Wednesday, January 8, 2025

ఆందోళన కలిగిస్తున్న హార్ట్‌ఎటాక్స్

- Advertisement -
- Advertisement -

ఇటీవల గుండెపోటుతో మృత్యుబారిన పడిన యువ వైద్యులు
చర్చనీయాంశంగా మారిన వారి ఆరోగ్య పరిస్థితి

మనతెలంగాణ/హైదరాబాద్ : గుండెపోటుతో ఇటీవల 40 ఏళ్ల వయసులోపు వైద్యులు మృతిచెందడం అందరినీ కలిచివేసింది. వైద్యులతో పాటు పలువురు చిన్న వయసులో గుండెపోటు బారిన పడిన మృత్యువాతపడటం చర్చనీయాంశంగా మారింది. సామాన్యులు, ప్రముఖులు అంటూ తేడా లేకుండా చిన్న వయసులో యువత గుండెపోటు బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. గతంలో సినీ నటులు తారకరత్న, సిద్ధార్థ్ శుక్లా, పునీత్ రాజ్‌కుమార్, రాజ్ కౌశల్‌తో పాటు ఎపి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వంటి ప్రముఖులు 40 ఏళ్ల వయస్సులోనే ప్రాణాలు కోల్పోయారు.

గతంలో దాదాపు 60 ఏళ్లు పైబడిన వారే గుండెపోటుతో మరణించారన్న వార్త వినే వాళ్లం కానీ ప్రస్తుతం 40 ఏళ్లు ఉన్న యువత కూడా వేగంగా గుండెపోటు బారిన పడుతుండటం ఆందోళనకు గురిచేస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. సహజంగానే వైద్యులు, సెలబ్రిటీలు, ఉన్నత ఉద్యోగాలు చేసేవాళ్లు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తుంటారు. గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి అవసరమైన ఫిట్‌నెస్‌పై పూర్తి శ్రద్ధ తీసుకున్నారు. అయినా, వీరు చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించే యువకులు సైతం గుండెపోటుకు గురవుతున్నారు. బయటి నుంచి చూడటానికి చాలా ఫిట్‌గా, ఆరోగ్యంగా కనిపిస్తున్నా కానీ ఇలాంటి వ్యాధులు మీ శరీరం లోపల పెరుగుతుంటాయని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మాత్రమే ఈ సమస్య నుంచి బయటపడగలుతారని సూచిస్తున్నారు.

గుండెపోటు ఎందుకు వస్తుంది?
గుండెకు రక్త ప్రసరణ అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. కొవ్వు, కొలెస్ట్రాల్ మొదలైనవి రక్త ప్రవాహాన్ని ఆపడానికి కారణం కావచ్చు. ఇవి రక్తంలోకి ప్రవేశించిన వెంటనే గడ్డకట్టడం ఏర్పడి రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. ఈ అంతరాయం కలిగిన రక్త ప్రసరణ గుండె కండరాల భాగాన్ని దెబ్బతీస్తుంది.

యువతలో కూడా గుండెపోటు దారితీసే కారణాలు
ప్రధానంగా వృత్తిపరమైన ఒత్తిడితోపాటు ధూమపానం, మద్యపానం, జంక్‌ఫుడ్, శారీరక శ్రమ లేకపోవడం, రక్తపోటు,అధిక కొలెస్ట్రాల్, జన్యుపరమైన కారణాల వల్ల యుక్త వయసులో గుండెపోటుకు గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ఒత్తిడి అనేది మనసునే కాదు మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. డిప్రెషన్ ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది. తద్వారా ధమనులను ప్రతికూలంగా ప్రభావితం చేయడంతో అవి కుంచించుకుపోతాయి. డిప్రెషన్ జీవనశైలిపై గణనీయమైన ప్రభావాన్ని చూపడం ద్వారా గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. అందుకే సాధ్యమైనంత వరకు ఒత్తిడి దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News