Thursday, December 26, 2024

వేగిరమే యాదాద్రి పూర్తి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ /మిర్యాలగూడ : యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమల్లు అ ధికారులను ఆదేశించారు. శనివారం ఉదయం మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి లతో కలిసి ఆయన హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో నిర్మాణంలో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టు ను సందర్శించి, అధికారులతో సమీక్ష సమావే శం నిర్వహించారు. అంతకు ముందుగా థర్మల్ పవర్ స్టేషన్లో స్థానికుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.

ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శం కర్ నాయక్, అధికారులు, కాంగ్రెస్ నేతలు మంత్రుల బృందానికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రాజెక్టు పురోగతిపై చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చినందుకు డిప్యూటీ సీఎం అధికారులను అభినందించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం మంత్రులుగా ఉన్న ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లకు ఈ ప్రాజెక్టుపై పూర్తి అవగాహన ఉందని గతంలో వీరిద్దరూ ఎంపీలుగా ఉన్న క్రమంలో ప్రాజెక్టు పురోగతికి కృషి చేశారని వివరించారు. ప్రాజెక్టు పూర్తికి ఇద్దరు మంత్రుల సంపూర్ణ సహకారం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రెండుసార్లు ప్రాజెక్టు అంచనా వ్యయాలు పెంచడంతో బడ్జెట్ భారీగా పెరిగిందని ఫలితంగా రాష్ట్ర ఖజానాకు భారంగా మారిందని, ప్రజలకు ఆందోళన కలుగుతుందని వివరించారు. ఈ ప్రాజెక్టును తొందరగా పూర్తి చేయకపోతే మోయలేని భారంగా మారుతుంది అన్నారు. అందుకే పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టాం, ఈ క్రమంలోనే థర్మల్ పవర్ స్టేషన్ ను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామన్నారు. గతంలో హైదరాబాదులో ఈ ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రాజెక్టు పూర్తికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. ప్రాజెక్టు ద్వారా స్థానికంగా ఉన్న స్కిల్డ్, అన్ స్కిలల్డ్ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశంపై ఆలోచన చేయాలన్నారు. ప్రస్తుతం పని చేస్తున్న అన్ స్కిల్ లేబర్ ఎక్కడి నుంచి వస్తున్నారు వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు సమాధానం ఇస్తూ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత స్థానికులకే అవకాశాలు కల్పిస్తామన్నారు. త్వరితగతన ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఒక వ్యవస్థను, ఓ సమర్థమైన అధికారిని నియమించుకోవాలని సూచించారు. రోడ్లు, రైల్వే వంటి పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు సంబంధిత అధికారి మంత్రులతో, ఉన్నత స్థాయి అధికారులతో సమన్వయం చేసుకుంటారని సూచించారు. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేసేందుకు ఓ పాలసీని రూపొందించాలని అధికారులు భావిస్తే అందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వ పక్షాన ఎల్లవేళలా సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక విద్యుత్తు రంగాల వైపు వెళుతున్నారని వివరించారు. సోలార్, హైడ్రో, విండ్ ఎనర్జీ వంటి గ్రీన్ ఎనర్జీ రంగాలు విస్తృతంగా పెరుగుతున్నాయి, అవి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేలోపు యాదాద్రి థర్మల్ పవర్ పనులు పూర్తి కావాలన్నారు. గత ప్రభుత్వం యాదాద్రి, భద్రాద్రిలో థర్మల్ వైపు ముగ్గు చూపిందని అన్నారు. పునరుత్పాదక విద్యుత్తు తక్కువ ధరకు, కాలుష్యరహితంగా అందుబాటులోకి వస్తుందన్నారు. బిహెచ్‌ఈఎల్ పేరున్న ప్రభుత్వ రంగ సంస్థ యాదాద్రి పనులు త్వరగా పూర్తి చేయకపోతే ఆ సంస్థకు చెడ్డ పేరు వస్తుందన్న విషయాన్ని సంస్థ అధికారులు, ఇంజనీర్లు దృష్టిలో