31 ఏండ్ల బోబీ కుక్క బర్త్‌డే
ఇన్నేళ్లూ ఒకే ఇల్లు ..బోలెడు స్వేచ్ఛ
కాన్‌క్వియిరోస్(పోర్చుగల్): బోబీకి 31వ పుట్టినరోజు వేడుక ఘనంగా జరిగింది. బోబీ ప్రపంచంలోనే అతి పెద్ద వయస్సు కుక్క. పోర్చుగీస్ తెగకు చెందిన ఈ కుక్క జీవితం అంతా కాన్‌క్వియిరోస్ గ్రామంలోని యజమాని ఇంట్లోనే గడిచింది. 31 ఏండ్లకు చేరుకున్న ఈ కుక్క పుట్టినరోజు వేడుకకు వంద మందికి పైగా హాజరయ్యారు. బోబీకి గ్రీటింగ్స్ చెప్పారు. ఇదంతా కూడా సాంప్రదాయకపు వేడుక అని ఇంటి ఓనరు లియోనెల్ కోస్టా తెలిపారు. కోస్టాకు కుక్కల పెంపకం అలవాటును మించిన ప్రాణం. బోబీ తల్లి గిరా కూడా 18 ఏండ్ల వయస్సు వరకూ ఈ ఇంట్లోనే పెరిగి చనిపోయింది.
అయితే బోబీలాగా 31 ఏండ్ల వరకూ ఓ కుక్క మనుగడ ఉంటుందని తనకు తెలియదని కోస్టా చెప్పారు. ప్రశాంతయుతమైన వాతావరణం ఉంటే ఏ జీవి అయినా ఎక్కువ ఆయుష్షుతో ఉంటుందని తన బోబీ ఇందుకు ఉదాహరణ అని కోస్టా తెలిపారు. ఇప్పటివరకూ బోబీకి ఎప్పుడూ బందీగా ఉంచలేదు. అడవుల్లో హాయిగా తిరిగింది. ఇంటికి వచ్చి పడుకునేది. ఇప్పుడిప్పుడే వయస్సు మీదపడుతున్న లక్షణాలు కనబడుతున్నాయని చెప్పారు.