Thursday, January 23, 2025

స్వర్ణ శోభితం యాదగిరి క్షేత్రం

- Advertisement -
- Advertisement -

 

యాదగిరిగుట్ట క్షేత్రం అనంతకోటి స్వర్ణకాంతులీనుతున్నది. బ్రహ్మోత్సవాల సందర్భంగా యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం స్వర్ణ శోభితమైంది. విద్యుత్ దీపాల వెలుగులు విరజిమ్మే క్షేత్రపురం స్వర్ణ లోగిళ్ళలో ధగధగలాడుతుంది. అశేష భక్తజనాన్ని కనువిందుచేస్తున్నాయి. లక్ష్మీదేవి నరసింహ స్వామి కళ్యాణ గడియలు రానే వచ్చాయి. నమో నరసింహ మంత్రంతో యాదగిరి గుట్ట క్షేత్రం మార్మోమోగుతున్నది. గత మార్చి నెలలో సిఎం కెసిఆర్ దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన మహా కుంభ సంప్రోక్షణ మహోత్సవంతో ఈ ఆలయంలో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అయిన విషయం తెలిసిందే. ‘శ్రీకర, శుభకర, ప్రణభ స్వరూప శ్రీలక్ష్మీ, నరసింహ నమో నమః! అంటూ జయజయ ధ్వానాలు ప్రతిధ్వనిస్తున్నాయి. యావత్ తెలంగాణ భక్తజనం స్వామికి ప్రణమిల్లుతున్నది. స్వామికి నివేదించుకుంటే ఎంతటి కష్టాలు అయినా తొలగిపోతాయనేది తెలంగాణ ప్రజల నమ్మకం. సర్వ జనహితం కోరే నేత కెసిఆర్ లక్ష్మీనరసింహుని అనుగ్రహంతో ఆలయ పునర్ నిర్మాణ వైభవాన్ని నిరాటంకంగా పూర్తి చేశారు. పునర్నిర్మాణంతో యాదగిరిగుట్ట దివ్య క్షేత్రంగా, ఆధ్యాత్మిక కళాక్షేత్రంగా విరాజిల్ల్లుతున్నది. ముక్కోటి దేవతల స్వర్ణ నిలయం. ఆధ్యాత్మిక దైవమందిరం. ఉగ్ర, గండభేరుండ, జ్వాల, యోగానంద, లక్ష్మీసమేత అయిదు రూపాలలో నరసింహుడిని కొలుస్తారు.

అంగరంగ వైభవంగా యాదగిరి నర్సన్న కల్యాణం కనులారా తిలకించేందుకు ముక్కోటి దేవతలు యాదగిరి చేరుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా లక్ష్మీదేవి, నరసింహస్వామి కల్యాణం కన్నుల పండువగా మంగళవారం వైభవంగా జరిగింది. లక్ష్మీనరసింహ పుణ్యభూమిని దర్శించుకోవడానికి సమస్త జనులు ప్రతి రోజూ తరలివస్తున్నారు. తెలంగాణ గడ్డ మీద లక్ష్మీనృసింహ స్వామి కొలువై ఉండటం తెలంగాణ జనుల భాగ్యం. యాదగిరి గుట్టలో ఎటు చూసినా భక్తిభావంతో జనం మనసు ఉప్పొంగుతున్నది. పదునాలుగు లోకాలన్నీ మొక్కే జ్వాల నరసింహ స్వామినీ దర్శించడానికి భక్తజనులు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాదిగా తరలివస్తుండటంతో తెలంగాణ మట్టి పులకించిపోతున్నది. మన ఇల్లు, మన ఊరు, సమాజం, దేశం, ప్రపంచమంత సంతోషంగా ఉండాలి. ఎంతో గొప్పగా తీర్చిదిద్దిన దివ్య మందిరాన్ని చూసే గొప్ప అవకాశం సిఎం కెసిఆర్ ద్వారా లభిస్తుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి ఆలయాన్ని కనులవిందుగా అభివృద్ధి పరుస్తున్నారు.

ఆలయ గోపురం మొత్తం బంగారు పూత తాపడంతో ఆలయం పసిడి కాంతుల వెలుగులు విరజిమ్ముతున్నది. ఆస్వామి దర్శనం కోసం మా బావుతో కలిసి ఏటా అందరం యాదగిరి గుట్టకు వెళుతుంటిమి. 30 ఏండ్ల క్రితం చూసిన, మూడు ఏండ్ల క్రితం వరకు చూసిన యాదగిరిగుట్ట క్షేత్రాన్ని ఇప్పుడు చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆలయం ముందు ఫొటో దిగుతుంటే అసలు ఎక్కడున్నాం? గతంలో చూసిన యాదాద్రి ఇప్పటి క్షేత్రం అసలు కలయా? నిజమా? అనిపించింది. ఇటీవల ఢిల్లీ, పంజాబ్ సిఎంలు కేజ్రీవాల్, భగవంత్ సింగ్ మాన్, యుపి మాజీ సిఎం అఖిలేష్ యాదవ్ యాదగిరి నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అద్భుతంగా ఆలయం నిర్మాణం జరిగిందని ప్రశంసించారు.

