2022 మార్చి 28న యాదాద్రి పునఃప్రారంభం
8 రోజుల ముందు నుంచి 1008 హోమ కుండాలతో 10వేల మంది రుత్విక్కులతో మహా సుదర్శన యాగం, వలసపాలకుల హయాంలో తెలంగాణలో సామాజిక వివక్షతతో పాటు ఆధ్యాత్మిక వివక్ష కూడా కొనసాగింది, చినజీయర్ స్వామి సూచనల మేరకు ఆగమశాస్త్ర ప్రకారం ఆలయ పునర్నిర్మాణం జరిగింది, నృసింహ సాగర్ కూడా పూర్తికావొచ్చింది, ప్రతి నిత్యం స్వామి వారికి ఆ జలాలతో అభిషేకం నిర్వహించవచ్చు : యాదాద్రి పర్యటనలో ముఖ్యమంత్రి కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్,యాదాద్రి: యాదాద్రి లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం వచ్చే సంవత్సరం మార్చి 28వ తేదీన మహా కుంభ సంప్రోక్షణతో పునఃప్రారంభానికి ముహూర్తం ఖరారు చేసినట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఎనిమిది రోజుల ముందు నుంచి మహా సుదర్శన యాగం జరుగుతుందన్నారు. ఆగమ నియమ నిబంధనల మేరకు నిర్మాణ పనులు జరిగాయన్నారు. ఈ ఆలయ వైభవం నలుదిక్కులా చాటేందుకు పునర్నిర్మాణం చేపట్టినట్లు వివరించారు. ప్రారంభోత్సవానికి తొమ్మిది రోజుల పాటు మహా సుదర్శన యాగం జరుగుతుందని సిఎం కెసిఆర్ తెలిపారు. చిన జీయర్ స్వామి పర్యవేక్షణలో 1008 హోమకుండాలతో 10వేల మంది రుత్వికులతో మహా సుదర్శన యాగం ఉంటుందన్నారు. హోమానికి కావాల్సిన లక్షా యాభై వేల కిలోల నెయ్యిని కూడా సమీకరిస్తున్నామని సిఎం తెలిపారు. ఇప్పటికే 1500 మంది భక్తులుండేందుకు కావాల్సిన ధర్మశాలలను అందుబాటులో ఉంచామని ఆయన తెలిపారు.
తెలంగాణ సామాజిక వివక్షే కాదు…. ఆధ్యాత్మిక వివక్ష…
మంగళవారం యాదాద్రి పర్యటించిన అనంతరం మీడియా సమావేశంలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, స్వయంబుగా వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. సమైక్యాంధ్రలో నిర్లక్ష్యానికి గురయినమన్నారు. ఆధ్యాత్మిక రంగంలో వెనుకబడినమన్నారు. గోదావరి,కృష్ణ,ప్రాణహిత పుష్కరాల నిర్వహణ ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించలేదన్నారు. ప్రత్యేక తెలంగాణలో మనం ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. తెలంగాణకు గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర ఉందన్నారు. 50 ఏళ్ల కిందట యాదాద్రికి మొదటి సారి వచ్చానని గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను ప్రశ్నిస్తేనే గత పాలకులు పుష్కర ఘాట్లు నిర్మించారని అన్నారు. తెలంగాణ సామాజిక వివక్షే కాదు. ఆధ్యాత్మిక వివక్ష కూడా కొనసాగిందన్నారు. ఈ నేపథ్యంలో యాదాద్రి ఆలయాన్ని చిన జీయర్ స్వామి సూచనల మేరకు ఆగమశాస్త్రం ప్రకారం ఆలయం పునర్నిర్మాణం జరిగిందన్నారు. యాదాద్రిలో నృసింహ సాగర్ కూడా పూర్తి కావచ్చిందని, ప్రతినిత్యం స్వామివారికి ఆ జలాలతో అభిషేకం నిర్వహించవచ్చన్నారు. ఏదైనా పొరపాటు జరిగిన స్వామివారు క్షమించి తన కార్యాన్ని పూర్తి చేసుకోవాలని కోరుతున్నానని అన్నారు.
