Wednesday, November 6, 2024

డిసెంబర్‌లో యాదాద్రి

- Advertisement -
- Advertisement -

తుది మెరుగులు దిద్దుకుంటున్న వైనం
సిఎం కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభం
ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆగమ, శిల్పశాస్త్ర ప్రకారం పనులు
ప్రధానాలయంతో పాటు చుట్టూ ప్రాకారాల తుది మెరుగులు చకచకా
ఇప్పటికే రూ.1000కోట్లు, ఇంకో రూ.200కోట్లు ఖర్చయ్యే అంచనా

మన తెలంగాణ/హైదరాబాద్: అద్భుత శిల్పకళతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు దాదాపుగా తుది దశకు చేరుకున్నాయి. భవిష్యత్ తరాల వారు గొప్పగా చెప్పుకునేలా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. అడుగడుగునా ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ఆగమ, శిల్పశాస్త్ర ప్రకారం అక్కడ ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. కరోనా కారణంగా ఆలయ పనులు కొంత మందగించినప్పటికీ ప్రస్తుతం తిరిగి జోరందుకున్నాయి. రానున్న నవంబర్, డిసెంబర్ నెలల్లోనే యాదాద్రి దేవస్థానం ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రధానాలయంతో పాటు చుట్టూ ప్రాకారాల తుది మెరుగుల పనులు చకాచకా సాగుతున్నాయి. ఆయన పునర్నిర్మాణంపై ఇప్పటి వరకు రూ.1000 కోట్ల వెచ్చించగా, నిర్మాణ పనులు పూర్తయ్యేవరకు ఇంకో రూ.200 కోట్లు ఖర్చువుతాయని భావిస్తున్నారు.

దేవాలయ నిర్మాణంలో భాగంగానే అందమైన విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. వైఖానస, ఆగమశాస్త్రాలు, వైష్ణవ సంప్రదాయాల ప్రకారం పవిత్రమైన రోజుల్లో, వివిధ సందర్భాలు, పండగలు, ఇతర సమయాల్లో రాత్రి వేళల్లో రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులతో ధగధగ మెరిసిపోయే విధంగా దేవాలయాన్ని అత్యంత నయనానందకరంగా తీర్చిదిద్దుతున్నారు. ఒక వైపు ఆలయ సందర్శనకు వచ్చిన వారికి భక్తిభనాన్ని పెంపొందిస్తూనే..మరోవైపు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించే విధంగా రూపుదిద్దుకుంటున్నది. ఆలయ చుట్టూ ప్రహరీకి మరింత శోభను ఇచ్చేలా, ప్రాచీన చిత్రకళ ఉట్టిపడేలా అలంకృత రూపం(ఆర్ణమెంటల్ లుక్కు)’ తో వుండేలా, బ్రాస్ మెటల్‌తో సుందరంగా తయారువుతున్నది. దేవాలయ ముందుభాగం ప్రాచీనత, నవ్యతతో పాటు భక్తి వైకుంఠంలో సంచరించే అనుభూతిని భక్తులకు కలిగించే విధంగా పనులు తుది మెరుగులు దిద్దు కుంటున్నాయి.

ఇక ఆలయంలో ప్రహ్లాద చరిత్ర, నరసింహుని చరిత్రను తెలియ పరిచే పురాణ దేవతల చరిత్రలు అర్ధమయ్యేలా శిల్పాలను కూడా ఆలయ ప్రాంగణంలో అలంకరిస్తున్నారు. మరోవైపు మనస్తును హత్తుకునే రీతిలో పరిసర ప్రాంతాలు సైతం పచ్చదనంతో కనువిందుచేయనున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే యాదాద్రి దేవాలయం రూపురేఖలు పూర్తిగా మారిపోయి భూతల స్వర్గంలా మారిపోయింది. ఒకసారి ఆలయం ప్రారంభోత్సవం అయితే తెలంగాణ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకే ప్రభుత్వం యాదాద్రి భక్తుల ప్రసాద అవసరాల కోసం ఆటోమాటిక్ లడ్డూ మిషష్‌ను కొనుగోలు చేసింది. ఆటోమాటిక్ మిషన్ రోజుకు 3 లక్షల లడ్డూలు తయారుచేస్తోంది. వారాంతాల్లో ఇప్పటికే సందర్శకుల సంఖ్య 60 వేలకు పైగా ఉంటున్నది. ఈ నేపథ్యంలో దేవాలయం ప్రారంభమైతే వారాంతాల్లో భక్తుల రద్దీ ఒక లక్షకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో తిరుమలకు మించి భక్తులు యాదాద్రికి పోటెత్తుతారని భావిస్తున్నారు.

Yadadri Temple to be Inaugurated in Dec 2021

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News