పెట్టుకోవాలని తెలిపారు. పాత ప్రభుత్వం ఆలోచనలు, అలవాట్లు పద్ధతులు మార్చుకోకపోతే ప్రాజెక్టు వ్యయం పెరిగి ప్రతి రూపాయి రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారుతుంది అన్నారు. ప్రాజెక్టుకు అవసరమైన ముడి పదార్థాలు అందించేందుకు మైనింగ్ కార్పొరేషన్ సిబ్బంది సిద్ధంగా ఉందన్నారు. అవసరమని భావిస్తే వారితో సమావేశం ఏర్పాటు చేసుకుందామని తెలిపారు. ఈ ప్రాజెక్టు సంపద రాష్ట్ర ప్రజలకు పూర్తిస్థాయిలో ఉపయోగపడాలి ఏ కొందరి వ్యక్తుల పరం కాకూడదన్నారు. ఈ ఆశయం నెరవేర్చి క్రమంలో అధికారులు ఎటువంటి బెదిరింపులకు లొంగాల్సిన పని లేదన్నారు. ప్రాజెక్టును పూర్తి చేసేందుకు 24/7 తనతోపాటు సీనియర్ మంత్రులు, అధికార యంత్రాంగం అందుబాటులో ఉంటారని భరోసా ఇచ్చా రు. ప్రాజెక్టు పనుల్లో నిర్లక్ష్యం, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. ప్రాజెక్టు పురోగతి పనుల గురించి ప్రశ్నించగా ఏడాది సెప్టెంబర్ లో రెండు యూనిట్ల ద్వారా 1600 మెగావాట్ల విద్యుత్ను పూర్తిస్థాయిలో ఉత్పత్తి చేస్తామనీ, మార్చి 20 25 నాటికి మొత్తం ఐదు యూనిట్ల ద్వారా నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి తెస్తామని వివరించారు. ప్రాజెక్టు ద్వారా వచ్చే కాలుష్యం, కలుషితనీరు మూలంగా స్థానికులకు ఎదురయ్యే ఇబ్బందులు వాటి పరిష్కారానికి తీసుకునే మార్గాల గురించి డిప్యూటీ సీఎం ఆరా తీశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్న నేపథ్యంలో జీరో పర్సెంట్ ధూళి బయటికి వెళ్లకుండా నిర్మాణం జరుగుతుందని వివరించారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే బూడిద ఆధారంగా ఇతర ప్రాంతాల్లో పలు ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయన్నారు. ఎప్పటికప్పుడు బూడిదను ఇతర ప్రాంతాలకు విక్రయిస్తామన్నారు. స్థానికంగా వినియోగించే నీటిని తిరిగి శుద్ధి చేసి ప్రాజెక్టు అవసరాలకే వినియోగిస్తామని తెలిపారు. స్థానికంగా ప్రాజెక్టు నిర్మాణానికి తీసుకున్న రుణాలు వాటి వడ్డీ రేట్ల గురించి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రశ్నించారు. కమర్షియల్ బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ రేటు ఉంటే దానిని తగ్గించాలని కోరే అవకాశం ఉందని ఎంపీగా పనిచేసిన సమయంలో తనకు ఆ అనుభవం ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రాజెక్టు పనుల్లో జాప్యానికి కారణాలను మంత్రి ఉత్తమ్ అడిగి తెలుసుకున్నారు. కరోనా మూలంగా ఆరు నెలలపాటు పనులు నిలిచి ఇతర రాష్ట్రాల కార్మికులు స్వస్థలానికి వెళ్లిపోయిన విషయాన్ని వివరించారు. స్థానికంగా ఏ గ్రేడ్ కు చెందిన బొగ్గును వినియోగిస్తారు ప్రస్తుతం సింగరేణిలో వినియోగిస్తున్న బొగ్గు గ్రేడ్ వివరాలను మంత్రి ఉత్తమ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఉద్యోగులకు ఎన్ని క్వార్టర్స్ అందుబాటులో ఉన్నాయి, ప్రాజెక్టు వినియోగంలోకి వచ్చేసరికి ఎన్ని క్వార్టర్స్ నిర్మిస్తారు అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు. స్థానికులకే ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా, సబ్ కాంట్రాక్టులు, ఇతర చిన్న చిన్న పనుల్లో స్థానికులకే అవకాశం కల్పించడం ద్వారా చేయూతనివ్వాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అధికారులను కోరారు. ప్రాజెక్టు చేపట్టిన నాటి వ్యయం, ఆ తర్వాత రెండు సార్లు పెంచిన అంచనాలను అధికారులు వివరించారు. ప్రస్తుతం పవర్ ప్లాంట్ లో జరుగుతున్న అన్ని రకాల అభివృద్ధి పనులను వీడియో ప్రజెంటేషన్ రూపంలో మంత్రుల బృందానికి వివరించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ సీఎం డి. సయ్యద్ అలీ రిజ్వీ, ట్రాన్స్కో డైరెక్టర్ అజయ్, పవర్ ప్లాంట్ సి. ఈ. సమ్మయ్య, నల్గొండ జిల్లా కలెక్టర్ హరి చందన, జిల్లా ఎస్పీ చందనా దీప్తి, అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News