50 ఏళ్లుగా అభివృద్ధి పనులతో
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వచ్చిన గోదావరి పుష్కర శోభ ప్రపంచానికి తెలియజేసినట్లు సిఎం వివరించారు. ఆధ్యాత్మిక ఉపాసకులు నడయాడిన ప్రాంతం తెలంగాణ అని ఆయన పేర్కొన్నారు. జోగులాంబ అమ్మవారి శక్తిపీఠానికి గతం పాలకులు ఏ మాత్రం ప్రాచుర్యం కల్పించలేదని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. పుష్కరాల్లో తాను జోగులాంబ ఘాట్లోనే పుణ్యస్నానం ఆచరించినట్లు తెలిపారు. యాదాద్రి అభివృద్ధి కోసం నాలుగైదేళ్ల క్రితం బీజం వేసినట్లు సిఎం తెలిపారు. మహోత్కృష్టమైన ఆలయాల్లో ప్రముఖమైనది యాదాద్రి ఆలయమని పేర్కొన్నారు. 50 ఏళ్లుగా అభివృద్ధి పనులతో తిరుమల నేడు దివ్యక్షేత్రంగా దర్శనమిస్తోందని సిఎం అన్నారు.
సిద్ధాంతులు, వాస్తు నిపుణులతో చర్చించాం
చినజీయర్ సూచనలతో సిద్ధాంతులు, వాస్తు నిపుణులతో చర్చించామన్నారు. మొన్నటి వరకు యాదాద్రి కరవు ఆలవాలంగా ఉన్న ప్రాంతమని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. నృసింహ సాగర్ నిర్మితం వల్ల ప్రస్తుతం ఈ ప్రాంతం నీటితో పునీతం కానుందన్నారు. నృసింహ సాగర్ నిర్మాణం దాదాపు పూర్తయిందన్నారు. ఆలయం ప్రారంభమైనా… యాదాద్రి అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉంటాయన్నారు. రాష్ట్రపతి, ప్రధాని, సిఎంల విడిదికి ప్రత్యేకంగా ప్రెసిడెన్షియల్ సూట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పుణ్యక్షేత్రాల పునర్నిర్మాణంతో ఈ ప్రాంతమంతా ఆధాత్మిక శోభతో సరి కొత్తగా కనిపిస్తుందన్నారు. మరోసారి వచ్చినప్పుడు ఇంకా లోటుపాట్లు చూసి సరిచేస్తానని అన్నారు.
గతంలో ఉన్న సమస్యలను అన్నింటిని పరిష్కరించుకుంటూ అభివృద్ధి చేస్తున్నామన్నారు. కరోనా సమయంలో కూడా ఆర్థిక వ్యవస్థలో రాష్ట్రంలో మొదటిస్థానం నిలిచిందన్నారు. రూ.6కోట్ల 90 లక్షలతో అన్ని సౌకర్యాలతో కూటిన ఆధునాతనమైన బస్టాండ్ ఏర్పాటు చేస్తామన్నారు. కొండపైకి ఉచిత బస్సు ఏర్పాటు చేస్తామన్నారు. యాదాద్రి అభివృద్ధిలో భాగంగా డ్రైనేజీ అద్భుతంగా నిర్మిస్తామన్నారు. ఆలయ ఉద్యోగులకు పిఆర్‌సితో పాటు ఇంటి స్థలం త్వరలో ఇస్తామన్నారు. అలాగే జర్నలిస్ట్ లకు ఇళ్లస్థలలు ఇస్తామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. కాగా ఆలయానికి సంబంధించిన వార్తలను దేశవ్యాప్తంగా వ్యాసాలు ఇవ్వాలి అని కోరుతున్నానని అన్నారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో టెంపుల్ సిటీ
అంతర్జాతీయ ప్రమాణాలతో టెంపుల్ సిటి నిర్మాణం జరుగుతోందని సిఎం కెసిఆర్ వెల్లడించారు. ఇందులో భాగంగా టెంపుల్ సిటీలోని 850 ఎకరాలకు సంబంధించి మొదటి దశలో 250 ఎకరాల్లో అన్ని సౌకర్యాలతో కాటేజీలు, ఉద్యానవనాలు, రోడ్ల నిర్మాణం జరుగుతోందన్నారు. ఒక్కో కాటేజీలో నాలుగు సూట్లు ఉంటాయన్నారు. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ, యాదాద్రి ఆధ్యాత్మిక నగర రూపకల్పనకు ప్రణాళికలు రూపొందించిందన్నారు. 12 భాగాలుగా అంచెల వారీగా నిర్మాణం కొనసాగుతుందన్నారు. భక్తులకు సకల సదుపాయాలు కల్పించేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో యాదాద్రి నిర్మాణం జరుగుతోందన్నారు. మొత్తం ప్రాజెక్టు సుమారు వెయ్యి ఎకరాల్లో రూపొందుతోందన్నారు. యాదాద్రిలో ఒకప్పుడు కరువు ఉండేదని సిఎం కెసిఆర్ అన్నారు. కానీ ప్రస్తుతం బస్వపురం ప్రాజెక్టు పేరుతో అభివృద్ధి జరుగుతోందన్నారు.