ఉద్యమం కొనసాగుతుందని స్పష్టీకరణ
తప్పుడు వార్తలు అనుచితం
సరికొత్త వ్యూహరచనతో ఆందోళనకు పథకం
న్యూఢిల్లీ : దేశ రాజధాని కేంద్రంగా చేసుకుని ఉద్యమిస్తున్న రెజ్లర్లలో ప్రముఖ రెజ్లర్లు సాక్షి మాలిక్, వినీష్ ఫోగాట్, బజ్‌రంగ్ పునియాలు తిరిగి తమ రైల్వే ఉద్యోగ విధులలో చేరారు. దీనితో వీరు రెజ్లర్ల ఉద్యమం నుంచి విరమించుకుంటున్నట్లు వార్తలు వెలువడ్డాయి. వీటిని ఈ ప్రముఖ రెజ్లర్లు ఖండించారు. తాను నిరసనల నుంచి వైదొలిగినట్లు చెప్పడం తప్పని సాక్షి తెలిపారు. ఇవన్నీ తప్పుడు కథనాలు అని వివరించారు. మాలో ఎవరం కూడా వెనకకు వెళ్లలేదని, తిరిగి ఉద్యోగాలలో చేరినంతనే దీనికి వేరు రంగుపులిమి వార్తలు వెలువరించడం తగదని, తమ ఉద్యమం ఆగబోదని స్పష్టం చేశారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షులు , బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా రెజ్లర్ల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారనే విషయం వివాదాస్పదం అయ్యింది. రెజ్లర్ల ఉద్యమానికి దారితీసింది. ఇది ప్రపంచ స్థాయి సంచలనం కల్గించింది. కాగా ఇటీవలే ప్రముఖ రెజ్లర్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు. బ్రిజ్ భూషణ్ వ్యవహారంపై నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టాలని కోరారు. దీనికి అమిత్ షా సానుకూలమైన రీతిలో స్పందించారు. చట్టం ఎవరికైనా సమానమే అని , చట్టప్రకారం చర్యలు జరుగుతాయి, అది జరగనివ్వండని వారికి చెప్పినట్లు తెలిసింది. ఎప్రిల్ నుంచి రెజ్లర్లు నిరసనలు సాగిస్తున్నారు. గత నెల 31వ తేదీన జంతర్‌మంతర్ దీక్షాస్థలి నుంచి రెజ్లర్లను పోలీసు బలగాలు వచ్చి బలవంతంగా తీసుకువెళ్లారు. టెంట్లు ఎత్తివేశారు. ఈ రోజే సాక్షి, వినీష్, బజ్‌రంగ్ తమ విధులకు తిరిగి వెళ్లారని ఇప్పుడు వెల్లడైంది.
రైల్వేలో తమ విధుల్లో తిరిగి చేరామని, అయితే తమ ఉద్యమం ఆగబోదని, ఫెడరేషన్ అధ్యక్షుడు సింగ్‌ను అరెస్టు చేయడమే తమ ప్రధాన డిమాండ్ అని సాక్షి మాలిక్ తెలిపారు. తాము నిరసనల నుంచి విరమించుకున్నామనే వార్తలను తోసిపుచ్చారు. తమ ఆందోళన తరువాతి దశ గురించి ఆలోచిస్తున్నామని, ఇది న్యాయం కోసం సాగే పోరు అని, వెనకడుగు ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తాము అమిత్ షాతో మామూలుగానే కలిశామని, ఇందులో ప్రత్యేకత ఏదీ లేదని, సింగ్‌ను అరెస్టు చేయాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని ఆయనకు తెలిపామని వివరించారు. రెజ్లర్ల ఉద్యమానికి పలు వర్గాల నుంచి ప్రత్యేకించి క్రీడాకారులు, ఇటీవలే హర్యానా పంజాబ్‌కు చెందిన రైతు సంఘాల నుంచి మద్దతు లభించింది. రైతులు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి చేరుకుని రెజ్లర్ల ఉద్యమంలో తాము పాలుపంచుకుంటామని ప్రకటించారు. దీనితో ఈ అంశం కీలక మలుపు తిరిగే పరిస్థితి ఏర్పడింది. ఈ దశలోనే ప్రముఖ రెజ్లర్లు తమ విధుల్లోకి చేరారని నిర్థారణ కావడంతో ఇది మలుపు తిరిగేందుకు దారితీసిందనే వార్తలు వెలువడ్డాయి.