ఏడున్నర ఏళ్లలోనే రామప్పకు – భూదాన్ పోచంపల్లికి
ప్రపంచస్థాయి గుర్తింపు రావడం గర్వంగా ఉంది
ఇప్పటికైనా అన్ని రాష్ట్రాలను కేంద్రం ఒకేలా చూడాలి
త్వరలోనే బుద్ధవనానికి అంతర్జాతీయ గుర్తింపు రాబోతోంది
మంత్రి శ్రీనివాస్ గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్: ‘భూదాన్ పోచంపల్లి’కి ప్రపంచస్థాయి గుర్తింపు రావడం సంతోషకరమని, తెలంగాణ ఏర్పడిన ఏడున్నర ఏళ్లలోనే రామప్పకు,- పోచంపల్లికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడం గర్వంగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మంత్రి కెటిఆర్ ఆధ్వర్యంలో టెక్స్‌టైల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. బుధవారం మంత్రుల క్వార్టర్స్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిజాం ప్రభుత్వంలో అగ్గిపెట్టలో చీరను నేసిన ఘనత భూదాన్ పోచంపల్లికే దక్కుతుందన్నారు. తాము చేసే ప్రయత్నాలకు ఫలితాలు వస్తే ముందుగా గుర్తింపు ఇండియాకే వస్తదని, త్వరలోనే బుద్ధవనానికి అంతర్జాతీయ గుర్తింపు రాబోతోందని ఆయన తెలిపారు.
ఇప్పటికైనా అన్ని రాష్ట్రాలను ఒకేలా చూడాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి పేర్కొన్నారు. ఒక్కో రాష్ట్రాన్ని ఒక్కోలా సవతి తల్లి ప్రేమ చూపకుండా కేంద్రం నిధులు విడుదల చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. ఒకప్పుడు ప్రపంచంలోనే ధనిక దేశంగా ఈ ప్రాంతం ఉందని, ఆ మూలాలు ఇంకా పోలేదని, రామప్ప అభివృద్ధికి రూ.300 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నానని మంత్రి తెలిపారు. దీంతోపాటు భూదాన్ పోచంపల్లి అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరుతున్నానని, త్వరలోనే కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి తెలంగాణ అభివృద్ధికి సహకారం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తానని ఆయన తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్న చారిత్రక, పర్యాటక ప్రాంతాల పట్ల గత పాలకులు నిర్లక్ష్యం వహించారని ఆయన ఆరోపించారు. అనంతరం ప్రముఖ డాక్యుమెంటరీ డైరెక్టర్ దూలం సత్యనారాయణ భూదాన్ పోచంపల్లిపై రూపొందించిన డాక్యుమెంటరీని మంత్రి శ్రీనివాస్ గౌడ్, టూరిజం ఎండి మనోహర్ గారితో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ ఈడి శంకర్ రెడ్డి పాల్గొన్నారు.