Friday, December 20, 2024

భావ ప్రకటనా స్వేచ్ఛకు భరోసా

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ విధానాల విశ్లేషణలు, విమర్శలు, అనుకూల ప్రతికూలతలు, అవినీతిపరుల బండారాల్ని బయట పెట్టడం, మానవ హక్కుల పరిరక్షణ సేవలు, విజ్ఞాన, వినోద, క్రీడ, రాజకీయ సమాచార వితరణలు, ప్రజా సమస్యలకు గళం కలపడం లాంటి అంశాల్లో పత్రికలు అద్వితీయ సేవలు అనుదినం అందిస్తున్నాయి. ఆందోళనకర పరిస్థితుల్లో జీవన చక్రం సజావుగా సాగేలా చూడడం, ప్రజలకు నిరంతరం అత్యవసర సమాచా రాన్ని అందించడం లాంటి సేవలను పత్రికలు, సమాచార సాధనాలు బాధ్యతగా అందిస్తున్నాయి.

పత్రికలు, ప్రసార మాధ్యమాలు స్వేచ్ఛగా పని చేయగల సమాజంలోనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న పత్రికా స్వేచ్ఛను పరిరక్షించేందుకు ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని యునిసెఫ్, యునెస్కో వంటి సంస్థలు కృషి చేస్తున్నాయి. ఆఫ్రికాలోని చాలా దేశాల్లో పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు ఉండేవి. వాటికి నిరసనగా ఆఫ్రికన్ జర్నలిస్టులు 1991, ఏప్రిల్ 29 నుండి మే 3వ తేదీ వరకు ఆఫ్రికాలోని నమీబియా దేశపు విండ్ హాక్ నగరంలో సమావేశం ఏర్పాటుచేసి పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన అనేక తీర్మానాలు వచ్చాయి. ఆఫ్రికన్ జర్నలిస్టుల నిరసనగా గుర్తుగా మే 3వ తేదీని ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా జరపాలని 1993, డిసెంబరు నెలలో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం నిర్ణయించింది. అప్పటి నుంచి ఏటా మే 3న ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పత్రికా స్వేచ్ఛను అంచనా వేయడం, దానిని రక్షించడం.

విధుల్లో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు నివాళి అర్పించడం అనేవి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం లక్ష్యాలు. ఈ దశాబ్దంలో డిజిటల్ సాంకేతికతలు, సామాజిక, ప్రసార మాధ్యమాలు ఇబ్బడిముబ్బడిగా అందుబాటులోకి రావడంతో సమాచార ప్రవాహం ఊపందుకొంది. తద్వారా పత్రికా స్వేచ్ఛ తీవ్రంగా ప్రభావితమవుతోంది. అంతర్జాతీయ సమాజంలో నేడు అసమానతలు, సంఘర్షణలు, హింస పెచ్చుమీరుతున్నాయి. పర్యావరణ సంక్షోభం, ప్రజారోగ్యం వంటి ఎన్నో సవాళ్లు ముసురుకున్నాయి. ఇవన్నీ మానవ హక్కులపై ఆధారపడిన సంస్థలను ప్రభావితం చేస్తున్నాయి. రాజకీయ, సామాజిక పరిస్థితుల కారణంగా ఇంటర్ నెట్ సేవలను నిలిపివేయడం, వాస్తవ విశ్లేషణలను అడ్డుకోవడం, ప్రసార మాధ్యమాల అణచివేతకు దిగడం వంటి పరిణామాలు ఎక్కువయ్యాయి.

బెదిరింపు ధోరణులు ప్రబలడంతో ప్రపంచ వ్యాప్తంగా భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, మానవ హక్కులు ప్రమాదంలో పడ్డాయి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ నిజంగా దఖలు పడినప్పుడే- ప్రజానిధుల దుర్వినియోగం, మనుషుల అక్రమ రవాణా, దుర్విచక్షణ, అసమానతలు వెలుగులోకి వస్తాయి. ఈ ఏడాది ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం భావప్రకటనా స్వేచ్ఛ, ఇతర హక్కులను ఎలుగెత్తి చాటాలన్నది యునిసెఫ్ ధ్యేయం. పత్రికా స్వేచ్ఛ ద్వారా మహిళలు, బాలల హక్కులు, డిజిటల్ హక్కులు, పర్యావరణ పరిరక్షణ, అవినీతికి వ్యతిరేకంగా పోరాడే హక్కుల విషయంలో అడ్డంకులను అధిగమించేందుకు మార్గదర్శనం అవసరమని ఆ సంస్థ ఆకాంక్షిస్తోంది.

