నా మంత్రం ‘కనీస ప్రభుత్వం, గరిష్ఠ పాలన’
కొన్నేళ్లుగా ప్రభుత్వంపై ప్రజల నమ్మకం పెరిగింది.
ప్రపంచ ప్రభుత్వాల సమ్మిట్‌లో ప్రధాని మోడీ
యుఎఇలో రెండవ రోజు పర్యటన
దుబాయి : అవినీతి రహిత, సమ్మిళిత ప్రభుత్వాలే ప్రపంచానికి ఇప్పుడు కావాలని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ఉద్ఘాటించారు. ‘కనీస ప్రభుత్వం, గరిష్ఠ పాలన’ అన్నది ఇన్ని సంవత్సరాలుగా తన మంత్రం అని మోడీ వెల్లడించారు. యుఎఇలో తన రెండవ రోజు పర్యటనలో భాగంగా దుబాయిలో ప్రపంచ ప్రభుత్వాల శిఖరాగ్ర సదస్సులో మోడీ ప్రసంగిస్తూ, భారత్‌లో గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వంపై ప్రజల నమ్మకం పెరిగిందని తెలియజేశారు. ‘భారతీయ ప్రభుత్వం ఉద్దేశం, నిబద్ధతను ప్రజలు విశ్వసిస్తున్నారు.
ప్రజల సెంటిమెంట్లకు మేము ప్రాధాన్యం ఇచ్చినందునే ఇది సాధ్యమైంది’ అని మోడీ చెప్పారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా తాను 23 సంవత్సరాలు ప్రభుత్వంలో, ‘కనీస ప్రభుత్వం, గరిష్ఠ పాలన’ అనే తన సిద్ధాంతంలో గడిపానని మోడీ తెలియజేశారు. మహిళల నేతృత్వంలో అబివృద్ధి, భారతీయ మహిళల ఆర్థిక, సాంఘిక, రాజకీయ పరిస్థితుల పటిష్ఠతపై తన ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందని ప్రధాని తెలిపారు. సామాజిక, ఆర్థిక సమ్మిళితం అన్నది తన ప్రభుత్వ ప్రాధాన్య అంశమని, 50 కోట్ల మందికి పైగా ప్రజలు బ్యాంకింగ్ వ్యవస్థకు అనుసంధానం అయ్యారని మోడీ చెప్పారు.
ప్రతి ఒక్కరినీ వెంట తీసుకువెళ్లే, పరిశుద్ధమైన, అవినీతికి తావులేని సమ్మిళిత ప్రభుత్వాలు ప్రపంచానికి ఇప్పుడు అవసరమని ఆయన ఉద్ఘాటించారు. ‘ప్రపంచం ఒక వైపు ఆధునికత దిశగా పురోగమిస్తోంది. మరొక వైపు గత శతాబ్దాల సవాళ్లు ముమ్మరం అవుతున్నాయి’ అని ఆయన చెప్పారు. ‘ఇప్పుడు టెక్నాలజీ సకారాత్మకమైన లేక వ్యతిరేకమైనా కీలక విచ్ఛిన్నకర శక్తిగా రుజువు అవుతోందని మోడీ అన్నారు. ‘వివిధ రూపాలలో ఉగ్రవాదం ప్రతి రోజు మానవాళి ముందు సవాళ్లు విసురుతోంది. ఇప్పుడు వాతావరణ సవాళ్లు కాలంతో పాటు విస్తరిస్తున్నాయి.
ఒక వైపు దేశీయ ఆందోళనలు వేధిస్తుండగా, మరొక వైపు అంతర్జాతీయ వ్యవస్థ ఒడిదుడుకులతో ఉన్నట్లు కనిపిస్తోంది’ అని మోడీ చెప్పారు. దుబాయి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు, వాణిజ్య, సాంకేతిక వ్యవస్థకు ప్రధాన కేంద్రంగా మారుతున్నదని మోడీ వ్యాఖ్యానించారు. యుఎఇ అధ్యక్షుడు షేఖ్ మొహమ్మద్ బిన్ జాయెద్‌ను మోడీ కొనియాడుతూ, ఆయన దూరదృష్టి, సంకల్పం గల నేత అని అన్నారు. ‘భావి ప్రభుత్వాలకు రూపకల్పన’ అన్న లక్షంతో ఈ శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది.