సాహో దహియా.. రెజ్లింగ్‌లో భారత్‌కు రజతం
కుస్తీవీరుడిపై ప్రశంసల వర్షం
టోక్యో: జపాన్ వేదికగా జరుగుతున్నఒలింపిక్స్‌లో భారత్ మరోసారి రజతంతో మెరిసింది. పురుషుల రెజ్లింగ్ భారత స్టార్ రవికుమార్ దహియా వెండి పతకాన్ని సాధించాడు. గురువారం జరిగిన 57 కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ ఫైనల్లో రష్యా రెజ్లర్ యుగేవ్ జావుర్‌తో చేతిలో భారత కుస్తీవీరుడు రవి కుమార్ ఓటమి పాలయ్యాడు. నువ్వానేనా అన్నట్టు సాగిన పోరులో రవికుమార్ అసాధారణ పోరాట పటిమను కనబరిచాడు. తనకంటే ఎంతో మెరుగైన స్థానంలో ఉన్న ప్రత్యర్థికి గట్టి పోటీ ఇస్తూ కోట్లాది మంది అభిమానులను అలరించాడు. చివరి వరకు విజయం కోసం పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఈ పోరులో రష్యా కుస్తీవీరుడు 47 తేడాతో రవికుమార్‌ను ఓడించి బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే తుదిపోరులో ఓడినా దహియాకు రజత పతకం లభించింది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన రజత పతకాల సంఖ్య రెండుకు చేరింది. అంతకుముందు మహిళల వెయిట్‌లిఫ్టింగ్‌లో మీరాబాయి చాను వెండి పతకం సాధించింది. ఇక ఈ క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు ఐదు పతకాలను సొంతం చేసుకుంది.
ఆసక్తికరంగా తుది సమరం
మరోవైపు రవికుమార్‌జావుర్‌ల మధ్య జరిగిన తుది పోరు ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగింది. ఇటు రవి అటు జావుర్ ఉడుం పట్టుతో ముందుకు సాగారు. ఇద్దరు సర్వం ఒడ్డడంతో పోరు యుద్ధాన్ని తలపించింది. జావుర్ తన అనుభవాన్ని ఉపయోగిస్తూ రవికుమార్‌పై ఒత్తిడి పెంచాడు. అయినా భారత యువ రెజ్లర్ దహియా ప్రత్యర్థికి చివరి వరకు గట్టి పోటీ ఇస్తూ పైచేయి సాధించేందుకు ప్రయత్నించాడు. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో సఫలమైన జావుర్ 47తో రవిని ఓడించి చారిత్రక స్వర్ణ పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఫైనల్లో ఓటమి పాలైనా రవికుమార్ అసాధారణ పోరాట పటిమతో కోట్లాది మంది భారత అభిమానుల గుండెల్లో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. ఏ మాత్రం అంచనాలు లేకుండా టోక్యో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగిన రవికుమార్ అసాధారణ ప్రదర్శనతో ఏకంగా ఫైనల్‌కు చేరి చరిత్ర సృష్టించింది. తుది పోరులో ఓడినా అద్భుత పోరాట పటిమతో అందరిని ఆకట్టుకున్నాడు. ఫైనల్లో పరాజయం చవిచూసిన రవికి రజతం దక్కింది. దీంతో ఒలింపిక్ రెజ్లింగ్‌లో భారత్‌కు రజతం అందించిన రెండో క్రీడాకారుడిగా రవికుమార్ నిలిచాడు. అంతకుముందు 2012 ఒలింపిక్స్‌లో సుశీల్‌కుమార్ రెజ్లింగ్‌లో రజతం సాధించాడు. కాగా ఒలింపిక్ రెజ్లింగ్‌లో భారత్‌కు ఇది ఐదో పతకం. ఇప్పటి వరకు రెజ్లింగ్‌లో భారత్ రెండు రజతాలు, మరో మూడు కాంస్య పతకాలు సాధించింది. సుశీల్ కుమార్ రెండు పతకాలతో అగ్రస్థానంలో నిలిచాడు. 2012లో యోగేశ్వర్ దత్, 2016 రియో ఒలింపిక్స్‌లో మహిళా రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్యం సాధించారు. తాజాగా రవికుమార్ దహియా రజతంతో మెరిశాడు.
రెతు బిడ్డ మెరిశాడు..
