Sunday, December 22, 2024

జన విస్ఫోటనం

- Advertisement -
- Advertisement -

ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకొన్నది. పదేళ్ళ కాలంలో వంద కోట్లు పెరిగింది. ఒక్క భారత దేశంలోనే 17.7 కోట్ల మంది అధికంగా వచ్చి చేరారు. జనాభా పెరుగుదల కేవలం ఆసియా, ఆఫ్రికా ఖండాలకే పరిమితం కావడం యూరపు దేశాల్లో తగ్గుతూ వుండడం గమనార్హం. సౌకర్యాలకు, గౌరవప్రదమైన జీవనానికి నోచుకోకుండా హీనంగా, దీనంగా బతుకుతున్న జన సంఖ్య ఇప్పటికే అమితంగా వున్నారు. ఈ పరిస్థితుల్లో నవ శిశువులను ఆహ్వానించడం మంచిదేనా, వారికి తగిన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వగలమనే హామీ వున్నదా? సహజ కొరతల సంగతి అటుంచితే మానవ కల్పితమైన ఆహార, ఇంధన తదుపరి సంక్షోభాలు, యుద్ధాలు, వివక్షలు, ఆంక్షల నేపథ్యంలో ప్రపంచం మరింతగా జనాభాతో కిక్కిరిసిపోడం సంతోషించదగినది కాదు. జనాభా పెరుగుదలను వీలైనంత వరకు పరిమితం చేయడానికి జరిగిన, జరుగుతున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయన్న సమాచారం హర్షించదగినది.

భారత దేశంలో 1992 93లో 3.4 వద్ద నున్న సంతానోత్పత్తి (ఒక మహిళకు జన్మించే పిల్లల రేటు) 2019 2021 నాటికి 2 కి తగ్గిపోడం ముందు ముందు దేశ జనాభా పెరుగుదల సహేతుక స్థాయికి పరిమితం కానున్నదనే ఆశలను కల్పిస్తున్నది. అయినప్పటికీ 2030 నాటికి భారత దేశ జనాభా 151 కోట్లకు చేరుకొని చైనాను మించిపోనున్నదనే సమాచారం ఆందోళనకరమైనది. అప్పటికి చైనా జనాభా 141.6 కోట్లు మాత్రమే కానున్నదని అంచనా వేస్తున్నారు. అంటే ఇప్పుడున్న 145 కోట్ల పై చిలుకు చైనా జనాభా అప్పటికి తగ్గిపోతుందని బోధపడుతున్నది. ఇది చైనా అవలంబిస్తున్న కఠిన నియంత్రణ పద్ధతుల ప్రభావమే. గతంతో పోల్చుకున్నప్పుడు అక్షరాస్యత పెరుగుతున్నది.

ప్రజల్లో అవగాహన మెరుగవుతున్నది. ఇది జనాభా పెరుగుదల మీద సానుకూల ప్రభావం చూపుతుంది. కరోనా ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టి వేసింది. 63 కోట్ల మందికి సోకి 66 లక్షల మందిని బలి తీసుకొన్నది. ఆకలిని పెంచింది. ప్రపంచ వ్యాప్తంగా ఆకలితో బాధపడుతున్న వారి సంఖ్య 2021 నాటికి 82 కోట్లు 80 లక్షలకు చేరుకున్నదని ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవంలో ఈ సంఖ్య ఇంతకంటే ఎక్కువగానే వుంటుంది. 2020లో ప్రపంచ వ్యాప్తంగా 310 కోట్ల మంది ఆరోగ్యప్రదమైన ఆహారాన్ని పొందలేకపోయారు. 2019తో పోలిస్తే 11 కోట్ల 20 లక్షల మంది ఎక్కువ. 2030 నాటికి ప్రపంచ జనాభాలో 8 శాతం మంది ఆకలితో అలమటిస్తారని ఐక్యరాజ్య సమితి నివేదిక అంచనా వేసింది. అంటే దారిద్య్రం ప్రపంచాన్ని ఎప్పటికీ పట్టి పీడిస్తుందని స్పష్టపడుతున్నది.

