Saturday, November 23, 2024

జెమీసన్ ఉచ్చులో టీమిండియా

- Advertisement -
- Advertisement -

సౌతాంప్టన్: భారత్‌తో జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ సమరంలో న్యూజిలాండ్ పైచేయి సాధించింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 217 పరుగులకే ఆలౌటైంది. తర్వాత మొదటి ఇన్నింగ్స్ చేపట్టిన న్యూజిలాండ్ మూడోరోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. కివీస్‌కు ఓపెనర్లు డెవోన్ కాన్వే, టామ్ లాథమ్ శుభారంభం అంది ంచారు. ఇద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. వీరిని ఔట్ చేసేందుకు టీమిండియా బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కీలక ఇన్నింగ్స్ ఆడిన 3 ఫోర్లతో 30 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అప్పటికే కాన్వేతో కలిసి తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించాడు. మరోవైపు కీలక ఇన్నింగ్స్ ఆడిన కాన్వే ఆరు ఫోర్లతో 54 పరుగులు చేసి ఇషాంత్ బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు.
ఆరంభం నుంచే..
అంతకుముందు 146/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ చేపట్టిన టీమిండియాకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. కివీస్ స్పీడ్‌స్టర్ జెమీసన్ అద్భుత బౌలింగ్‌తో భారత బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. ఆట ప్రారంభమైన కొద్ది సేపటికే జెమీసన్ కీలకమైన రెండు వికెట్లు పడగొట్టి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. తొలుత కుదురుగా ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లిని అతను ఔట్ చేశాడు. 132 బంతుల్లో ఒక ఫోర్‌తో 44 పరుగులు చేసి కోహ్లిని జెమీసన్ పెవిలియన్‌కు పంపించాడు. ఆ వెంటనే వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను కూడా వెనక్కి పంపాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన పంత్ (4) పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో అజింక్య రహానె, రవీంద్ర జడేజాలు కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఇద్దరు సమన్వయంతో ఆడుతూ ముందుకు సాగారు. కానీ కీలక సమయంలో వైస్ కెప్టెన్ అజింక్య రహానె వికెట్‌ను పారేసుకున్నాడు. 117 బంతుల్లో ఐదు ఫోర్లతో 49 పరుగులు చేసిన రహానెను నీల్ వాగ్నర్ ఔట్ చేశాడు. మరోవైపు ధాటిగా ఆడిన రవిచంద్రన్ అశ్విన్ 27 బంతుల్లో మూడు ఫోర్లతో 22 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దీంతో భోజన విరామ సమయానికి భారత్ స్కోరు 7 వికెట్ల నష్టానికి 211పరుగులకు చేరింది. లంచ్ తర్వాత భారత్ వేగంగా వికెట్లను కోల్పోయింది. ఇషాంత్ శర్మ (4), బుమ్రా (0), జడేజా (15) వెంటవెంటనే పెవిలియన్ చేరడంతో భారత్ ఇన్నింగ్స్ 92.1 ఓవర్లలో 217 పరుగుల వద్ద ముగిసింది. కివీస్ బౌలర్లలో జెమీసన్ ఐదు, వాగ్నర్, బౌల్ట్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

WTC Final: New Zealand 101/2 at stumps on Day 3

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News