సకాలంలో పనులన్నీ పూర్తయ్యేలా చూడాలి
ఎన్ఆర్ఐల కోసం టియాప్ అందుబాటులోకి
అధికారుల సమీక్షలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు యాదాద్రి ఆలయ పునః ప్రారంభ పనులను వేగంగా పూర్తి చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యాదాద్రి ఆలయ పనుల పురోగతి, మహా సుదర్శనయాగం, మార్చి 28వ తేదీన మహాకుంభ సంప్రోక్షణ ఏర్పాట్లపై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అరణ్య భవన్లో నిర్వహించిన ఈ సమావేశానికి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి, వైటిడిఏ వైస్‌చైర్మన్ కిషన్ రావు, ఈఓ గీతారెడ్డి, అర్కిటెక్ట్ ఆనంద్‌సాయి, తదితరులు హాజరయ్యారు. యాదాద్రి దేవాలయ ప్రాంగణంతో పాటు టెంపుల్ టౌన్, కాటేజీల నిర్మాణాలు, లైటింగ్ ఏర్పాట్లు, కల్యాణ కట్ట, దీక్షాపరులు మండపం, అన్న ప్రసాదం, వ్రత మండపం, గండి చెరువు సుందరీకరణ, బస్ టర్మినల్స్, తదిరతల నిర్మాణాల పురోగతిపై మంత్రి చర్చించారు.
పెండింగ్ పనులు ఫిబ్రవరిలోపు పూర్తిచేయాలి
మార్చి 21న సంప్రోక్షణకు అంకురార్పణ- మహా సుదర్శన యాగం, మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాల ఏర్పాట్లు, యాగశాలల నిర్మాణం, రుత్వికులకు బస చేసేందుకు విడిది, తదితర ఏర్పాట్లపై మంత్రి ఆరా తీశారు. గడువులోగా ఆలయ పునర్నిర్మాణ, విస్తరణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఎప్పటికప్పుడు పనుల తీరుపై క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించు కుంటూ సకాలంలో పనులన్నీ పూర్తయ్యేలా చూడాలని మంత్రి సూచించారు. భక్తజన సందోహం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాదాద్రి ఆలయ పునః ప్రారంభానికి ముహూర్తం దగ్గర పడుతుందని, దాదాపుగా అన్ని పనులు ముగింపు దశకు చేరుకున్నాయని, ఇంకా పెండింగ్‌లో ఉన్న కొన్ని పనులను ఫిబ్రవరి లోపు పూర్తయేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సిఎం కెసిఆర్ దిశానిర్ధేశంతో ఈ పుణ్యక్షేత్రాన్ని సకల హంగులతో దేదీప్యమానంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. సిఎం కెసిఆర్ పిలుపు మేరకు విమాన గోపుర బంగారు తాపడానికి విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు వస్తున్నారన్నారు.
ఎన్ఆర్ఐల నుంచి విరాళాల సేకరణకు ప్రత్యేక యాప్
ఎన్ఆర్ఐ దాతల నుంచి సేకరించిన నిధులతో ఆలయాల్లో భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఐటి శాఖ రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్‌ను గురువారం అరణ్యభవన్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆవిష్కరించారు. దైవభక్తితో సేవ చేసేందుకు ఎంతో మంది ఎన్ఆర్ఐ భక్తులు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని, అలాంటి వారి కోసం ప్రత్యేకంగా టియాప్ పొలియో మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇందులో నాన్ రెసిడెంట్ ఇండియన్ అనే ప్రత్యేక ఆప్షన్ ద్వారా యాదాద్రి ఆలయంతో పాటు నగరంలోని బల్కంపేట్ ఎల్లమ్మ, పెద్దమ్మ గుడి, సికింద్రాబాద్ గణేశ్ టెంపుట్, కర్మన్‌ఘాట్ ఆలయాలకు ఎన్ఐఆర్ దాతలు విరాళాలను పంపవచ్చని ఆయన తెలిపారు. త్వరలోనే ఈ సేవలను మరిన్ని ఆలయాలకు విస్తరించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, అదనపు కమిషనర్ కె.జ్యోతి, డిఫ్యూటీ కమిషనర్ రామకృష్ణ, యాదాద్రి ఆలయ ఈఓ గీతారెడ్డి, వేములవాడ ఈఓ కృష్ణప్రసాద్, బాసర ఆలయ ఈఓ వినోద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.