Monday, December 23, 2024

పద్మశ్రీని వెనక్కి ఇచ్చేస్తున్నా స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లూఎఫ్‌ఐ) కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నిక కావడాన్ని నిరసిస్తూ ఇప్పటికే స్టార్ మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దిగ్గజ రెజ్లర్ భజరంగ్ పునియా తనకు లభించిన ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించాడు. ఈ విషయాన్ని శుక్రవాం సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇదే క్రమంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి భజరంగ్ లేఖ కూడా రాశాడు. దీనిలో మహిళా రెజ్లర్లకు సంబంధించిన సమస్యలను ఏకరవు పెట్టాడు. అంతేగాక రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ మహిళా రెజ్లర్లపై చేసిన ఆగడాలని లేఖ ద్వారా ప్రధాని దృష్టికి తీసుకెళ్లాడు.

రెజ్లింగ్ సమాఖ్యకు తాజాగా జరిగిన ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ అధ్యక్షుడిగా ఎన్నియ్యాడని ఈ ఫలితం తమను ఎంతగానో నిరాశకు గురిచేసిందన్నాడు. సంజయ్‌సింగ్ ఎన్నికతో సమాఖ్య తిరిగి బ్రిజ్‌భూషణ్ చేతిలోకి వెళ్లినట్టేనని భజరంగ్ ఆవేదన వ్యక్తం చేశాడు. కాగా, బ్రిజ్ భూషణ్‌తో పాటు అతని సన్నిహితులను ఎన్నికల్లో పాల్గొనకుండా చూడాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని, ఒలింపిక్ సంఘాన్ని కోరామని అయినా ఫలితం లేకుండా పోయిందన్నాడు. బ్రిజ్ భూషణ్‌కు సంబంధించిన వ్యక్తే తిరిగి అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో మహిళా రెజ్లర్ల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందన్నాడు. ఇక రెజ్లర్లపై భారత ప్రభుత్వ వైఖరీని నిరసిస్తూ తనకు కేటాయించిన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్టు భజరంగ్ తన లేఖలో పేర్కొన్నాడు.

బాధతోనే ఈ నిర్ణయం
తాను పద్మశ్రీ పురస్కారాన్ని వదులుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయని భజరంగ్ ట్విటర్ ద్వారా వెల్లడించాడు. సంజయ్ సింగ్ ఎన్నికతో రెజ్లర్ల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారిందన్నాడు. ఇప్పటికే సాక్షి మాలిక్ ఆటకు వీడ్కోలు పలికిందన్నాడు. ఇదే బాటలో మరికొంత మంది రెజ్లర్లు ప్రయాణించడం ఖాయమన్నాడు. తాను కూడా ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించినట్టు తెలిపాడు. ఈ నిర్ణయం కఠినమైనదే అయినా తన ముందు మరో మార్గం లేకుండా పోయిందన్నాడు. సంజయ్ సింగ్ ఎన్నికతో తాము పూర్తిగా నిరాశలో కూరుకు పోయామన్నాడు. ఇప్పుడు తాము న్యాయం కోసంఎక్కడికెళ్లాలో తెలియని స్థితి నెలకొందన్నాడు. ముఖ్యంగా మహిళా రెజ్లర్ల పరిస్థితి చాలా దయనీయంగా మారిందన్నాడు. ఈ ఎన్నికల ఫలితాలతో మహిళా రెజ్లర్లు మళ్లీ బరిలోకి దిగుతారని తాను భావించడం లేదన్నాడు. ఇదిలావుంటే పద్మశ్రీని తిరగి ఇచ్చేయాలని భజరంగ్ పునియా తీసుకున్న నిర్ణయం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News