Saturday, November 23, 2024

పాతికేళ్ళ యానాం ఓల్డేజ్ హోమ్

- Advertisement -
- Advertisement -

యానాం భౌగోళికంగా తూర్పు గోదావరి జిల్లా గోదావరి నది పాయ వృద్ధ గౌతమి చెంత వున్నప్పటికీ పాలనా పరంగా కేంద్ర పాలిత రాష్ట్రమైన పుదిచ్చేరికి చెందింది. భారత దేశానికి 15 ఆగస్టు 1947న స్వాతంత్య్రం వస్తే ఫ్రెంచి పాలనలో వున్న భారత భూభాగాలకు 1954లో విముక్తి కలిగి భారత్‌లో విలీనం అయ్యాయి. వాటిలో యానాం ఒకటి. యానాం, కారైకాల్, మాహో, పుదుచ్చేరిలను కలిపి యూనియన్ టెరిటరీ ఆఫ్ పుదుచ్చేరిగా వ్యవహరిస్తున్నారు. బ్రిటిషు వారి హయాంలో యానాం అంటే శారదా చట్టాన్ని ఉల్లంఘించి బాల్య వివాహాలు చేసుకునే సురక్షిత స్థావరంగానూ, ఆ తర్వాత స్మగుల్డ్ గూడ్స్ దొరికే ప్రాంతంగాను, ఆ తర్వాత మద్యం చవకగా లభించే ప్రాంతంగాను పేరుబడింది. అయితే రాను రాను యానాం అంటే విద్యా కేంద్రంగాను, పారిశ్రామిక వాడగాను, సాహిత్య, సాంస్కృతిక, పర్యాట కేంద్రంగాను రూపుదిద్దుకొంది. దీనికి కారణం ఒకే ఒక వ్యక్తి సామాన్యుడైన అసమాన్యుడు మల్లాడి కృష్ణారావు.

విద్యార్థి దశ నుండే సామాజిక సేవ పట్ల ఆసక్తి వున్న కృష్ణారావు ఆపదలో వున్న వారిని, ఆర్థిక ఇబ్బందుల్లో వున్న వారిని, అనారోగ్యం పాలైన వారిని తన సొంత ఖర్చులతో ఆదుకునే వారు. ఆ సేవా దృక్పథమే ఆయన్ను రాజకీయాల వైపు ఆకర్షించింది. అంత వరకు దశాబ్దాలుగా అనువంశిక పాలన కునారిల్లిన యానాం రాజకీయాలు మల్లాడి రాజకీయ ఆరంగ్రేటంతో ప్రజాస్వామిక ఊపిరులు పీల్చుకొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండు చక్రాలుగా మల్లాడి యానాం శాసన సభ్యునిగా, పుదుచ్చేరి ప్రభుత్వంలో వివిధ శాఖల మంత్రిగా దశాబ్దాలుగా యానాంను అభివృద్ధి పథంలో నడింపించాడు. ప్రస్తుతం పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.అవన్నీ ఒక ఎత్తు అయితే ఆయనలోని సేవా గుణమే ఆయన చేత ‘యానాం ఓల్టేజ్ హోమ్’ ను స్థాపింప చేయించింది. మారిన జీవన విధాన పద్ధతుల వలన అనేక కుటుంబాలలో తల్లిదండ్రులు భారం అయిపోతున్నారు. కారణాలు ఏమైతేనేం ఇటీవల కాలంలో వృద్ధాశ్రమాలు ఎక్కువయ్యాయి. తల్లిదండ్రులను ఆశ్రమాల్లో చేర్చడానికి ఎవరి కారణాలు వారికి వున్నాయి.