ఎందువల్ల అనే ప్రశ్నకు సమాధానం చెప్పడానికి శ్రమ పడనక్కర లేదు. ప్రపంచాన్ని నడిపిస్తున్న శక్తులు అసమానతలను పెంచి పోషిస్తున్న కఠోర వాస్తవం కళ్లముందున్నదే. పేద, ధనిక మధ్య వ్యత్యాసం నానాటికీ పెరిగిపోతున్నది. ప్రపంచ జనాభాలో 8.9 శాతం మంది పోషకాహారం లోపంతో బాధపడుతున్నారు. అంటే 66 కోట్ల 30 లక్షల మంది. వాస్తవాలను నిర్మొహమాటంగా ప్రస్తావించుకోవాలంటే ప్రపంచంలో ఆకలి ఇంకా ఇంత తీవ్రంగా వుండడానికి మానవ కల్పిత లోపాలే ఎక్కువ కారణం. పగలు, ద్వేషాలు పెరిగి అమెరికా, దాని మిత్ర యూరపు దేశాలు విధించే ఆర్థిక ఆంక్షల వల్ల ఇరాన్, ఉత్తర కొరియా, సిరియా, క్యూబా, వెనుజులా, జింబాబ్వే వంటి పలు దేశాల్లో ఆకలి, ఆర్థిక బాధలు పెరుగుతున్నాయి. 1990 దశకంలో ఇరాక్‌పై విధించిన ఆర్థిక ఆంక్షలు అక్కడ 10 లక్షల మంది పిల్లలు ఆకలితో దుర్మరణం పాలు కావడానికి దారి తీశాయి. సిరియాలో అమెరికా ఆంక్షలు 93 లక్షల మందిని ఆకలికి ఎర చేశాయి.

అమెరికా తనకు ఇష్టం లేని ప్రభుత్వాలను కూలగొట్టడానికి ఆర్థిక ఆంక్షలను ఒక ఆయుధంగా చేసుకున్నది. అక్కడి ప్రజలకు ఆహారం, మందులు వంటివి లభించకుండా చేయడం ద్వారా వారి ప్రభుత్వాలపై వారిలో అసంతృప్తిని, ఆగ్రహాన్ని రెచ్చగొట్టే అమానుషమైన విధానాన్ని అమెరికా, దాని మిత్ర దేశాలు పాటిస్తున్నాయి. వీటికి తోడు ఆయిల్ తదితర నిక్షేపాలను కొల్లగొట్టడానికి ఆయా దేశాలపై అమెరికా జరిపే దాడులు అక్కడి ప్రజలను మరిన్ని ఇక్కట్లకు గురి చేస్తున్నాయి. ప్రస్తుత ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల మొత్తం ప్రపంచమే ఆహార, ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఈ విధంగా మనిషే తన అత్యాశతో, స్వార్థంతో సాటి మనుషులను, బలహీనులను ఆకలికి, అనారోగ్యానికి బలి ఇస్తూ ప్రపంచ సమస్యలన్నింటికీ కేవలం జనాభా పెరుగుదలే కారణమనే అభిప్రాయాన్ని కల్పించడం కంటే ఆత్మవంచన మరొకటి వుండదు. యుద్ధాలను ఆపడంలో గాని, అమెరికా వంటి బలమైన దేశాలు విధించే ఆంక్షలకు తెర దించడంలో గాని ఐక్యరాజ్య సమితి నిరుపయోగంగా నిరూపించుకొంటున్నది. అంటే మానవాళిలోని మానవీయత లోపం స్పష్టంగా కనిపిస్తున్నది. దీనిని తొలగించుకోకపోతే జనాభా పెరుగుదల రేటు ఎంత తగ్గినా ప్రయోజనం వుండదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News