Sunday, December 29, 2024

మహిళల ఐపిఎల్‌కు సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

ముంబై: మహిళల కోసం తొలిసారి నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ డబ్లూపిఎల్ టి20 టోర్నమెంట్‌కు శనివారం తెరలేవనుంది. ఇప్పటికే పురుషుల కోసం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఏడాది నుంచి భారత క్రికెట్ బోర్డు మహిళల కోసం కూడా ప్రీమియర్ లీగ్‌ను నిర్వహిస్తోంది. ఈ లీగ్‌లో మొత్తం ఐదు జట్లు పోటీ పడనున్నాయి. ఈసారి మహిళల ఐపిఎల్‌కు ముంబై నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ముంబైలోని డివై పాటిల్, బ్రబౌర్న్ స్టేడియాల్లో ఈ టోర్నీ జరుగనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ టోర్నీ మార్చి 26న జరిగే ఫైనల్‌తో ముగుస్తోంది. ఆరంభ మ్యాచ్‌కు డివై పాటిల్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ క్రమంలో సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరంభోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్‌లు అభిమానులను అలరించనున్నారు.

మహిళల ఐపిఎల్‌లో మొత్తం 22 మ్యాచ్‌లు జరుగనున్నాయి. టోర్నీలో ఐదు జట్లు పోటీ పడనున్నాయి. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌తో గుజరాత్ జెయింట్స్ తలపడనుంది. ఈ జట్లతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, యూపి వారియర్స్ టోర్నీలో తలపడనున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆస్ట్రేలియా స్టార్ మెగ్ లానింగ్, ముంబై ఇండియన్స్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్, బెంగళూరు టీమ్‌కు స్మృతి మంధాన, గుజరాత్‌కు బెథ్ మూనీ, యూపి వారియర్స్ అలీసా హీలీ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారు. ప్రతి జట్టులోనూ భారత్‌తో పాటు విదేశీ జట్లకు చెందిన అగ్రశ్రేణి క్రికెటర్లు ఉన్నారు. దీంతో టోర్నమెంట్ హోరాహోరీగా సాగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మంధాన, అలీసా హీలీ, మెగ్ లానింగ్, షఫాలీ వర్మ, రిచా ఘొష్, బెథ్ మూనీ, షివర్, షబ్నమ్, ఇస్మాయిల్, క్యాంప్‌బెల్, జెమీమా రోడ్రిగ్స్ తదితరులు మహిళల ఐపిఎల్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారారు.

నిరీక్షణకు తెర..

సుదీర్ఘ కాలంగా మహిళా క్రికెటర్లు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. పురుషుల ఐపిఎల్‌కు దీటుగా మహిళల విభాగంలోనూ ఐపిఎల్ లీగ్‌ను నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఊహించినట్టే మహిళల ఐపిఎల్‌కు కూడా విపరీత డిమాండ్ ఏర్పడింది. ఐపిఎల్ జట్లను సొంతం చేసుకునేందుకు బడా పారిశ్రామిక వేత్తలు కోట్లాది వందలాది కోట్ల రూపాయలను వెచ్చించారు. భారత కార్పొరేట్ దిగ్గజాలు అదానీ, అంబానీలు కూడా ఐపిఎల్ జట్లను సొంతం చేసుకున్నారు. పురుషుల క్రికెట్ మాదిరిగానే మహిళల జట్లను సొంతం చేసుకునేందుకు కార్పొరేట్ సంస్థలు తీవ్రంగా పోటీ పడ్డాయి. అంతేగాక క్రికెటర్ల కొనుగోళ్ల కోసం ఆయా ఫ్రాంచైజీలు కోట్లాది రూపాయలు వెచ్చించాయి. ఐపిఎల్, బిగ్‌బాష్, పాకిస్థాన్ సూపర్ లీగ్, బంగ్లాదేశ్ టి20 లీగ్, కరీబియన్ లీగ్‌లు ఇప్పటికే ప్రపంచ క్రికెట్‌లో మంచి ఆదరణ దక్కించుకున్నాయి. తాజాగా బిసిసిఐ మహిళల విభాగంలో ఐపిఎల్ లీగ్‌కు శ్రీకారం చుట్టింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళా క్రికెటర్లకు ఎంతో మేలు చేయడం ఖాయం. ఈ లీగ్ ద్వారా పలువురు ప్రతిభావంతులైన క్రికెటర్లు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి. భారత్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన యువ క్రికెటర్లకు ఈ లీగ్ ఓ వరంలాంటిదనడంలో ఎలాంటి సందేహం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News