సంకల్ప యోగులు, పల్లవ, చోళ, త్రిభువన మల్లుడు, శ్రీకృష్ణదేవరాయలు, కాకతీయ రాజులు, సింగ భూపాలుడి కాలంలో నాటి ఆలయం విరాజిల్లితే. కెసిఆర్ దానిని సువర్ణమయంగా, భక్త కోటి కోసం నృసింహ క్షేత్రపురమును సృష్టించారు. సర్వదేవ దేవతలను స్మరించుకునే భావన తెలంగాణ భూమిలో కనిపిస్తుంది. మనిషిని మనిషిగా, మనసుతో ప్రేమించినప్పుడు ప్రేమ, ఆప్యాయతల ముందు మతం, కులం కనబడవు. అందరూ బాగుండాలని కోరుకునేదే మతం. మతం తప్పు చేయాలని చెప్పదు. ఏ కులం కూడా కొట్లాడుకోవాలని చూడదు. వేములవాడ, భద్రాచలం, మేడారం సమ్మక్క సారక్క, జోగులాంబ వంటి దేవాలయాలను కోట్లాది రూపాయలు కేటాయించి అభివృద్ధి పరుస్తున్నారు. ముక్తీశ్వరుడి సన్నిధిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారు. గోదారమ్మ జలాశయాలన్నింటికీ జలదేవతల నామకరణం చేశారు. మేడిగడ్డ లక్ష్మిబ్యారేజ్‌గా, అన్నారం సరస్వతి బ్యారేజ్‌గా, సుందిల్ల పార్వతీ బ్యారేజ్‌గా, నంది మేడారం నందీశ్వరుడిగా, రాజన్నసాగర్, అన్నపూర్ణ సాగర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, భక్త రామదాసు, సీతారామ ప్రాజెక్ట్, తుపాకుల గూడెం సమ్మక్క సారక్క బ్యారేజ్‌గా తెలంగాణలో ఎక్కడ చూసిన జలాశయాలకు దేవతామూర్తుల పేర్లు పెట్టారు.

కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ముందడుగులు వేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. రాతి దేవాలయ నిర్మాణానికి రెండు లక్షల టన్నుల కృష్ణశిలను ఉపయోగించారు. ఈ రాయిని ప్రకాశం జిల్లా గురిజేపల్లి, గుంటూరు జిల్లా కమ్మ వారిపాలెం నుంచి తీసుకువచ్చారు. ప్రధాన స్థపతితో పాటు పదకొండు మంది ఉప స్థపతులు, రెండు వేల మంది శిల్పులు తొలి సంవత్సరం పని చేశారు. తరువాత సంవత్సరంలో పదిహేను వందల మంది శిల్పులు విధులు నిర్వహించారు. ఆలయం పునర్ నిర్మాణానికి రూ. 1200 కోట్లు ఖర్చు చేశారు. ప్రధానాలయ పునర్నిర్మాణం కోసం వైటిడిఎ రూ. 248 కోట్లు ఖర్చు చేసింది.ప్రపంచంలోనే మొదటి రాతి దేవాలయంగా లక్ష్మీనరసింహస్వామి గుడి నిర్మితమైంది. వేంచేపు మండపం, బ్రహ్మోత్సవ మండపం, అష్టభుజి ప్రాకార మండపాలను తీర్చిదిద్దారు. వంద సంవత్సరాలకు ముందు నిర్మించిన అనుభూతి భక్తులకు కలిగే విధంగా నిర్మించారు.ప్రస్తుత గర్భాలయాన్ని అలాగే ఉంచి దాని చుట్టూ గోడను నిర్మించారు. ఆలయంలోకి భక్తులు సులువుగా వెళ్లేందుకు వీలుగా ముఖద్వారాన్ని కూడా వెడల్పు చేశారు. గతంలో పదివేల మంది భక్తులకు వీలుండే చోటును ఇప్పుడు ముప్పయి నుంచి నలభై వేల మంది వచ్చిపోయేందుకు వీలుగా విస్తరించారు. గుట్ట మీద విష్ణు పుష్కరణి, గుట్ట కింద లక్ష్మి పుష్కరిణి ఏర్పాటు చేశారు.

చిటుకుల మైసారెడ్డి, 94905 24724

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News