Saturday, September 21, 2024

జి జిన్‌పింగ్

- Advertisement -
- Advertisement -

Parallel rule of governors! గృహ నిర్బంధంలో పెట్టారని, ఆయన ఆధిపత్యం అంతం కానున్నదని భారీ ఎత్తున ప్రచారం జరిగిన కొద్ది రోజులకే జి జిన్‌పింగ్ వరుసగా మూడోసారి చైనా అధ్యక్షుడుగా, చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక కావడం విశేషం. చైనా కమ్యూనిస్టు పార్టీ అంతర్గత రాజకీయాల మీద అవగాహన లేకనో, దురుద్దేశంతో దుష్ప్రచారం చేయాలనో కొన్ని శక్తులు జిన్‌పింగ్ అధ్యాయం ముగిసిందని సంబరపడ్డాయి. కాని అందుకు విరుద్ధంగా మావో తర్వాత అంతటి ప్రభావవంతమైన నాయకుడుగా ఆయన నిరూపించుకొంటున్నారు. మామూలుగా చైనా అధ్యక్షులు వరుసగా రెండు సార్లు మాత్రమే ఆ పదవికి ఎన్నిక కావల్సి వుంది. అంతకు మించి కొనసాగడానికి నియమావళి అంగీకరించదు.

దానిని పక్కన పెట్టి జిన్‌పింగ్‌ను వరుసగా మూడోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా, దేశాధ్యక్షులుగా ఎన్నుకోడం అసాధారణమైన విషయం. చైనా జిన్‌పింగ్ శకంలో కొనసాగతున్నదని భావించాలి. ఆయన మొదటిసారిగా 2012లో సారథ్య పగ్గాలు చేపట్టారు. జిన్‌పింగ్ చైనా సైన్యానికి కూడా అధ్యక్షులు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఆయన జీవిత కాల అధినేతగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన వయసు 69. మామూలుగా చైనా కమ్యూనిస్టు పార్టీ నాయకులు 68 ఏళ్లకు పదవి నుంచి తప్పుకుంటారు. ఈ నియమాన్ని కూడా జిన్‌పింగ్ పక్కన పెట్టగలిగారు. పార్టీ అత్యున్నత నిర్ణాయక సంస్థలైన సెంట్రల్ కమిటీ, పొలిటికల్ బ్యూరో, స్టాండింగ్ కమిటీల నిండా జీ తన అనుయాయులనే నియమించుకోగలిగారు.

అంతేకాదు ప్రధాని పదవి నుంచి లీ కీకియాంగ్‌ను తప్పించి తనకు విధేయుడైన లీ కియాంగ్‌ను నియమించుకోగలిగారు. అలాగే కీకియాంగ్‌తో పాటు ఉప ప్రధాని వాంగ్ యాంగ్‌ను కూడా తొలగించారు. 67 ఏళ్ల వయసులోని వీరిద్దరినీ తప్పించిన జిన్, పార్టీ సిద్ధాంత కర్త స్థానంలో వున్న అదే వయసులోని వాంగ్ హునింగ్‌ను కొనసాగింప చేయడం గమనార్హం. కమ్యూనిస్టు పార్టీ చైనా ఆధిపత్యాన్ని చేపట్టి ఏడు దశాబ్దాలు దాటుతున్నది. ఈ కాలంలో ఆర్థికంగా అది సాధించిన విజయాలను ఎంత మాత్రం తక్కువ చేసి చూపలేము. 1952లో 30 బిలియన్ డాలర్లు మాత్రమే వున్న చైనా స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) 2022 నాటికి 600 రెట్లు పెరిగి 19.91 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నది.

ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. చైనా ప్రజలు ఒకప్పటి కరకు దారిద్య్రం నుంచి బయటపడ్డారు. ప్రపంచ సగటుకు మించిన జీవన ప్రమాణాలను చేరుకున్నారు. ఈ క్రమంలో చైనా అధినేతలు విశేషమైన పాత్ర పోషించారని అంగీకరించక తప్పదు. సోవియట్ యూనియన్ విడిపోడంతో కమ్యూనిస్టు పాలనను పట్టువిడుపులతో సాగించకపోతే మొదటికే మోసం తప్పదనే గుణపాఠాన్ని చైనా నాయకత్వం నేర్చుకున్నది. పార్టీ పట్టు సడలిపోకుండా ఆర్థిక రంగంలో సంస్కరణలకు తలుపులు తెరిచి విశేష ప్రయోజనాన్ని సాధించింది. ఈ రోజున అమెరికాను సవాలు చేసే స్థితికి అభివృద్ధి చెందింది. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో చైనా అమెరికాను తల దన్నింది. అమెరికా వ్యవసాయోత్పత్తి చైనా దాంట్లో కేవలం 17.58 శాతమేనని, అమెరికా పారిశ్రామిక ఉత్పత్తి చైనా ఉత్పత్తిలో 77.58 శాతమేనని గణాంకాలు చెబుతున్నాయి.అమెరికా అప్పుల్లో 13 శాతం చైనాకే వుండడం గమనార్హం. 971.8 బిలియన్ డాలర్ల విలువైన అమెరికా ట్రెజరీ బాండ్లు చైనా వద్ద వున్నాయి. ఆర్థికంగా దేశాన్ని ఇంత ఎత్తుకు ఎదిగించిన చైనా నాయకత్వం రాజకీయంగా కూడా చాలా ముందడుగులు వేసింది. ప్రపంచాధిపత్యం కోసం అమెరికాతో పోటీ పడుతున్నది.

పూర్వపు నాయకత్వం చైనాను శాంతియుతంగా అభివృద్ధి పరిచాలని అనుకోగా, జి అందుకు విరుద్ధమైన పంథాను ఎంచుకున్నారు. చైనా 2013లో ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు ప్రపంచ జనాభాలో 60 శాతాన్ని, ప్రపంచ జిడిపిలో 30 శాతాన్ని కలుపుకుంటూ 70 దేశాలకు విస్తరించాలని ఉద్దేశించింది. అమెరికాతో పొసగని దేశాలను, ఇంకా చిన్న చిన్న భూభాగాలను ఈ ప్రాజెక్టు ద్వారా దండ గుచ్చుతూ అంతిమంగా ఆ ప్రాంతంపై తన ఆధిపత్యాన్ని నెలకొల్పుకోవాలని చైనా చూస్తున్నది. అలాగే పక్కనున్న తైవాన్‌ను కలుపుకోవాలనే చిరకాల కోరిక జి హయాంలో నెరవేర్చుకోవాలని కలలు కంటున్నది. అవసరమైతే బల ప్రయోగం ద్వారా దానిని సాధించుకోవాలన్నది దాని వ్యూహం. ఇండియా పొరుగున గల బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలను మచ్చిక చేసుకోవాలని చైనా చూస్తున్నది. పాకిస్తాన్ ఇప్పటికే దాని ఒరలో కత్తి అయింది. 1962 యుద్ధం తర్వాత దాదాపుగా ప్రశాంతంగా వున్న భారతచైనా సరిహద్దులను (వాస్తవాధీన రేఖ) ఇంత కాలానికి అతి పెద్ద ఘర్షణకు గురి చేసి రెండు వైపులా భారీ ఎత్తు సైనిక మోహరింపు జరిపించిన ఘనత జి జిన్‌పింగ్ దే. ఆ విధంగా ఇండియాను సైనికంగా మరింత అప్రమత్తం చేసి భారీ రక్షణ వ్యయం ఊబిలోకి జి దించాడు. ఆయన ఎదురులేని సారథ్యాన్ని ఎంచుకున్న చైనాతో భారత్ నిరంతరం మెలకువ వహించక తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News