సౌథాంప్టన్: ఇంగ్లండ్‌లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌ను నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) తీసుకున్న నిర్ణయాన్ని క్రికెట్ అభిమానులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. జూన్ నెలలో ఇంగ్లండ్ వాతావరణ పరిస్థితులో ఆటకు అనుకూలంగా ఉండవని తెలిసి కూడా ఐసిసి ప్రతిష్టాత్మకమైన డబ్లూటిసి ఫైనల్‌ను ఇక్కడే నిర్వహించాలని ఐసిసి భావించడం విడ్డూరంగా ఉందని వారు విమర్శిస్తున్నారు. జూన్ నెలలో ఇంగ్లండ్‌లో భారీ వర్షాలు కురవడం సర్వ సాధారణం. ఈ విషయం తెలిసి కూడా ఫైనల్ కోసం ఇంగ్లండ్‌ను వేదికగా ఎంపిక చేయడాన్ని వారు దుమ్మెత్తి పోస్తున్నారు. గతంలో ఇంగ్లండ్‌లో జరిగిన పలు ప్రతిష్టాత్మకమైన మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించిన విషయాన్ని అభిమానులు గుర్తు చేస్తున్నారు. 2013, 2017 చాంపియన్స్ ట్రోఫీలతో పాటు 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. అన్ని తెలిసి కూడా తప్పులు చేయడం ఐసిసికి పరిపాటిగా మారిందని అభిమానులు విమర్శిస్తున్నారు. ఇంకొందరు అయితే సరదా మీమ్స్‌తో ఐసిసిను ఓ ఆట ఆడుకుంటున్నారు.