టోక్యో ఒలింపిక్స్‌లో రజతంతో చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్ రవికుమార్ దహియా హర్యానాలోని సోనిపట్ నుంచి వెలుగులోకి వచ్చాడు. ఇక సోనిపట్ అంటేనే ఎంతో మంది రెజ్లర్లు గుర్తుకు వస్తారు. సోనిపట్‌కు దగ్గర్లోని నాహ్రి అనే చిన్న ఊరుకు చెందిన వాడు రవికుమార్. అఖాడాల మధ్యే పెరగడంతో రవికి చిన్నప్పటి నుంచే రెజ్లింగ్‌పై ఆసక్తి ఏర్పడింది. రవిది ఓ నిరూపేత రైతు కుటుంబం. రవి తండ్రి రాకేశ్ దహియా రైతు. ఆయనకు సొంత పొలం కూడా లేదు. ఇతరుల పొలాలను కౌలుకు తీసుకుని సాగుచేసే వారు. ఇక రెజ్లింగ్‌పై తన కొడుకు అభిలాషను రాకేశ్ ఆరంభంలోనే గుర్తించారు. తన కొడుకును అత్యుత్తమ రెజ్లర్‌గా తీర్చిదిద్దాలనే లక్షంతో ముందుకు సాగారు. దీని కోసం రాకేశ్ చాలా కష్టపడ్డారు. రెజ్లింగ్‌పై తన కుమారుడి ఇష్టాన్ని ఎప్పుడూ కాదనలేదు. దగ్గరుండి రవిని ప్రోత్సహించారు. ఇక తమ గ్రామం నాహ్రికి చెందిన రెజ్లర్ అమిత్ దహియా ప్రపంచ రెజ్లింగ్‌లో పతకం సాధించడంతో రాకేశ్‌ను కూడా తన కొడుకును ఆ స్థాయికి తీసుకెళ్లాలనే పట్టుదల ఏర్పడింది. ఇందు కోసం రాకేశ్ పెద్ద మొత్తంలో అప్పులు సయితం చేసి తన కొడుకును ఢిల్లీలోని చత్రసాల్ స్టేడియంలో శిక్షణ ఇప్పించారు. ఇదే రవికుమార్ కెరీర్‌ను మలుపు తిప్పిందని చెప్పాలి. ఇక చత్రసాల్ స్టేడియంలో యువ రెజ్లర్లందరూ ఓ పెద్ద హాల్‌లో ఉండేవారు. ఆటనే శ్వాసగా చేసుకుని కఠోర సాధన చేస్తున్న రవిలోని ప్రతిభను కోచ్‌లు గుర్తించి మరింత ప్రోత్సహించారు. అంతేగాక అతనికి ప్రత్యేక గదిని కూడా కేటాయించారు. ఇక ఒలింపిక్‌లో పతకం సాధించిన యోగేశ్వర్ దత్ కూడా ఆ గదిలోనే ఉన్నాడు. దీంతో రవికి కూడా యోగేశ్వర్‌లాగానే ఒలింపిక్‌లో పతకం సాధించాలనే కసి పెరిగింది. దీని కోసం మరింత కష్టపడ్డాడు. ఒకవైపు పేదరికం వెంటాడినా దాన్ని దిగమింగుకుంటూ ముందుకు సాగాడు. అతని కష్టానికి తగిన ఫలితం దక్కింది. ఇక తన కొడుకుకు పాలు, పండ్లు అందించేందుకు రాకేశ్ ప్రతి రోజు 60 కిలోమీటర్లు ప్రయాణించేవారు. ఇలా తండ్రి ప్రోత్సాహంతో ఉండడంతో రవి సర్వం ఒడ్డాడు. కఠోర సాధనతో అత్యుత్తమ రెజ్లర్లలో ఒకడిగా ఎదిగాడు. అతని కఠోర సాధన, అటపై ఉన్న అంకితభావం, ప్రేమ రవికుమార్ ఒలింపిక్ పతకం సాధించేలా తీర్చిదిద్దింది.
ప్రధాని అభినందన
చారిత్రక ప్రదర్శనతో టోక్యో ఒలింపిక్స్‌లో రతజం సాధించిన యువ రెజ్లర్ రవికుమార్ దహియాను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అభినందించారు. పతకం సాధించిన తర్వాత ప్రధాని రవితో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా అతని ప్రతిభను కొనియాడారు. రవి విజయం భారత క్రీడా రంగానికి కొత్త దిశను చూపుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఇలాంటి చారిత్రక విజయాలు మరెన్నో సాధించాలని ప్రధాని ఆకాంక్షించారు. మరోవైపు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రులు కిరన్ రిజిజు, అనురాగ్ ఠాకూర్, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్‌లు రవికుమార్‌ను అభినందించారు.
హర్యానా ప్రభుత్వం భారీ నజరానా
రజత పతక విజేత రవికుమార్ దహియాకు అతని సొంత రాష్ట్రం హర్యానా ప్రభుత్వం భారీ నజరానాలు ప్రకటించింది. రవికుమార్‌కు రూ.4 కోట్ల నగదు బహుమతి, క్లాస్ 1 కేటగిరిలో ఉద్యోగం ఇస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. అంతేగాక ఏ ప్రాంతంలో అయినా రవికి 50 శాతం రాయితీతో ప్లాట్‌ను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రవి స్వగ్రామం నాహ్రీలో రెజ్లింగ్ శిక్షణ కోస ఇండోర్ స్టేడియం నిర్మించనున్నట్టు హర్యానా ప్రభుత్వం తెలిపింది.
ఒలింపిక్స్ లో రవికుమార్ కు రజత పతకం
- Advertisement -
- Advertisement -
- Advertisement -