట్రాల మధ్య ధరల వ్యత్యాసాన్ని, రాష్ట్రాల ప్రత్యేక వినియోగ ధరల సూచి ఆధారంగా పేదరికాన్ని సూచించింది. తెందూల్కర్ కమిటీ తన నివేదికను 2009 కేంద్ర ప్రభుత్వానికి అందచేసింది. నివేదికలో పేదరిక దిగువ ఉన్న వారి రోజువారీ ఖర్చు పట్టణ ప్రాంతాల్లో 32, గ్రామీణ ప్రాంతంలో 26 రూపాయలుగా పేర్కొంది. ఆపైన ఆదాయం ఉన్న వారు పేదరికానికి ఎగువున ఉన్న వారుగా పేర్కొంది. ఇది పేదరికాన్ని అపహాస్యం చేయటమే. నివేదిక ఇచ్చిన తెదూల్కర్ గాని, మంత్రులు గాని, ఒక రోజు ఈ ఖర్చుతో జీవిస్తే తెలుస్తుంది పేదరికం అంటే ఎలా ఉంటున్నది.

టెండూల్కర్ కమిటీ నివేదికపై సర్వత్రా విమర్శలు రావటంతో, ఆయన సూచించిన పేదరిక అధ్యయన పద్ధతిని సమీక్షించేందుకు 2012లో రంగనాథన్ అధ్యక్షతన కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ కమటీ ప్రతి పది మందిలో ముగ్గురు పేదరికంలో ఉన్నట్లు పేర్కొంది. సురేష్ టెండూల్కర్ కమిటీ పేదరికాన్ని 21.9%గా పేర్కొనగా, రంగరాజన్ కమిటీ 29.5% గా పేర్కొంది. మోడీ నాయకత్వాన ఉన్న ఎన్‌డిఎ ప్రభుత్వం కూడా టెండూ ల్కర్ నివేదిక పైనే మొగ్గు చూపింది. ఫలితంగా ఎనిమిది సంవత్సరాల మోడీ ప్రభుత్వ పాలనలో 7 కోట్ల, 60 లక్షల మంది అధనంగా నిరుపేదల జాబితా చేరారు. ఇప్పటికీ భారత దేశంలో పేదలు అత్యధికంగా ఉన్నారని అనేక నివేదికలు తెలుపుతున్నాయి. ప్రపంచ దేశాల్లో తన పరువుపోయి, అవమానం పాలు కావాల్సి వస్తుందని పేదరికాన్ని తగ్గించి చూపేందుకు తనకు అనుకూలమైన వారితో యుపిఎ, ఎన్‌డిఎ ప్రభుత్వాలు కమటీల నాటకాన్ని తెరపైకి తెచ్చాయి. ఈ కమిటీలేవీ క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి లోతుగా పరిశీలన జరిపి పేదరికాన్ని అంచనా వేయకుండా ప్రభుత్వాలకు అనుకూలంగా పేదరికాన్ని తగ్గించి నివేదికలు ఇచ్చాయి. కనీస రోజువారీ జీవన వ్యయం వీరికి తెలిసి కూడ తక్కువ చేసి చెప్పారు.

యుపిఎ, ఎన్‌డిఎ ప్రభుత్వాలు పేదరికాన్ని నిర్మూలించేందుకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాయి. ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్‌మెంట్ పోగ్రాం (ఐఆర్‌డిపి), జవహర్ గ్రామ అభివృద్ధి యోజన, రూరల్ హౌసింగ్- ఇందిర అవాస్ యోజన, పని కోసం ఆహార కార్యక్రమం, జాతీయ వృద్ధాప్య పెక్షన్, సంపూర్ణ రోజ్ గార్ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (దీనదయాల్ అంత్యోదయ యోజన), మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, జాతీయ పట్టణ జీవనోపాధి పథకం, ప్రధాన మంత్రి జనధన్ యోజన, జాతీయ ఆహార భద్రతా చట్టం, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ, -పట్టణ), ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన మొదలైన పథకాలు అందులోనివే. ఈ పథకాలేవీ పేదరికాన్ని రూపుమాపలేక పోయాయి.

పేదరికానికి మౌలిక కారణం ఆర్థిక వ్యత్యాసాలు. భారత సామాజిక వ్యవస్థ వర్గ వైరుధ్యాలతో కూడి ఉంది. గ్రామీణ పేదల జీవనోపాధి అయిన భూమి, కార్మికుల శ్రమశక్తితో పని చేసే పరిశ్రమలు కొద్ది మంది భూస్వాములు, బడా పెట్టుబడిదారుల ఆధీనంలో ఉన్నాయి. ఫలితంగా దేశ సంపదలో 1% మంది వద్ద 25%పైగా ఉంటే 60% ప్రజల వద్ద 19% సంపద మాత్రమే ఉంది. 28% మంది ప్రజల రోజువారీ ఆదాయం 160 రూపాయలు మాత్రమే. దీన్ని గమనిస్తే ఆర్థిక వ్యత్యాసాలు ఏ స్థాయిలో ఉందో వెల్లడవుతుంది. ఈ ఆర్థిక వ్యత్యాసాలు తొలగినప్పుడే పేదరికం తొలగటం మొదలవుతుంది. అందుకు విప్లవ భూసంస్కరణల ద్వారా గ్రామీణ పేదలకు భూ పంపిణీ, పారిశ్రామిక రంగం లో కార్మికులకు భాగస్వామ్యం, శ్రమకు తగ్గవేతనం అమలు జరిగి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలి. బడా భూస్వామ్య, బడా పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పని చేస్తున్న దేశ పాలకులకు వీటిని అమలు జరపరు. వీటి కోసం ప్రజలు ఉద్యమాలు చేయకుండా పక్క దారి పట్టించటానికి భూటకపు సంక్షేమ పథకాలను ముందుకు తెస్తున్నారు. పాలకులకు వ్యతిరేకంగా తమ పేదరికానికి కారణమైన మౌలిక సమస్యల పరిష్కారానికి పేదలు ఉద్యమించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News