భువనగిరి: టిటిడి తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆలయ బోర్డుకు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆధికారులకు తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. యాదాద్రి పేరును యాదగిరిగుట్టగా మార్చాలని సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గోశాలలో గోసంరక్షణకు ప్రత్యేక పాలసీ తీసుకరావాలని సిఎం సూచించారు.
గోసంరక్షణకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవాలని, కొండపై భక్తులు నిద్రపోయేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. విమానం గోపురానికి బంగారు తాపడం పనులు వేగవంతం చేయాలన్నారు. ఆలయ అభివృద్ధికి సంబంధించి భూసేకరణ పూర్తి చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న భూసేకరణ పనులు పూర్తి చేయాలన్నారు. యాదగిరిగుట్ట ఆలయానికి సంబంధించి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని రేవంత్ తెలిపారు. వారంలోపు పూర్తి వివరాలు, ప్రపోజల్స్‌తో రావాలని సిఎం ఆదేశించారు. పెండింగ్ పనులు, ఇతర అంశాలపై పూర్తి నివేదిక అందించాలని సిఎం ఆదేశించారు.