మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ప్రభుత్వ విప్
మనతెలంగాణ/యాదాద్రి: యాదగిరిగుట్ట పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి మోడల్ సిటీగా అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య తెలిపారు. శనివారం ఐదేళ్లు పూర్తి చేసుకున్న యాదగిరిగుట్ట మున్సిపల్ కౌన్సిల్ చివరి సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలోని పలు సమస్యలను మున్సిపల్ కౌన్సిలర్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం బీర్ల అయిలయ్య విలేఖరులతో మాట్లాడుతూ.. యాదగిరిగుట్ట పట్టణంలో పారిశుద్ధం, నీటి సమస్య రాకుండా ఎప్పటికప్పుడు అధికారులు చర్యలు తీసుకోవాలని, శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు, స్థానికులకు ఇబ్బంది లేకుండా చూడాలని సూచించారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల వరకు ఇప్పుడున్న కౌన్సిలర్లు బాధ్యతాయుతగా పనిచేయాలని, ప్రజా సమస్యలను తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. పట్టణంలోని మూడో వార్డులో గుంతలను వెంటనే పూడ్చాలని అధికారులకు సూచించారు.
త్వరలోనే పాతగుట్ట రోడ్డు విస్తరణను చేపట్టనున్నట్లు, గాంధీనగర్ నుంచి యాదగిరిపల్లి వరకు రోడ్డు వేయనున్నట్లు తెలిపారు. యాదగిరిగుట్టలోని మూడు చెరువులు నింపామని, నీళ్ల ఎద్దడి రాకుండా రూ.210 కోట్లతో మిషన్ భగీరథ నూతన పైప్‌లైన్ వేస్తున్నామని, మార్చి, ఏప్రిల్‌లోగా నీళ్లు వస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో యాదగిరిగుట్ట మున్సిపల్ నూతన భవనం నిర్మిస్తామన్నారు. గణతంత్య్ర దినోత్సవాన్ని రోజున 26న ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలను ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి యూనిట్‌గా పథకాలు అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్, వైస్ చైర్మన్ కాటం రాజు కౌన్సిలర్లు గౌళీకార్ అరుణా రాజేష్, బూడిద సురేందర్, సీస విజయలక్ష్మి కృష్ణ, గుండ్లపల్లి వాణి భరత్‌గౌడ్, బిట్టు సరోజ హరీష్, ముక్కెర్ల మల్లేష్, దండబోయిన అనిల్, ఆవుల మమతాసాయి, తాళ్లపల్లి నాగరాజు, బబ్బూరి మౌనిక శ్రీధర్‌గౌడ్, కోఆప్షన్ సభ్యులు పేరబోయిన పెంటయ్య, రిజ్వానా యాకూబ్, సయ్యద్ బాబా, గోర్ల పద్మ, కమిషనర్ అజయ్‌కుమార్, వివిధ శాఖల అధికారులు, పలువురు రాజకీయ పార్టీల నేతలు తదితరులు పాల్గొన్నారు.
శ్మశానవాటిక నిర్మాణ పనులకు శంకుస్థాపన..
యాదగిరిగుట్ట పట్టణంలోని 9వ వార్డులో శ్మశాన వాటిక నిర్మాణానికి ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఎరుకల సుధా, కమిషనర్ అజయ్‌కుమార్‌తో పాటు కౌన్సిలర్లు, అధికారులు, వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు.