Sunday, December 22, 2024

800,00,00,000

- Advertisement -
- Advertisement -

ఐక్యరాజ్య సమితి: ప్రపంచ జనాభా మరో మైలురాయిని చేరుకుంది.ప్రస్తుతం ఈ భూమి మీద ఉన్న జనాల సంఖ్య 800 కోట్లకు చేరుకుంది. 800 కోట్ల శిశువు మంగళవారం ఈ భూమి మీదికి వచ్చినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. 48 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఇది రెట్టింపు. 1974లో ప్రపంచ జనాభా 400 కోట్లుగా ఉండేది. వైద్యం సహా అనేక రంగాల్లో మానవాళి సాధించిన అనేక పురోగతుల కారణంగా అకాల మరణాలు తగ్గడంతో పాటు ఆయుర్దాయం గణనీయంగా పెరగడం ఇందుకు ప్రధాన కారణమని ఐరాస తెలిపింది. మరో 15 ఏళ్లకు అంటే 2037 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది.

క్రీస్తుపూర్వం 8000 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా దాదాపు 50 లక్షలుగా ఉండేదని అంచనా. క్రీస్తుశకం ఒకటే శతాబ్దం నాటికి అది 20 కోట్లకు చేరింది. కొన్ని అంచనాలు మాత్రం 30 కోట్లు, 60 కోట్లుగా చెబుతున్నాయి. 1804 సంవత్సరంలో ప్రపంచ జనాభా 100 కోట్లకు చేరింది. పారిశ్రామిక విప్లవంతో ఆర్థిక పురోభివృద్ధి ఊపందుకుంది. వైద్యంలో అద్భుత పురోగతి కారణంగా అకాల మరణాలు తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా శిశువుల్లో అకాల మరణాలు బాగా తగ్గిపోయాయి. ఫలితంగా సగటు ఆయుర్దాయం గణనీయంగా పెరిగింది. ఇది జనాభా పెరుగుదలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ప్రపంచ జనాభా 200 కోట్లకు చేరుకోవడానికి మరో 106 ఏళ్లు (1930) పట్టింది.

300 కోట్ల మార్కుకు మరో 30 ఏళ్లు,(1960),400 కోట్ల స్థాయికి 14 ఏళు ్ల(1974),500 కోట్ల మార్కును తాకడానికి మరో 13 ఏళ్లు (1987) పట్టింది. అయితే 600 కోట్ల మార్కును మాత్రం శరవేగంగా అంటే 11 సంవత్సరాల్లోనే (1998) మానవాళి సాధించింది. అనంతరం 700 కోట్ల మార్కును చేరుకోవడానికి 12 ఏళ్లు(2010) పట్టింది. ఆ తర్వాత మరో పుష్కరకాలానికి (నవంబర్ 15,2022) 800 కోట్ల మార్కును తాకింది.700 కోట్లనుంచి 800 కోట్లకు జనాభా పెరుగుదలలో 70 శాతం మంది తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన వారు, తక్కువ, మధ్య తరగతి ఆదాయ వర్గ దేశాలకు చెందిన వారేనని కూడా ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది. పెరిగిన వందకోట్ల జనాభాలో 90 శాతం ఈ రెండు గ్రూపులకు చెందిన దేశాలకు చెందిన వారే ఉన్నారని కూడా స్పష్టం చేసింది.

2023కే చైనాను దాటేయనున్న భారత్

2023 నాటికి చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరిస్తుందని ఐరాస అంచనా వేసింది. ప్రస్తుతం మన దేశ జనాభా 141.2 కోట్ల మేర ఉండగా.. 2050 నాటికి అది దాదాపు 170 కోట్లకు చేరుకుంటుందని ఐరాస అంచనా వేసింది. చైనా జనాభా ప్రస్తుతం 145 కోట్లు ఉండగా.. 2050 నాటికి 130 కోట్లకు తగ్గవచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. 2022లో భారత జనాభాలో 68 శాతం 15 64 ఏళ్ల మధ్య వయసు వారు కాగా, 65 ఏళ్లు , అంతకు పైబడిన వారు జనాభాలో 7 శాతం ఉన్నట్లు ఐరాస తెలిపింది.

చైనా ప్రభుత్వం అనుసరిస్తున్న ఒక కుటుంబం, ఒకే సంతానం విధానం కారణంగా సంతానోత్పత్తి తగ్గిపోవడం అక్కడ జనాభా తగ్గుదలకు ప్రధాన కారణం. అదే సమయంలో చైనా వయో వృద్ధుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. 2040 నాటికి చైనా మొత్తం జనాభాలో 28 శాతం మంది 60 ఏళ్లు అంతకు పైబడిన వారు ఉంటారని ఐరాస అంచనా వేసింది.2050 నాటికి పెరగబోయే జనాభాలో దాదాపు సగం మంది కేవలం ఎనిమిది దేశాలు కాంగో,ఈజిప్టు, ఇథియోపియా, భారత్, నైజీరియా, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్ టాంజానియా దేశాలకు చెందిన వారే ఉంటారని ఐరాస నివేదిక అంచనా వేసింది.

భారత్ దీన్ని అవకాశంగా చూడాలి: నిపుణులు

కాగా, వచ్చే ఏడాది నాటికి భారత్ చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారనుందన్న అంచనాల నేపథ్యంలో ప్రపంచానికి వనరులను సృష్టించే వనరుగా దీన్ని చూడాలని, సమానత్వం ఉండేలా చూడడంపైన, వయో వృద్ధుల జనాభా పట్ల మరింత ఎక్కువ శ్రద్ధ చూపించడం పట్ల దృష్టి పెట్టాలని నిపుణులు అంటున్నారు. ‘ఈ మైలురాయిని ఒక సమస్యగా కాక ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన జీవనాన్ని అందించడానికిభారత్‌కు ఒక అవకాశంగా చూడాలి’అని పాపులేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా( పిఎఫ్‌ఐ) అభిప్రాయ పడింది‘ ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకున్న రోజున మనమంతా పండగ చేసుకోవాలి’ అని ఆ సంస్థ అభిప్రాయపడింది.

‘ ప్రపంచవ్యాప్తంగా జనాభా స్థిరీకరణ అవుతోందన్న విషయం మనందరికీ తెలుసు. ప్రపంచ జనాభా 700 కోట్లనుంచి 800 కోట్లకు చేరుకోవడానికి 12 ఏళ్లు పడితే, అది 900 కోట్లకు చేరుకోవడానికి కనీసం 15 ఏళ్లు అంటే 2037 సంవత్సరం దాకా పడుతుంది. అంటే జనాభా వృద్ధి మందగిస్తోందని అర్థం. అందువల్ల మనం ఇప్పుడు బిడ్డలు కావాలా, కావలసి వస్తే ఎప్పుడు కనాలి, ఎంతమందిని , ఎంత అంతరంతో కనాలి అనే దాన్ని స్త్రీలే నిర్ణయించుకునే దానిపై దృష్టిపెట్టాలి’ అని పిఎఫ్‌ఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పూనమ్ ముత్రెజా అభిప్రాయపడ్డారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News