ప్రభుత్వ విధానాల విశ్లేషణలు, విమర్శలు, అనుకూల, ప్రతికూలతలు, అవినీతిపరుల బండారాల్ని బయటపెట్టడం, మానవ హక్కుల పరిరక్షణ సేవలు, విజ్ఞాన, వినోద, క్రీడ, రాజకీయ సమాచార వితరణలు, ప్రజాసమస్యలకు గళం కలపడం లాంటి అంశా ల్లో పత్రికలు అద్వితీయ సేవలు అనుదినం అందిస్తున్నాయి. ఆందోళనకర పరిస్థితుల్లో జీవన చక్రం సజావుగా సాగేలా చూడడం, ప్రజలకు నిరంతరం అత్యవసర సమాచారాన్ని, సేవలను అందించడం లాంటి సేవలను పత్రికలు, సమాచార సాధనాలు బాధ్యతగా అందిస్తున్నాయి.

ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య దేశంలోనైనా సమాజంలో జరుగుతున్న సంఘటనలు, పరిణామాల సమగ్ర సమాచారాన్ని పౌరులకు పత్రికలే అందజేస్తాయి. ఆ సమాచారం ప్రాధాన్యతను విశ్లేషించి వాటికి భాష్యం చెప్పాలి. సంపాదకీయాలు, వ్యాసాలు పత్రికలే ప్రచురించాలి. వర్తమానంలో అందిన సామాజిక వారసత్వాన్ని రానున్న తరాలవారికి అందజేయాలి. వినోదాన్ని కలిగిస్తూ మానసిక ఒత్తిడిని తగ్గించడం పత్రికల సామాజిక బాధ్యతగానే పరిగణించాలి. దీనికి పత్రికలకు స్వేచ్ఛ కూడా అత్యవసరం. భారత దేశంలో పత్రికల పాత్ర పరిశీలిస్తే స్వాతంత్య్రోద్యమ కాలం నుంచి నేటి వరకూ ప్రజలను చైతన్యం చేసే ముఖ్య సాధనాలు పత్రికలే. నేడు గాడి తప్పుతున్న ప్రజాస్వామ్యానికి కాపలాదారుగా వ్యవహరిస్తున్న మీడియా అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది.

వ్యవస్థల్లో, సమాజంలో వేళ్లూనుకొన్న అవినీతి, అక్రమాలు వెలుగులోకి రాకుండా మీడియా సంస్థల గొంతు నులిమే చర్యలు ఉధృతమవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. పెరుగుతున్న దాడులు, దేశంలో పాత్రికేయులపై దాడు లు, కేసులు, హత్యలు సర్వసాధారణంగా మారిపోయాయి. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచంలో గుర్తింపు పొందినా, పత్రికా స్వేచ్ఛలో మాత్రం మన దేశం దాదాపు అట్టడుగు స్థానంలోనే ఉంది. రాచరిక పాలనలో ఉన్న దేశాలు నేపాల్, భూటాన్ వంటి చిన్న చిన్న పొరుగు దేశాలు, చివరకు వెనుకబడిన ఆఫ్రికన్ దేశాల్లో కొన్ని సైతం పత్రికా స్వేచ్ఛలో మనకంటే మెరుగైన పరిస్థితిలోనే ఉన్నాయి. ప్రభుత్వ సంస్థల నుంచే కాకుండా రాజకీయ నాయకులు, నేరస్థులు, అవినీతిపరుల నుంచీ వారికి బెదిరింపులు వస్తున్నాయి. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు అద్దం పట్టాల్సిన మీడియా సంస్థలు నేడు అనేక దేశాల్లో ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేయాల్సి వస్తోంది.

ముద్దం నరసింహస్వామి
99498 39699

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News