Monday, December 23, 2024

ప్రపంచంలోనే అతిపెద్ద కంటి పరీక్ష కార్యక్రమం కంటి వెలుగు కార్యక్రమం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్ : ఒకేసారి పెద్ద మొత్తంలో కంటి పరీక్షలు నిర్వహించే కార్యక్రమం ప్రపంచంలో ఇప్పటివరకు ఏ ఒక్కరు చేపట్టలేదని, అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు ,సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ నెల 18 నుండి నిర్వహించనున్న రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం పై సోమవారం నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి అవగాహన సదస్సుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ గతంలో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమంలోని లోటు పాట్లను సవరించుకొని ఈ విడత కార్యక్రమాన్ని నూటికి నూరు శాతం విజయవంతం చేయాలని చెప్పారు.

జిల్లాలో నిర్వహించనున్న కంటి వెలుగు కార్యక్రమానికి 40,000 రీడింగ్ అద్దాలు ముందుగానే జిల్లాకు వచ్చాయని, వీటితోపాటు, ప్రిస్క్రిప్షన్ అద్దాలు,క్యాటరాక్ట్ ఆపరేషన్ అవసరమయ్యే వారికి కాటరాక్ట్ ఆపరేషన్లు కూడా చేస్తామని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా గ్రామాలు, మున్సిపల్ వార్డులలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసి కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆయన ఆదేశించారు.


పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత విద్యుత్తు ,ప్రతిరోజు మిషన్ భగీరథ తాగునీటి సరఫరా, రైతుబంధు, దళిత బంధు వంటి ఎన్నో అద్భుతమైన పథకాలను అమలు చేస్తున్నదని, అలాగే ఏ ఒక్కరు అంధత్వంతో బాధపడకూడదు అన్న ఉద్దేశంతో అతిపెద్ద కార్యక్రమం కంటి వెలుగును చేపట్టినట్లు అయిన వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కంటి వెలుగు కార్యక్రమం పై గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. జిల్లా స్థాయిలో అవగాహన కార్యక్రమం నిర్వహించిన మాదిరిగానే మండల స్థాయిలో కూడా తక్షణమే అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని, 18 లోగా పూర్తి చేయాలని ఆయా గ్రామాలలో సర్పంచ్లతో ఎవరెవరు దృష్టిలోపంతో బాధపడుతున్న వివరాలు తీసుకొని అందరూ కవర్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ,అదేవిధంగా మున్సిపాలిటీలలో కూడా చేయాలని ఆయన ఆదేశించారు.

శాసనసభ్యులతో చర్చించిన తర్వాత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమానికి చర్యలు తీసుకోవాలని, ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. గ్రామంలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు గ్రామంలో పనిచేస్తున్నారో ఒక జాబితా తయారు చేయాలని ఆశ ,అంగన్వాడి కార్యకర్తలను మంత్రి ఆదేశించారు. అదేవిధంగా కంటి వెలుగు కార్యక్రమం పై జిల్లా, మండల, గ్రామస్థాయిలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగులు, కరపత్రాల ద్వారా ప్రచారం కల్పించాలని చెప్పారు.

జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను తీసుకొస్తున్నారని, అదేవిధంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తున్నారని, ఇది పేద ప్రజలకు ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు .ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు ప్రతి ఒక్కరు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలని ఆమె కోరారు.

దేవరకద్ర శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని ,గతంలో నిర్వహించిన కార్యక్రమంలో కోటి 50 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజాప్రతినిధులు ప్రత్యేక శ్రద్ధ వహిస్తే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని, పెద్ద గ్రామాలలో ఒకటి లేదా రెండు రోజులు, చిన్న గ్రామాల్లో ఒకరోజు కార్యక్రమాలు ఉంటాయని, కార్యక్రమాన్ని నిర్వహించే రోజులలో ప్రజాప్రతినిధులు ఇతర పనులు ఏవి పెట్టుకోకుండా కంటి వెలుగు కార్యక్రమంలో పూర్తిస్థాయిలో భాగస్వాములు కావాలని, ఎంపీపీలు, జడ్పిటిసిలు తప్పనిసరిగా కంటి వెలుగు వైద్య శిబిరాలను సందర్శించారని కోరారు.

ప్రభుత్వమే కంటి పరీక్షలతో పాటు, ఉచితంగా అద్దాలు కూడా ఇస్తున్నందున ఈ విషయం గ్రామస్థాయిలో పెద్ద ఎత్తున విస్తృత ప్రచారం నిర్వహించాలని, గ్రామాలలో టాం టాం వేయించాలని, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని, అధికారులు ప్రతిరోజు 9 గంటలకే గ్రామాలకు చేరుకొని కంటి వెలుగు వైద్య శిబిరాలను విజయవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాలలో కంటి వెలుగు నిర్వహణ కోసమై ఏర్పాట్లకు ప్రజాప్రతినిధులు పూర్తిచేయితను అందించాలని ఆయన తెలిపారు.

జిల్లా కలెక్టర్ ఎస్ .వెంకటరావు కంటి వెలుగు కార్యక్రమం పై అధికారులు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తూ ఈ నెల 12 లోగా మండల స్థాయిలో కంటి వెలుగుపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని, కంటి వెలుగుపై వచ్చిన ప్రింటింగ్ మెటీరియల్ అన్ని గ్రామాలకు పంపడం జరుగుతుందని, గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాలని, ముందుగానే ప్రణాళిక ప్రకారం పనులు చేయాలని, కంటి వెలుగు వైద్య శిబిరాల నిర్వహణకు కనీసం 8 మంది సిబ్బంది టీం గా ఉంటారని ,అధికారులు, ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం అవుతేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది అని తెలిపారు.

కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజల ఇంటి ముంగటికి తీసుకువెళితే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని అన్నారు. మండల ప్రత్యేక అధికారులు కంటివేలు కార్యక్రమానికి కూడా ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వయం సహాయక మహిళా బృందాలు, మెప్మా బృందాల ను భాగస్వామ్యం చేయాలని ,ఈ విషయమై డిఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వాల్య నాయక్, డి సిసీబీ అధ్యక్ష్యులు నిజాం పాషా, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య , స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, రెవెన్యూ అదనపు కలెక్టర్ కె. సీతారామారావు, మున్సిపల్ చైర్మన్లు కే.సీ నరసింహులు, బసవరాజు గౌడ్, దొరేపల్లి లక్ష్మి , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కృష్ణ ,ఆర్డిఓ అనిల్ కుమార్ ,జెడ్పిటిసిలు ఎంపీపీలు, పిఎసిఎస్ చైర్మన్లు, తదితరులు ఈ అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News