రాజస్థాన్‌లో 369 అడుగుల ఎత్తయిన విశ్వ స్వరూపం
జైపూర్: రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లా నాథ్‌ద్వార పట్టణంలో ప్రతిష్టించిన 369 అడుగుల ఎత్తయిన మహాశివుని విగ్రహం విశ్వ స్వరూపం శనివారం ప్రారంభం కానున్నది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన శివుని విగ్రహంగా పేర్కొంటున్న విశ్వ స్వరూపాన్ని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, అసెంబ్లీ స్పీకర్ సిపి జోసి సమక్షంలో ఆధ్మాత్మిక ప్రవచనకర్త మురారి బాపు ప్రారంభించనున్నారు. ఉదయపూర్‌కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాథ్‌ద్వార పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని తత్ పదమ్ సంస్థాన్ రూపొందించింది. విగ్రహ ప్రారంభానంతరం అక్టోబర్ 29 నుంచి నవంబర్ 6 వరకు తొమ్మిది రోజుల పాటు ఆధ్యాత్మిక, మతసంబంధ, సాంస్కృతిక కార్యక్రమాలు వరుసగా జరుగుతాయని సంస్థాన్ ట్రస్టీ, మీరజ్ గ్రూప్ చైర్మన్ మదన్ పాలివాల్ తెలిపారు.
ఈ తొమ్మిది రోజుల కార్యక్రమాలలో ఆధ్మాత్మిక ప్రవచనకర్త మురారీ బాపుచే రామకథాగానం ఉంటుందని తెలిపారు. కొండపైన ప్రతిష్టించిన ధ్యానముద్రలో ఉన్న శివుని విగ్రహం 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా దర్శనమిస్తుందని ఆయన తెలిపారు.అద్భుతమైన ఈ శివుని విగ్రహ ప్రతిష్టాపనతో ఈ నగరంలో ఆధ్మాత్మిక పర్యాటకం అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. ప్రత్యేక విద్యుద్దీపాలకంరణ చేయడం వల్ల రాత్రి వేళల్లో కూడా విగ్రహం దేదీప్యమానంగా కనపడుతుందని ఆయన వివరించారు. పదేళ్లపాటు నిర్మాణం జరుపుకున్న ఈ విగ్రహం కోసం 3 వేల టన్నుల ఇనుము, ఉక్కు, 2.5 లక్షల ఘనపు టన్నుల కాంక్రీట్, ఇసుక ఉపయోగించినట్లు ఆయన తెలిపారు.