ఇవికాక ఆస్తుల కోసం తల్లిదండ్రులను హతమార్చడం, వీధుల్లో వొదిలేయడం, బతికుండగానే శ్మశానాలకు తరలించడం నిత్యకృత్యమైపోయాయి. అయితే చాలా వృద్ధాశ్రమాలు నగదు చెల్లింపు పద్ధతిలపై నిర్వహించబడుతున్నాయి. అయితే మల్లాడి కృష్ణారావు నిర్మించిన వృద్ధాశ్రమం పూర్తిగా వుచితం. అందుకే ఆశ్రమం లోగో కింద సేవాతత్పరురాలైన అమ్మ మదర్ థెరిసా చిత్రంతో పాటు “Love and care still last Breath” అనే ప్రేమ పూర్వక వాక్యాలు కనబడతాయి.
యానాం ఓల్డేజ్ హోమ్‌కు 13-1997న అప్పటి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ రాజేంద్ర కుమారి బాజ్‌పాయ్ శంకుస్థాపన చేయగా, 27-6-1998న మరో గవర్నర్ రజనీరాయ్ ప్రారంభోత్సవం చేశారు. 1998 అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు ఆశ్రమంలో వృద్ధులను చేర్చుకోవడం ద్వారా మల్లాడి చిరకాల స్వప్నం సాకారం అయింది. రెండు వేల చదరపు మీటర్ల ప్రభుత్వ స్థలంలో వృద్ధాశ్రమ నిర్మాణానికి అవసరమైన నిధులు, సామాగ్రి దాతలు విరాళాలుగా సమకూర్చారు.
30 గదులు గల ఆశ్రమంలో స్త్రీలకు, పురుషులకు విడివిడిగా బ్లాకులు వున్నాయి.

విశాలమైన డైనింగ్, వేడి నీటి సదుపాయం, వైద్య సదుపాయం, మూడు మతాల ధ్యాన మందిరాలు, చుట్టూ ఉద్యానవనం ఆహ్లాదకర వాతావరణంలో కొలువు దీరింది యానాం ఓల్డేజ్ హోమ్ రెండస్థుల భవనంలో పైన ఆశ్రమం అయితే కింది భాగంలో అనాథ బాల బాలికల కోసం ‘చిన్నారుల ఆనంద నిలయం’. ఆనంద నిలయంలో చేరిన బాలికలను డిగ్రీ దాకా చదివించి, సొంత బిడ్డలా దగ్గరుండి వివాహం జరిపించిన ఆదర్శ దంపతులు మల్లాడి కృష్ణారావు, ఉదయ లక్ష్మిగార్లు. ఆశ్రమంతో పాటు యానాం బ్లడ్ బ్యాంకు, యానాం ఐ బ్యాంకు వంటి సంస్థలను స్థాపించి, ఆశ్రమ వాసులకే కాక, ప్రజలకూ అందుబాటులో వుంచారు. వీటితో పాటు ఒక్క రూపాయికే భోజన పథకంతో యానాం పరిసర ప్రాంత పేద ప్రజల అన్నార్తిని బాపుతున్నాయి.
ఆశ్రమానికి అనుబంధంగా ‘యానాం ప్రజా స్వచ్ఛంద సేవా సంస్థ” అనే సంస్థను సుమారు 250 మంది సిబ్బంది స్థాపించారు. వీరు నిత్యం యానాంను అద్దంలా నిత్యం పరిశుభ్రంగా వుంచుతారు. యానాం ఓల్డేజ్ హోమ్‌ను సందర్శించిన ప్రముఖుల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులు, కేంద్ర ,

రాష్ట్ర మంత్రులు, కలెక్టర్లు, సినీనటులు, కవులు, రచయితలు, కళాకారులు వున్నారు. ఆశ్రమం సేవలకు గుర్తింపుగా 2011లో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేషనల్ అవార్డు ఫర్ చైల్డ్ వెల్ఫేర్ అవార్డును, 2012 లో కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే చేతుల మీదుగా సేవా అవార్డును, 2008లో భారత ఉపరాష్ట్రపతి ఎం. హమీద్ చేతుల మీదుగా బెస్ట్ సివిక్ అవార్డు వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నారు. ఇటువంటి ‘యానం ఓల్డేజ్ హోమ్’ ఇరవై అయిదు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని వృద్ధుల, అనాథల సేవలో తరిస్తూ రజతోత్సవం జరుపుకొంటున్నది. ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావుగారికి, ఆశ్రమం నిర్వహణకు తమ వదాన్యతను అందించిన దాతలకు, ఆశ్రమ నిర్వహణ బాధ్యులకు, ఆశ్రమ వాసులకు, బాల బాలికలకు నా హార్ధిక శుభాకాంక్షలు.

డాక్టర్ శిఖామణి
9848202526
(వ్యాసకర్త కవి సంధ్య సంపాదకులు)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News