Monday, January 20, 2025

బ్రిజ్ భూషణ్‌పై చర్యల కోసం సుప్రీం కోర్టుకు రెజ్లర్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్లూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ వినేశ్ ఫొగాట్‌తో సహా ఏడుగురు రెజ్లర్లు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కొంత కాలం క్రితం భారత స్టార్ మహిళా రెజ్లర్లు డబ్లూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. బ్రిజ్‌భూషణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ అప్పట్లో భారత స్టార్ రెజ్లరు రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసనకు దిగారు. ఈ నిరసనలో రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియా, సాక్షి మలిక్ తదితర స్టార్ రెజ్లర్లు సయితం పాల్గొన్నారు. ఇదిలావుంటే బ్రిజ్‌భూషణ్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసినప్పటికీ కేసు నమోదు చేయడంలో పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోరుతూ సోమవారం సుప్రీం కోర్టుకు వెళ్లారు. అంతేగాక డబ్లూఎఫ్‌ఐ అధ్యక్షుడిపై ఫిర్యాదు చేసిన వారిలో మైనర్ కూడా ఉన్నందున ఫోక్సో చట్టాన్ని కూడా చేర్చాలని వారు సుప్రీం కోర్టును కోరారు.

కాగా, రెజ్లర్ల ఫిర్యాదుపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చండ్రచూడ్ సానుకూలంగా స్పందించారు. ఈ పిటిషన్‌ను మంగళవారం లిస్ట్ చేయాలని రెజ్లర్ల తరఫు న్యాయవాదికి సూచించారు. ఈ వివాదం పూర్వపరాల్లోకి వెళితే బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపులకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తూ ఈ ఏడాది జనవరిలో రెజ్లర్లు ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శనకు దిగారు. రెజ్లర్ల ఆందోళన తీవ్ర రూపం దాల్చడంతో కేంద్ర ప్రభుత్వం దీనిలో జోక్యం చేసుకుంది. అంతేగాక దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ సారథ్యంలో ఓ కమిటీని కూడా కూడా ఏర్పాటు చేసింది. ఈ విదాదంపై పూర్తి స్థాయి విచారణ చేపట్టిన పర్యవేక్షక కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించింది. కానీ ఈ నివేదికను కేంద్రం బయట పెట్టకపోవడంతో పాటు బ్రిజ్ భూషణ్‌పై ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంతో రెజ్లర్లు మరోసారి నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆదివారం తిరిగి దీక్ష చేపట్టారు. ఇదే సమయంలో బ్రిజ్ భూషణ్‌పై ఓ మైనర్ సహా ఏడుగురు బాలికలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన పోలీసులు స్పందించక పోవడంపై రెజ్లర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని రెజ్లర్లు స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News