ఆగస్టు 5,6 తేదీల్లో ఘనంగా సింగపూర్‌లో నిర్వహణ : ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్
హైదరాబాద్: మొట్టమొదటి ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు సింగపూర్‌లో ఆగస్టు 5, 6వ తేదీల్లో జరగనున్నాయని ఈ మహాసభలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు టెక్నో క్రాట్స్ పెద్ద సంఖ్యలో హాజరుకావాలని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ పిలుపునిచ్చారు. సోమవారం ఆయన టెక్నాక్రాట్స్‌కు బహిరంగ లేఖ రాశారు. దాదాపు 100కు పైగా దేశాల నుంచి తెలుగు రా ష్ట్రాలకు చెందిన ఐటీ దిగ్గజ సంస్థల ప్రతినిధులు, నిపుణులు, ఇన్వెస్టర్లు, స్టార్టప్‌లు, టెక్నో క్రాట్స్ హాజరు కానున్న ప్రపంచ తెలుగు ఐటీ మహాసభల ద్వారా ఇటు పరిశ్రమ అభివృద్ది అటు స్వరాష్ట్రంలో పెట్టుబడులు అనే అంశంపై విస్తృత అవకాశాలు పొందగలరని వివరించారు.
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో, స్వదేశాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాలతో సంబంధం ఉన్న ఐటీ రంగ నిపుణులు, ఇన్వెస్టర్లు, స్టార్టప్‌లను ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు వరల్డ్ తెలంగాణ ఐటీ కౌన్సిల్ సందీప్‌కుమార్ మఖ్తల నాయకత్వంలో ఏర్పడిందన్నారు. ఈప్రయత్నాన్ని విజయవంతం చేయడంలో భాగంగా ఆయన అమెరికా, కెనడా, మెక్సికో, మలేషియా, సింగపూర్, ఒమన్, యుఏఈ దేశాలలో పర్యటించి ఆయా వర్గాలతో సమావేశమయ్యారు. దీంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ పరిశ్రమ తెలుగు ప్రముఖులను సమావేశ పర్చేందుకు ఉమ్మడి తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల సహాయ సహాకారాలతో మహాసభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈసభల అవశ్యకత, కలిగే ప్రయోజనాల గురించి లేఖ విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈసభలు చరిత్రలో నిలిచిపోతాయని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఐటీ పరిశ్రమకు చెందిన నిపుణులు, ఇన్వెస్టర్లు హాజరైతున్న మహాసభలకు తాను పాలుపంచుకోవడం సంతోషంగా ఉందని జయశ్ రంజన్ తెలిపారు. ఈసభకు ఐటీ పరిశ్రమ నిపుణులు సమావేశం కావడం వివిధ అంశాలపై అభిప్రాయాల వ్యక్తీకరణ, మెరుగైన సంబంధాలు ఏర్పరచుకోవడం ఈమహాసభ ద్వారా జరిగే కీలకమైన అంశాలు ఉంటాయన్నారు. తెలుగు రా ష్ట్రాలకు చెందిన ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియర్ అధికారులతో సమావేశం కావడం మహాసభకు చెందిన మరో ముఖ్యమైన అవకాశమన్నారు. ఈసమావేశాలను సద్వినియోగం చేసుకుని పాల్గొనడం ద్వారా వ్యక్తిగతంగా, సంస్థాగతంగా అభివృద్ది చెందడమే కాకుండా తెలుగు ఐటీ పరిశ్రమ సత్తాను చాటేందుకు సైతం అవకాశం అందించనవారు అవుతారని వెల్లడించారు. ఈసమావేశానికి హాజరయ్యేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. సందేహాలు ఉంటే నివృత్తి కోసం చైర్మన్ సందీప్ ముఖ్తలను 8123457575 నంబర్ల ద్వారా సంప్రందించాలని కోరారు.