యాదాద్రి : శ్రీ లక్ష్మీనరసింహ స్వామి యాదాద్రి క్షేత్రంలో శ్రీ అండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవ పూజలు ఆలయ అర్చకులు వైభవంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఉదయం అభిషేక పూజలు, సాయంత్రం ఆలయ మండపములో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊంజల్ సేవ మహోత్సవాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ గావించిన అర్చకులు మేళతాళములతో మంత్రోచ్చరణ గావిస్తూ అమ్మవారి సేవను ఆలయ పూరివీధులలో ఊరేగించగా భక్తజనులు అమ్మవారిని దర్శించుకున్నారు. అద్దాల మండపములో అమ్మవారి సేవను వేచింప చేసి ఊంజల్ సేవ ప్రత్యేకతను అర్చక స్వాములు భక్తులకు తెలిపారు.
ఆలయ నిత్యపూజలు…..
శ్రీలక్ష్మీనరసింహుని దర్శించుకున్న భక్తులు శ్రీవారి ఆలయంలో జరిగిన నిత్యపూజలు అభిషేకం,అర్చన, సుదర్శన నరసింహహోమం, నిత్యకల్యాణం, వెండి మొక్కు జోడు సేవ, సువర్ణ పుష్పర్చన తోపాటు శ్రీ సత్యనారాయణ స్వామి వత్ర పూజలలో భక్తులు పాల్గొన్నారు. కొండపై గల శ్రీపర్వతవర్ధిని రామలింగేశ్వర స్వామి శివాలయంలో శివ దర్శనము,పూజలు, కొండ కింద శ్రీపాతలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శ్రీ స్వామివారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. వేసవి సెలవులు కావడంతో వివిధ ప్రాంతాలనుండి యాదాద్రి దర్శనార్ధం భక్తులు తరలి వస్తూన్నారు.
శ్రీవారి నిత్యరాబడి….
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిత్యరాబడిలో భాగంగా శుక్రవారం రోజున రూ.27,19,812 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయం లో ప్రసాదవిక్రయం, ప్రదాన బుకింగ్, అర్జిత సేవలు, కొండపైకి వాహనాల అనుమతి, శ్రీసత్యనారాయణ వత్ర పూజలు, శివాలయం, పాతగుట్ట ఆలయం వివిధ శాఖల నుండి నిత్యరాబడి సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.