Sunday, December 29, 2024

వర్షాలు తగ్గినా.. ఆగని యమున ఉగ్రరూపం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గత మూడు రోజులుగా భారీ వర్షాలు లేనప్పటికీ యమునా నది ఉగ్రరూపం చూపిస్తూనే ఉంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో ప్రవహిస్తూ నగర వాసులను భయభ్రాంతులను చేస్తూ ఉంది. ఢిల్లీతో పాటు ఎగువ రా్రష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా యమునానది మునుపటి రికార్డులను తిరగరాస్తూ ..గత 45 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా దేశ రాజధానిని వరదల్లో ముంచేసింది. గురువారం ఉదయం 10 గంటల సమయానికి ప్రమాదస్థాయిని మించి మూడు మీటర్లు ఎగువన 208.53 మీటర్ల స్థాయికి వరద నీరు చేరుకుంది. ఇప్పటికే దీనిని తీవ్ర పరిస్థితిగా పేర్కొన్న కేంద్ర జలసంఘం గురువారం మధ్యాహ్నానికి నీటిమట్టం గరిష స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేసింది. హర్యానాలోని హత్నీకుండ్ బ్యారేజినుంచి భారీ స్థాయిలో నీటిని విడుదల చేయడమే ఢిల్లీలో యమునానది ఉధృతస్థాయిలో ప్రవహించడానికి ప్రధాన కారణం.

దీంతో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నది సమీపంలోని పాఠశాలను మూసివేయాల్సిందిగా ఆదేశించడంతో పాటుగా అక్కడి ప్రజలను సురక్షిత పాతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. అలాగే దేశ రాజధానిలోకి ప్రవేశించే వాహనాలపైనా ఆంక్షలు విధించారు. కాగా నగరంలో వరద పరిస్థితిని చర్చించడం కోసం లెఫ్టెనెంట్ గవర్నర్ వికె సక్సేనా గురువారం ఢిల్లీ విపత్తుల నిర్వహణ అథారిటీ(డిడిఎంఎ) ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. డిడిఎంఎకు వైస్ చైర్మన్‌గా ఉన్న ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఆ సమావేశానికి హాజరయినట్లు అధికారులు తెలిపారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ఆదివారం దాకా అన్ని స్కూళ్లు, కాలేజిలను మూసివేయాలని ఆదేశించారు. అత్యవసర సర్వీసులకు చెందిన వారు తప్ప మిగతా ఉద్యోగులు ఇంటినుంచే పని చేయాలని ఆదేశించారు. అలాగే ప్రైవేటు సంస్థలు కూడా ఇదే పద్ధతిని పాటించాలని సిఎం సూచించారు.

కేజ్రీవాల్ నివాసం, ఎర్రకోట వద్దకు చేరుకున్న వరద
మరోవైపు యమునానది వద నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకోవడంతో నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యమంత్రి కేజ్రీవాల్, మంత్రుల నివాసాలు ఉండే సెక్రటేరియట్‌తో పాటుగా అసెంబ్లీ, చారిత్రక ఎర్రకోట ప్రాంతానికి కూడా వరద నీరు చేరుకుంది. ఎర్రకోట చుట్టూ ఉన్న రోడ్లన్నీ మోకాళ్ల లోతు వరద నీటితో నిండిపోయాయి. ఎర్రకోటను కూడా వరద నీరు తాకడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. బోట్‌క్లబ్, పాండవ్‌నగర్, గాంధీనగర్‌లోని కొన్ని ప్రాంతాలు , భజన్‌పుర ప్రాంతాలను వరద నీరు చుట్టుముట్టింది. రాజ్‌ఘాట్‌నుంచి ఢిల్లీ సెక్రటేరియట్‌కు వెళ్లే రోడ్డు కూడా వరద నీటితో నిండిపోయింది. కనుచూపు మేర రోడ్డు కనిపించని దుస్థితి నెలకొంది. సివిల్ లైన్స్‌ప్రాంతంలోని రింగ్‌రోడ్డు ప్రాంతానికి వరదనీరు చేరుకోవడంతో మజ్నూకా తిలాను కశ్మీరీ గేట్‌ఐఎస్‌బిటితో కలిపే మార్గంలో రాకపోకలను నిలిపి వేశారు. యమునా బ్యాంక్ మెట్రోస్టేషన్‌కు కలిపే లింక్ రోడ్డు వరద నీటిలో మునిగిపోవడంతో బ్లూలైన్ మార్గంలో మెట్రో సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. అన్ని మార్గాల్లో మెట్రో సర్వీసులు కొనసాగుతున్నప్పటికీ మెట్రో బ్రిడ్జిలపై రైళ్లు పరిమిత వేగంతోనే నడుస్తున్నాయి.

నేడు తగ్గనున్న వరద: సిడబ్లుసి
ఇదిలా ఉండగా ఢిల్లీలో యమునా నది వరద నిలకడగా ఉందని, శుక్రవారం మధ్యాహ్నంనుంచి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కేంద్ర జల సంఘం(సిడబ్లుసి) అధికారి ఒకరు తెలిపారు. ఢిల్లీ పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమున నీటిమట్టం గురువారం మధ్యాహ్నం 1 గంటకు 208.62 మీటర్లకు పెరిగిందని, సాయంత్రం 4 గంటవరకు నిలకడగా కొనసాగిందని ఆ అధికారి తెలిపారు. మరో నాలుగు గంటల తర్వాతినుంచి వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని శుక్రవారం మధ్యాహ్నానికి 208.45 మీటర్లకు తగ్గవచ్చని సిడబ్లుసి చైర్మన్ శరత్ చంద్ర తెలిపారు. హర్యానాలోని హత్నీకుండ్ బ్యారేజి వద్ద నీటి విడుదల కూడా 80 వేల క్యూసెక్కులకు తగ్గినట్లు ఆయన చెప్పారు. యమునా నదిపై రెండు బ్యారేజిలు డెహ్రాడూన్‌లో డాక్ పత్థర్, యమునా నగర్ వద్ద హత్నీకుండ్ బ్యారేజిలు మాత్రమే ఉన్నాయి. నదిపై ఎలాంటి ప్రాజెక్టులు లేకపోవడంతో వర్షాకాలంలో కురిసే వరదనీరు అంతా వృథాగా దిగువకే ప్రవహిస్తూ ఉండడంతో వరదలు సంభవించడం ఆనవాయితీగా మారింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News