Friday, December 20, 2024

రెజ్లర్లు దీపక్, సుజీత్‌లకు ఎదురుదెబ్బ

- Advertisement -
- Advertisement -

భారత స్టార్ రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్ కలాకల్‌లకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఏడాది పారిస్‌లో జరిగే ఒలింపిక్స్ కోసం కిర్గిస్థాన్‌లో ప్రారంభమైన ఆసియా క్వాలిఫయర్స్ పోటీలకు వీరు దూరమయ్యారు. భారీ వర్షాల కారణంగా వీరిద్దరూ దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. దీంతో సకాలంలో బిష్కెక్‌కు చేరుకోలేక పోయారు. దీంతో వీరికి నిర్వాహకులు క్వాలిఫయింగ్ పోటీలకు అనుమతి ఇవ్వలేదు. దీపక్, సుజీత్‌లు ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యేందుకు రష్యాలో శిక్షణ తీసుకున్నారు. అది ముగించుకుని దుబాయ్ మీదుగా కిర్గిష్థాన్ వెళ్లాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఏప్రిల్ 16న దుబాయ్ చేరుకున్నారు. కానీ ఇటీవల దుబాయ్‌లో కుండపోత వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షాలతో దుబాయ్ అల్లాడిపోయింది.

భారీ వర్షాలతో దుబాయ్ విమానాశ్రయం నీట మునిగింది. దీంతో పలు దేశాలకు విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే సమయంలో దీపక్, సుజీత్‌లు కూడా సకాలంలో కిర్గిస్థాన్ వెళ్లలేక పోయారు. నిర్ణీత సమయంలో వీరు కిర్గిస్థాన్ చేరుకోవడంలో విఫలమయ్యారు. దీంతో క్వాలిఫయర్స్ పోటీల నిర్వాహకులు వీరికి పోటీల్లో పాల్గొనేందుకు అనుమతించలేదు. ఇది దీపక్, సుజీత్‌లకు ఊహించని ఎదురుదెబ్బగా చెప్పాలి. ఇక వీరు ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే ఒక క్వాలిఫయింగ్ టోర్నీ మిగిలివుంది. వచ్చే మే నెలలో తుర్కియేలో జరిగే ప్రపంచ క్వాలిఫయర్స్‌లో వీరు పాల్గొని ఒలింపిక్స్ కోటాను సాధించాల్సి ఉంటుంది. అయితే విపరీత పోటీ ఉండే ఈ క్వాలిఫయర్స్‌లో వీరు ఎలా రాణిస్తారో చెప్పడం కష్టమే. కాగా, దుబాయ్ వర్షాల వల్ల దీపక్, సుజీత్‌లకు తీవ్ర నష్టమే కలిగిందని చెప్పాలి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News