Wednesday, January 22, 2025

ఈ గద ఎవరి వశమయ్యేనో?

- Advertisement -
- Advertisement -

లండన్ : ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో అతృతగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. క్రికెట్ ప్రపంచంలోనే రెండు అగ్రశ్రేణి జట్లుగా పేరు తెచ్చుకున్న భారత్‌-ఆస్ట్రేలియాల మధ్య బుధవారం నుంచి డబ్లూటిసి ట్రోఫీ ఫైనల్ సమరం జరుగనుంది. ఇంగ్లండ్‌లోని ఓవల్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. బుధవారం ప్రారంభమయ్యే పోరు ఆదివారంతో ముగియనుంది. ఇక ఈ మెగా సమరానికి రిజర్వ్‌డేను కూడా కేటాయించారు. ఒకవేళ ప్రతికూల వాతావరణం వల్ల ఆటకు అంతరాయం కలిగితే రిజర్వ్‌డేగా ప్రకటించిన సోమవారం కూడా మ్యాచ్ కొనసాగుతోంది.

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నిర్వహించే వరల్డ్‌కప్ మాదిరిగానే కొన్నేళ్లుగా టెస్టుల్లో కూడా ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తున్నారు. తొలి సీజన్‌లో భారత్ ఫైనల్‌లో ఓటమి పాలైంది. కిందటిసారి న్యూజిలాండ్ డబ్లూటిసి ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈసారి కూడా భారత్ టైటిల్ పోరుకు దూసుకొచ్చింది. అయితే ఈ సీజన్‌లో టీమిండియా ప్రత్యర్థి మారింది. ప్రపంచంలోనే అగ్రశ్రేణి జట్టుగా పేరున్న ఆస్ట్రేలియాతో భారత్ ఫైనల్ సమరంలో తలపడనుంది. ఇరు జట్లలోనూ స్టార్ క్రికెటర్లు ఉన్నారు. దీంతో మెగా ఫైనల్ పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయమని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.
విజయమే లక్షంగా..
కిందటి సీజన్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న టీమిండియా ఈసారి ట్రోఫీపై కన్నేసింది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న మెగా ఫైనల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ సమతూకంగా కనిపిస్తోంది. అయితే మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ గాయం బారిన పడడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. అయితే రోహిత్ గాయం తర్వాత కూడా సాధనలో పాల్గొనడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకా శం ఉంది. ఐపిఎల్‌లో గుజరాత్‌కు ప్రాతినిథ్యం వహించిన యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ వరుస సెంచరీలతో పెను ప్రకంపనలు సృష్టించాడు. డబ్లూటిసి ఫైనల్లో కూడా అతని నుంచి జట్టు మెరుగైన ప్రదర్శనను ఆశిస్తోంది. రోహిత్‌తో కలిసి అతను శుభారంభం అందిస్తే టీమిండియాకు తిరుగే ఉండదు. చటేశ్వర్ పుజారా, అజింక్య రహానె, విరాట్ కోహ్లి తదితరులతో భారత బ్యాటింగ్ చాలా బలంగా ఉంది.

కౌంటీ క్రికెట్‌లో ఆడిన అనుభవం పుజరాకు కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. కొద్ది రోజులుగా పుజా రా ఇంగ్లండ్ కౌంటి క్రికెట్‌లో ఆడుతున్నాడు. ఇది టీమిండియాకు ఊరటనిచ్చే అంశమే. ఇక రహానె, కోహ్లిలు ఐపిఎల్‌లో అద్భుతంగా రాణించారు. భారీ స్కోర్లతో తమ తమ జట్లకు అండగా నిలిచారు. ఈసారి కూడా వీరు ఇదే జోరును కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక వికెట్ కీపర్‌లో శ్రీకర్ భరత్, ఇషాన్ కిషన్‌లలో ఎవరికీ చోటు కల్పిస్తారనేది ఆసక్తిగా మారింది. అంతేగాక రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్‌ల రూపంలో అగ్రశ్రేణి ఆల్‌రౌండర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. దీంతోపాటు షమి, సిరాజ్, శార్దూల్, ఉమేశ్ తదితరులతో బౌలింగ్ విభాగం చాలా బలంగా ఉంది.
ఫేవరెట్‌గా కంగారూలు..
మరోవైపు ఆస్ట్రేలియా కూడా విజయమే లక్షంగా ఫైనల్‌కు సిద్ధమైంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆస్ట్రేలియా సమతూకంగా కనిపిస్తోంది. వార్నర్, ఉస్మాన్ ఖ్వాజా, లబుషేన్, స్టీవ్‌స్మిత్, ట్రావిస్ హెడ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కారీ వంటి బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అంతేగాక పాట్ కమిన్స్, మిఛెల్ స్టార్క్, లియాన్, బొలాండ్, జోష్ ఇంగ్లిస్ తదితరులతో బౌలింగ్ కూడా బలంగానే ఉంది. దీంతో ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News