న్యూఢిల్లీ : లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నివాసానికి పోలీస్‌లు వెళ్లడం చర్చనీయాంశం అయింది. ఉత్తర ప్రదేశ్ లోని గోండాలో ఉన్న ఆయన నివాసంలో పోలీస్‌లు విచారణ చేపట్టారు. ఆ ఇంట్లో ఉన్న 12 మంది వాంగ్మూలాన్ని సేకరించి రికార్డు చేశారు. వారి పేర్లు, అడ్రస్, ఐడీ కార్డులు తీసుకున్నారు. సాక్షం కోసం ఆ డేటాను సేకరించినట్టు పోలీస్‌లు వెల్లడించారు. బ్రిజ్‌కు అనుకూలంగా ఉన్న అనేక మంది మద్దతుదారులను కూడా ఢిల్లీ పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇప్పటివరకు 137 మంది నుంచి వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. అయితే ఆ ఇంటిలో బ్రిజ్‌ను విచారించారా లేదా అన్నది తెలియలేదు.
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా పనిచేసిన బ్రిజ్‌భూషణ్ (ఆరోపణల నేపథ్యంలో తాత్కాలికంగా విధుల నుంచి తప్పించారు)పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన రెజ్లర్లు కొద్ది నెలలుగా ఢిల్లీలో నిరసన వ్యక్తం చేశారు. దానిలో భాగంగా ఆరుగురు మహిళా రెజ్లర్లతో మొదటి ఎఫ్‌ఐఆర్, మరో మైనర్ రెజ్లర్ తండ్రి ఫిర్యాదుతో రెండో ఎఫ్‌ఐఆర్ ఏప్రిల్ 28న దాఖలైంది. మైనర్ దాఖలు చేసిన కేసు నిరూపించబడితే పోక్సో చట్టం కింద ఆయనకు ఏడేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. అయితే మైనర్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్టు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. దానిపై ఢిల్లీ పోలీస్‌లు నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు.
ఆందోళన విరమించేది లేదు : రెజ్లర్లు
ఇదిలా ఉండగా సోమవారం వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియాలు రైల్వే ఉద్యోగాల్లో చేరారు. రెజ్లర్ల బృందం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయిన రెండు రోజుల్లోనే ఈ విషయం బయటకు రావడం గమనార్హం. మరోవైపు ఆందోళన ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలను రెజ్లర్లు ఖండించారు. రెజ్లర్ సాక్షిమాలిక్ ట్విటర్‌లో స్పందించారు. తాము ఆందోళన విరమించే ప్రసక్తే లేదని , విధులు నిర్వహిస్తూనే తాము నిరసన వ్యక్తం చేస్తామని పేర్కొన్నారు.
హింస లేకుండా ఉద్యమాన్ని ఎలా కొనసాగించాలో ఆలోచిస్తున్నాం. మా సత్యాగ్రహాన్ని, ఉద్యమాన్ని బలహీన పరిచే కుట్ర ఇది. కేంద్ర హోం మంత్రితో సమావేశంలో తుది పరిష్కారం దొరక లేదు. న్యాయం కోసం చేస్తున్న పోరాటంలో తాము వెనక్కు తగ్గేది లేదు. సత్యాగ్రహంతోపాటే రైల్వేలే నా బాధ్యతలను కూడా నిర్వరిస్తున్నాను. న్యాయం జరిగేవరకు పోరాటంసాగుతుంది. దయచేసి ఎలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దు. ”అని కోరారు.