Saturday, November 23, 2024

తేరుకున్న టీమిండియా

- Advertisement -
- Advertisement -

WTC final : India lead with 13 runs

చెలరేగిన షమి, ఇషాంత్, కివీస్ 249 ఆలౌట్, డబ్లూటిసి ఫైనల్ పోరు

సౌతాంప్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో టీమిండియా తేరుకుంది. కివీస్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 249 పరుగులకే పరిమితం చేయడంలో భారత బౌలర్లు సఫలమయ్యారు. దీంతో కివీస్ మొదటి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల ఆధిక్యం మాత్రమే సాధించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియా తాజా సమాచారం లభించే సమయానికి 24 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 45 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 13 పరుగుల ఆధిక్యం లభించింది.

ఆరంభంలోనే..

అంతకుముందు 101/2 ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం ఐదో రోజు తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. సీనియర్ బ్యాట్స్‌మన్ రాస్ టెలర్ రెండు ఫోర్లతో11 పరుగులు చేసి షమి బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. కొద్ది సేపటికే హెన్రీ నికోల్స్ (7), వికెట్ కీపర్ వాట్లింగ్ (1)లు కూడా వెనుదిరిగారు. దీంతో కివీస్ 135 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ఒకవైపు వికెట్లు పడుతున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన పోరాటం కొనసాగించాడు. గ్రాండోమ్‌తో కలిసి కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. అయితే కుదరుగా ఆడుతున్న గ్రాండోమ్ (13)ను షమి ఔట్ చేశాడు. తర్వాత వచ్చిన యువ ఆటగాడు జెమీసన్ దూకుడును ప్రదర్శించాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించాడు. మరోవైపు విలియమ్సన్ సమన్వయంతో ఆడుతూ అతనికి అండగా నిలిచాడు. కానీ ఒక సిక్స్‌తో 21 పరుగులు చేసి ప్రమాదకరంగా కనిపిస్తున్న జెమీసన్‌ను షమి ఔట్ చేశాడు.

కొద్ది సేపటికే కెప్టెన్ విలియమ్సన్ కూడా వెనుదిరిగాడు. 177 బంతుల్లో 6 ఫోర్లతో 49 పరుగులు చేసిన విలియమ్సన్‌ను ఇషాంత్ ఔట్ చేశాడు. ఇక చివర్లో టిమ్ సౌథి కొద్ది సేపు పోరాటం చేశాడు. భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న సౌథి రెండు సిక్సర్లు, ఒక ఫోరత్‌తో 30 పరుగులు చేసి జడేజా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో కివీస్ 99.2 ఓవరలలో 249 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో 32 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సాధించింది. భారత బౌలర్లలో షమి నాలుగు, ఇషాంత్ మూడు, అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టారు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News