Wednesday, November 13, 2024

ఆగస్టు 13న యాదవ యుద్ధ భేరి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రానున్న ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన అన్ని రాజకీయ పార్టీలు యాదవులు, యాదవ ఉపకులాలకు 22 ఎంఎల్‌ఎ, 7 ఎంఎల్‌సి, 5 లోకసభ, రాజ్యసభ సీట్లు ఇవ్వాలని యాదవ విద్యావంతుల వేదిక డిమాండ్ చేసింది. ఇందు కోసం ఆగస్టు 13 న హైదరాబాద్ లోని సరూర్ నగర్ గ్రౌండ్ లో నిర్వహించే యాదవ యుద్ధ భేరిని జయప్రదం చేయాలని వేదిక రాష్ట్ర అధ్యక్షులు చలకాని వెంకట్ యాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన యుద్ధభేరి పోస్టర్ ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వెంకట్ యాదవ్ మాట్లాడుతూ పాలకవర్గ పార్టీలు గొర్రెలు, బర్రెలు, ఆవుల పేర్లు చెప్పి యాదవులను జీవాల కాపర్లుగా పరిమితం చేసి, కుల వృత్తుల చట్రంలో ఇరికించాలని చూస్తున్నారని విమర్శించారు. రేపటి యాదవ తరాలను చదువులకు దూరం చేసే కుట్ర తెలంగాణాలో జరుగుతోందన్నారు. కుల వృత్తులకు పరిమితమైతే చదువులు, ఉద్యోగాలు, అధికారానికి దూరం కావాల్సి వస్తుందని పేర్కొన్నారు. అందుకే సీట్ల వాటా, ఆర్ధిక వాటా, రాజ్యాధికారమే అంతిమ బాటగా నినదించాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. యాదవులు గొర్రెల కోసం కాకుండా సీట్ల కోసం గొంతెత్తాలని, ఏ రాజకీయ పార్టీ మాయమాటలకు లోనవకుండా జాగ్రత్తతో వ్యవహరించాలని సూచించారు.

రానున్న ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ ఎన్నికల ఎత్తులకు జిత్తులకు లోనవకుండా, ఒక్కపార్టీకి ఫాలోవర్లుగా మిగిలిపోకుండా యాదవులు అత్యంత ప్రజాస్వామికంగా వ్యవహరించాలన్నారు. యాదవుల జనాభాకు తగిన సీట్లు ఇవ్వని పార్టీలకు ఓట్లేయబోమని తిరగబడాలని పిలుపునిచ్చారు. రాజకీయాలలో యాదవులు ఓట్లేయడమే కాదు, పోటీ చేయడంలో కూడా కీలకంగా ఉండాలన్నారు. అందుకోసం పోటీ చేయాలనుకునే వారు ఆత్మ విశ్వాసంతో, ఆత్మగౌరవంతో ఆయా పార్టీలను సీట్లు అడగాలని, జెండాలు మోసే బానిసలుగా ఇక మీదట ఉండొద్దని ఆయన హితవు పలికారు.

ఎన్నికల వేళ బిసి రాగం వలకబోస్తున్న పాలక పార్టీలు జనాభా ప్రాతిపదికన యాదవులకు, ఆయా కులాలకు ఎన్ని సీట్లు ఇస్తారో ప్రకటించాలని డిమాండ్ చేశారు. జన గణనలో కుల గణన చేపట్టాలని, కేంద్ర ప్రభుత్వం చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కుల గణన చేపట్టాలన్నారు. యాదవులకు నష్టం కలిగించే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వెంటనే రద్దు చేయాలని, యాదవులు, యాదవ ఉపకులాలకు ఎస్‌ఎన్‌టి రిజర్వేషన్లు కల్పించాలని, యాదవుల విద్యా, ఉద్యోగ అభివృద్ధికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని, యాదవ స్టూడెంట్స్ కు ల్యాప్ టాప్స్, టాబ్స్, కంప్యూటర్స్, ఓవర్సీస్ ఫండ్ అందజేయాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో నాయకులు వట్టె జానయ్య యాదవ్, నల్లగొర్ల మురళి యాదవ్, పోచబోయిన శ్రీహరి యాదవ్, కరాటే కళ్యాణి యాదవ్, సాధం బాలరాజు యాదవ్, మేక లలిత యాదవ్, నల్లగొర్ల అచ్యుత యాదవ్, నోముల సైదులు యాదవ్, డాక్టర్ దూదిమెట్ల శ్రీనివాస్ యాదవ్, ఆర్‌ఎన్ గౌతమ్ యాదవ్, చక్రధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News