Friday, November 22, 2024

ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్.. అగ్రస్థానానికి జకోవిచ్

- Advertisement -
- Advertisement -

అగ్రస్థానానికి జకోవిచ్
టాప్‌ను కోల్పోయిన అల్కరాస్
ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్
లండన్: ప్రపంచ పురుషుల టెన్నిస్ ర్యాంకింగ్స్‌లో సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించిన నొవాక్ తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఇప్పటి వరకు టాప్ ర్యాంక్‌లో ఉన్న స్పెయిన్ యువ సంచలనం కార్లొస్ అల్కరాస్ రెండో స్థానానికి పడిపోయాడు. యూఎస్ ఓపెన్‌లో అసాధారణ ఆటతో టైటిల్‌ను దక్కించుకున్న జకోవిచ్ ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటాడు. ఈ క్రమంలో ఏకంగా 2000 రేటింగ్ పాయింట్లను మెరుగు పరుచుకుని టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ప్రస్తుతం జకోవిచ్ 11,795 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. రెండో స్థానంలో ఉన్న అల్కరాస్ కంటే 3000కు పైగా అధికంగా పాయింట్లను కలిగి ఉన్నాడు. దీంతో సమీప భవిష్యత్తులో జకోవిచ్ టాప్ ర్యాంక్‌కు ఢోకా లేదనే చెప్పాలి.

ఇక యూఎస్ ఓపెన్‌లో సెమీ ఫైనల్లోనే ఇంటిదారి పట్టిన అల్కరాస్ 1,280 పాయింట్లను కోల్పోయాడు. ప్రస్తుతం అతను 8,535 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఇక యూఎస్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన డానిల్ మెద్వెదేవ్ (రష్యా) తన మూడో ర్యాంక్‌ను మరింత పదిలం చేసుకున్నాడు. తాజాగా 1020 పాయింట్లను సాధించిన మెద్వెదేవ్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక డెన్మార్క్ ఆటగాడు హోల్గర్ రూనే నాలుగో ర్యాంక్‌ను కాపాడుకున్నాడు. ఇక గ్రీస్ ఆటగాడు స్టెఫానొస్ సిట్సిపాస్ రెండు ర్యాంక్‌లను మెరుగు పరుచుకుని ఐదో స్థానానికి ఏగబాకాడు. కిందటి ర్యాంకింగ్స్‌లో సిట్సిపాస్ ఏడో స్థానంలో ఉన్నాడు. ఇక రష్యా ఆటగాడు ఆండ్రీ రుబ్లేవ్ కూడా రెండు ర్యాంక్‌లను మెరుగు పరుచుకుని ఆరో ర్యాంక్‌కు చేరుకున్నాడు.

జన్నిక్ సిన్నర్ (ఇటలీ) ఒక ర్యాంక్‌ను కోల్పోయి ఏడో ర్యాంక్‌తో సరిపెట్టుకున్నాడు. యూఎస్ ఓపెన్‌లో మెరుగైన ప్రదర్శనతో అలరించిన అమెరికా ఆటగాడు టి.ఫ్రిట్జ్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని 8వ ర్యాంక్‌ను ఎగబాకాడు. ఇక నార్వే ఆటగాడు కాస్పర్ రూడా నాలుగు ర్యాంక్‌లను కోల్పోయి 9వ ర్యాంక్‌కు పరిమితమయ్యాడు. జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వరేవ్ టాప్10లో చోటు సంపాదించాడు. ఇప్పటి వరకు 12వ ర్యాంక్‌లో ఉన్న జ్వరేవ్ రెండు స్థానాలు మెరుగు పరుచుకుని పదో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. మరోవైపు అమెరికా యువ సంచలనం బెన్ షెల్టన్ కూడా తన ర్యాంక్‌ను గణనీయంగా మెరుగుపరుచుకున్నాడు. యూఎస్ ఓపెన్‌లో అత్యంత నిలకడైన ఆటను కనబరిచిన షెల్టన్ తాజా ర్యాంకింగ్స్‌లో ఏకంగా 28 స్థానాలు ఎగబాకి 19వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News