సంపాదకీయం: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ రష్యాలో మూడు రోజుల పాటు జరిపిన పర్యటనకు విశేష ప్రాధాన్యముంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఏడాది దాటి కొనసాగుతున్న నేపథ్యంలో ఈ యాత్ర సాగింది. అలాగే ఏడేళ్ళుగా ఎడమొగం పెడమొగంగా ఉంటూ తమ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచుతున్న ఇరాన్ సౌదీ అరేబియాల మధ్య చైనా శాంతి ఒప్పందం కుదిర్చిన వెంటనే జీ రష్యా వెళ్ళారు. యుద్ధాలను రెచ్చగొట్టే వైఖరి ద్వారా గాక శాంతి పునరుద్ధరణకు తోడ్పడే ధోరణి ద్వారా ప్రపంచ వ్యవహారాలను చక్కదిద్దే వ్యూహాన్ని చైనా చేపట్టిందని ఇరాన్ సౌదీల మధ్య అది కుదిర్చిన ఒప్పందం చాటి చెప్పింది. ఇది ఒక విధంగా అమెరికా ప్రపంచాధిపత్యాన్ని సవాలు చేసే అధ్యాయానికి తెర లేపిందనవచ్చు.
ఎప్పటి నుంచో పెండింగ్‌లో వున్న పుతిన్ ఆహ్వానాన్ని ఉన్నట్టుండి బయటకు తీసి ఈ పర్యటనకు జీ వెళ్ళారని సమాచారం. ఉక్రెయిన్‌పై దాడికి సమకట్టిన రష్యాను ఏకాకిని చేసి ప్రపంచమంతా పుతిన్‌ను ద్వేషించే పరిస్థితిని సృష్టించాలని అమెరికా, యూరపు దేశాలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్న సమయంలో జీ పర్యటన రష్యాకు, పుతిన్‌కు ఎంతో నైతిక మద్దతును ఇచ్చిందని చెప్పవచ్చు. జీ పర్యటనతో ఉక్రెయిన్ యుద్ధానికి తెరపడే అవకాశాలు మెరుగయ్యాయని అనుకోలేము. ఎందుకంటే ఈ యుద్ధంలోనూ, అంతకు ముందూ తాను ఆక్రమించుకొన్న ఉక్రెయిన్ ప్రాంతాల నుంచి రష్యా పూర్తిగా వైదొలగాలని అమెరికా డిమాండ్ చేస్తున్నది. అది జరిగినప్పుడే యుద్ధానికి ముగింపు సాధ్యమవుతుందని అంటున్నది.
ఇందుకు పుతిన్ ససేమిరా సిద్ధంగా లేరు అలాగే చైనా కూడా దీనిని సమర్థించదు. ఉక్రెయిన్‌ను రష్యా వ్యతిరేక యుద్ధ క్షేత్రంగా మార్చకుండా అమెరికాను అడ్డుకోడానికే తాను యుద్ధానికి తెర లేపానని రష్యా చెప్పుకొన్నది. యుద్ధానికి పరిష్కారం అన్ని దేశాల భద్రతా ప్రయోజనాలను నెరవేర్చేదిగా వుండాలని సంయుక్త ప్రకటనలో రష్యా, చైనాలు పేర్కొన్నాయి. ఉక్రెయిన్‌కు అమెరికా అదే పనిగా ఆయుధాలు ఇస్తున్నది. దీనిని చైనా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. యుద్ధం వల్ల ఇండియా మాదిరిగానే చైనా కూడా రష్యా నుంచి తక్కువ ధరకు క్రూడాయిల్ సరఫరాను పొందుతున్నది. 2021లో రష్యా నుంచి 52.1 బిలియన్ డాలర్ల విలువైన ఆయిల్, బొగ్గు, సహజ వాయువును దిగుమతి చేసుకొన్న చైనా, 2022లో 81.3 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులను చే-సుకొన్నది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగినంత కాలం దానిపై అమెరికా, యూరపు దేశాల ఆంక్షలూ అమల్లో వుంటాయి. అలాగే ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధ సాయమూ నిరాటంకంగా సాగుతుంటుంది.
అది అమెరికా, యూరపుల మధ్య విభేదాలకు దారి తీసే అవకాశాల్లేకపోలేదు. దీనిని చైనా తన ఆధిపత్య విస్తరణకు వినియోగించుకొంటుంది. రష్యా ఆయిల్, గ్యాస్ సరఫరాలు తగ్గిపోడమో, ఆగిపోడమో జరిగిన తర్వాత యూరపు దేశాలు ఆర్థికంగా విపత్తులో పడ్డాయి. రష్యా ఆయిల్ , గ్యాస్‌లతో నిమిత్తం లేకుండా నడిపించుకోగల సామర్థం అమెరికాకు వున్నంతగా యూరపు దేశాలకు లేదు. ఈ నేపథ్యంలో చైనా పని కట్టుకొని ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపించడానికి చొరవ తీసుకొనే అవకాశాల్లేవు. సంప్రదాయానికి భిన్నంగా వరుసగా మూడోసారి చైనా అధ్యక్ష పదవి అలంకరించిన జీ తన హయాంలో బీజింగ్‌ను ప్రపంచాధిపతిగా మార్చాలని శక్తివంచన లేకుండా కృషి చేస్తాడని స్పష్టపడుతున్నది. జీ రష్యా పర్యటన ప్రపంచంలో ఒక అతి ముఖ్యమైన మార్పుకి సూచన అని, అంతర్జాతీయ వ్యూహాత్మక పరిస్థితిలో మార్పును సూచిస్తున్నదని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హెన్రీ కిస్సింజర్ చేసిన వ్యాఖ్య గమనించదగినది.
యుద్ధ ముగింపు కోసం చైనా 12 అంశాల ప్రతిపాదనను చేసింది. దీనిని గమనించిన అమెరికా తాను కోరుకొంటున్న రీతిలో యుద్ధ విరమణకు జీ ప్రయత్నించబోడని అభిప్రాయపడినట్టు తెలుస్తున్నది. ఏ పాలనా పద్ధతి కూడా విశ్వజనీనం కాదని, ఏ ఒక్క దేశం అంతర్జాతీయ రంగంపై ఎల్లకాలం ఆధిపత్యం చెలాయించజాలదని జీ చేసిన వ్యాఖ్య అమెరికాను ఉద్దేశించిందేనని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఉక్రెయిన్‌కు అమెరికా ఇస్తున్న మాదిరిగా రష్యాకు చైనా ఇంత వరకు నేరుగా ఆయుధ సరఫరా చేయకపోడమే ఒక మంచి విషయం. అది జరిగితే యుద్ధం మరింత తీవ్ర స్థాయిని చేరుకునే ప్రమాదం పొంచి వుంటుంది. చైనా, రష్యాలు ఇలా చేరువ కావడం భారత దేశానికి హితవైన పరిణామం కాబోదు. మనం అప్రమత్తంగా వుండవలసిన అవసరం వుంది. జీ రష్యాలో పర్యటిస్తున్న సమయంలోనే జపాన్ ప్రధాని ఫుమియో కిషిదా ఉక్రెయిన్ రాజధానిని సందర్శించారు. అదే సమయంలో ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ దాడులు ముమ్మరించాయి. అందుచేత యుద్ధం ముగింపుకి వచ్చే పరిణామం కనుచూపు మేరలో లేదనే భావించాలి.