4,276 ఎకరాల్లో 20,379 కోట్లతో నిర్మాణం
అక్టోబర్ నాటికి పనులు పూర్తి చేస్తామంటున్న అధికారులు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ధర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవతో నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద టిఎస్‌జెన్‌కో ఆధ్వర్యంలో పవర్ ప్లాంటు నిర్మిస్తుండగా బిహెచ్‌ఎల్ సంస్థ పనులు చేపడుతున్నది. తెలంగాణలో కరెంట్ కొరత లేకుండా చేయడంతోపాటు మిగులు విద్యుత్తు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే బృహత్తర లక్ష్యంతో 4,276 ఎకరాల్లో యాదాద్రి సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణాన్ని చేపడుతున్నారు. రూ.20,379 కోట్లతో 5 యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఒక్కో యూనిట్ 800 మెగావాట్ల సామర్ధ్యంతో మొత్తం 4 వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసేలా ప్లాంటు నిర్మిస్తున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద థర్మల్ పవర్ ప్లాంటుగా నిలువనున్నది. ఈ ప్లాంటు నిర్మాణంలో కీలకమైన 5 బొగ్గు ఆధారిత బాయిలర్ల పనులు వేగంగా నడుస్తున్నాయి. సుమారు 2 వేల మంది కార్మికులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు.
అక్టోబర్ నాటికి రెండు యూనిట్ల పనులు పూర్తి చేసి విద్యుత్తు ఉత్పత్తిని ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. మిగిలిన మూడు యూనిట్లకు సంబంధించిన పనులు 71 శాతానికి పైగా పూర్తయినట్లు చెబుతున్నారు.పర్యావరణ అనుమతులకు సంబంధించి ఎన్జీటీ కొన్ని నివేదికలను కోరిందని, వాటిని కూడా అందచేసినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పర్యావరణ అనుమతులు కూడా త్వరలో లభిస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
విద్యుత్తు ప్లాంటు కోసం రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 4 వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి ఏటా 3.5 టీఎంసీల నీరు అవసరం ఉంటుందని నిపుణులు అంచనా వేశారు. అడవిదేవులపల్లి సమీపంలో టెయిల్‌పాండ్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ నుంచి నీటిని తరలించేందుకు 22 కిలోమీటర్ల మేర చేపట్టిన పైపులైన్ పనులు వేగంగా సాగుతున్నాయి. రిజర్వాయర్‌ను ఒకసారి నింపితే 10 రోజులపాటు ప్లాంటు నీటి అవసరాలు తీరనున్నది. దామరచర్ల మండలం విష్ణుపురం రైల్వేస్టేషన్ నుంచి యాదాద్రి థర్మల్ ప్లాంటు వరకు 8.5 కిలోమీటర్ల మేర రైల్వేలైన్ నిర్మిస్తున్నారు.ఈ లైన్లో మొత్తం 14 రేకల (వ్యాగిన్లు) ద్వారా బొగ్గు రవాణా జరుగనున్నది. రోజుకు 50 వేల టన్నుల బొగ్గు అవసరం కానున్నది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆర్వోబిలు ,ఆర్‌యుబిల పనులు పూర్తి చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.పవర్ ప్లాంటుకు భూసేకరణ సమయంలో భూములు ఇచ్చిన కుటుంబాలకు ఉపాధి కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ ప్లాంటు నిర్మాణం పూర్తయితే ప్రత్యేక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.