Tuesday, September 17, 2024

రెజ్లింగ్ అంత ఈజీ కాదు

- Advertisement -
- Advertisement -

ఒలింపిక్ హీరో అమన్ సెహ్రావత్

న్యూఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి రికార్డు సృష్టించిన భారత యువ రెజ్లర్ అమన్ సెహ్రావత్ తొలిసారి మీడియా ముందుకు వచ్చాడు. పురుషుల 57 కిలోల విభాగంలో ఉడుంపట్టు పట్టి అమన్ కాంస్యం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అసాధారణ ఆటతో అలరించిన అమన్ ఫైనల్‌కు చేరడం ఖాయమని అభిమానులు భావించారు. కానీ అమన్ ఒత్తిడిని తట్టుకోలేక సెమీస్ పోరులో పరాజయం చవిచూశాడు. అయితే కాంస్య కోసం జరిగిన పోరులో మాత్రం అమన్ అద్భుత ఆటను కనబరిచాడు. ప్యూర్టోరికోకు చెందిన దరియన్ టోయ్ క్రజ్‌తో జరిగిన పోటీలో చారిత్రక విజయం సాధించి భారత్‌కు కాంస్యం అందించాడు.

అయితే కాంస్య పతక పోరుకు ముందు అమన్ అనూహ్యంగా మూడున్నర కిలోల బరువు పెరిగాడట. ఈ విషయాన్ని అమన్ స్వయంగా వెల్లడించాడు. బరువు తగ్గించుకోవడం కోసం రాత్రంతా కసరత్తులు చేసి ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదని వివరించాడు. కాగా, ఇతర గేమ్‌లతో పోల్చితే రెజ్లింగ్ చాలా కఠినమైన ఆట అని అమన్ పేర్కొన్నాడు. కనీసం 1520 రోజుల ముందు నుంచి బరువును నియంత్రణలో ఉంచుకోవాల్సి ఉంటుందన్నాడు. అయితే బౌట్‌ల సమయంలో బరువు సమస్యగా మారుతుందన్నాడు. ఇలాంటి పరిస్థితే తనకు కాంస్య పతక పోరుకు ముందు ఎదురైందని అమన్ తెలిపాడు. ఈ పోరుకు ముందు నా బరువు దాదాపు 3.5 కిలోలు పెరిగింది. దాన్ని తగ్గించుకోవడానికి తాను తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందన్నాడు. బరువును తగ్గించుకోవడానికి రాత్రంతా మేల్కొని ఉండక తప్పలేదన్నారు.

బౌట్ జరిగే ముందు రోజు రాత్రి ప్రతి రెజ్లర్‌కు చాలా కీలకమన్నాడు. నీళ్లు తాగినా బరువు పెరిగే ప్రమాదం ఉంటుందన్నాడు. దీంతో ప్రతి రెజ్లర్ ఈ విషయంలో కఠిన సవాల్‌ను ఎదుర్కొక తప్పదన్నాడు. తాను కూడా కాంస్య పతకానికి ముందు చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నానని అమన్ వివరించాడు. ఇదిలావుంటే రెజ్లర్ల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని బౌట్ సమయంలో బరువు విషయంలో కనీసం రెండు కిలోల మినహాయింపు ఇవ్వాలని అమన్ నోరాడు. ఇదిలావుంటే పారిస్ ఒలింపిక్స్‌లో 100 గ్రాముల అధిక బరువును కలిగి ఉందనే కారణంతో భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై నిర్వాహకులు అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. దీంతో వినేశ్ పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయింది. కాగా, వినేశ్‌పై అనర్హత వేటు విషయం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News