Friday, November 22, 2024

రాష్ట్రంలో సాగు విప్లవం

- Advertisement -
- Advertisement -

Yasangi cultivation with new crops

కొత్త పంటలతో సరికొత్తగా యాసంగి సాగు

సంప్రదాయ సాగుకు క్రమంగా స్వస్తి
ఆధునాతన పరిశోధన ఫలితాలను బట్టి టెక్నాలజీ సహకారంతో తక్కువపెట్టుబడి, ఎక్కువ రాబడి ఉండేలా రూపొందించిన ప్రణాళికలు, రాష్ట్రంలో అన్ని రకాల వ్యవసాయ క్షేత్రాలు కలిసి మొత్తం 63.26లక్షల ఎకరాలకు పైగా ఉన్నాయి, 91.48% సన్న, చిన్న రైతులవే, వీరి భాగస్వామ్యం పెంచేందుకు వీలుగా నూతన సాగు, రాష్ట్రాన్ని నూనె గింజుల సాగు హబ్‌గా తయారుచేసే వ్యూహం
2024 నాటికి 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేపట్టాలని లక్ష్యం

మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగం ముఖ చిత్రాన్ని వినూత్న రీతిలో ఆవిష్కరించేందుకు ప్రభుత్వం సన్నద్దమవుతోంది. పెరిగిన సాగు నీటి వనరులు , వాతావరణ అనుకూలతలు , నేలల స్వభావం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని పంటల సరళిలో మార్పులు చేపట్టింది. ఈ యాసంగినుంచే కొత్త వ్యవసాయ ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టబోతోంది. సాంప్రదాయ రీతిలో పంటల సాగుకు క్రమేపి స్వస్తి పలికి వ్యవసాయరంగంలో వస్తున్న అధునాత పరిశోధనా ఫలితాలను అందిపుచ్చుకొంటూ టెక్నాలజి సహకారంతో తక్కవ పెట్టుబడితో అధికోత్పత్తులు సాధించే దిశగా కెసిఆర్ సర్కారు మరింత వేగంగా అడుగులు వేస్తోంది. ప్రపంచ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకొని పంటలకు లాభసాటి ధరలు లభించే విధంగా ఇప్పటికే ప్రణాళికలు రూపొందించి అందులో భాగంగా ఇప్పటికే కొన్నింటిని అమల్లో పెట్టింది. రాష్ట్రంలో కోటి 50లక్షల ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయానికి యోగ్యమైన సాగుభూములు ఉన్నాయి. అన్ని రకాల వ్యవసాయ క్షేత్రాలు కలిపి 63.26లక్షలకు పైగానే ఉన్నాయి.

అయితే అందులో 91.48శాతం సన్న , చిన్న కారురైతులే కావటంతో పంటల సాగు ప్రణాళికలో కూడా ఆమేరకు ప్రభుత్వం సన్న చిన్నకారు రైతుల భాగస్వామ్యం పెంచేందుకు చర్యలు చేపట్టింది. రైతుబంధు , ఉచిత విద్యుత్ వంటి పధకాలతో వ్యసాయ రంగానికి అన్నివిధాల అండగా నిలిచిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని నూనెగింజల సాగుకు కేరాఫ్‌గా మార్చే ప్రయత్నాలు చేపట్టింది. ఈ యాసంగిలో నూనెగింజల సాగును భారీగా పెంచేందుకు ప్రణాళికలు రూపొందించింది.అసలు తెలంగాణ రైతాంగానికి ఏమాత్రం పరిచయమే లేని ఆయిల్ పామ్ సాగునే దేశంలోనే అత్యధిక విస్తీర్ణంలో సాగు చేసే రాష్ట్రాల్లో ప్రధమ స్థానంలో నిలిపేందుకు చర్యలు చేపట్టింది. 2024నాటికి రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగును చేపట్టాలని ప్రభుత్వం లక్షంగా పెట్టుకొంది. తొలిదశ ప్రణాళిక కింద ఇప్పటికే 3లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతోంది. ఆయిల్ పామ్ సాగును భారీగా పెంచటం దారా వంట నూనెల దిగుమతిని తగ్గించే ప్రణాళికలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కూడా తగిన ప్రోత్సాహం అందచేస్తోంది.

అదే విధంగా రాష్ట్రంలో మరి కొన్ని నూనెగింజ పంటల సాగుకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహాయ సహకారాలు అందచేస్తామని ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభ కంద్లాజే భరోసానిచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వేరుశనగ, పొద్దు తిరుగుడు , నువ్వులు , తదితర నూనెగింజ పంటల సాగుకు యాసంగి పంటల సాగు ప్రణాళికలతో తగిన ప్రధాన్యం కల్పించింది. పంటల మార్పిడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం యాసంగిలో పెద్ద ఎత్తున వేరుశనగ సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులను ఆ దిశగా ప్రోత్సహించనుంది. రాష్ట్రంలో 2.78లక్షల ఎకరాల విస్తీర్ణంలో వేరుశనగ పంటను సాగు చేయించాలని ప్రతిపాదనలు రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం నూనెగింజ పంటల సాగుకు ఇచ్చే ప్రోత్సాహకాల్లో భాగంగా అందజేస్తున్న మినికిట్స్‌ను యాసంగిలో లక్ష ఎకరాలకు అందచేయానలి కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక ఇచ్చింది. పొద్దు తిరగుడు సాగును పెంచేందుకు కూడా చర్యలు చేపడుతోంది.

మరోవైపు సెనగ, పెసర , మినుము , కంది తదితర పప్పు ధాన్య పంటల సాగును 4.59లక్షల ఎకరాలకు పెంచేందుకు యాసంగి ప్రణాళికలో ప్రధాన్యత కల్పించింది. పప్పు ధాన్య పంటల్లో కందులకు రూ.6300, పెసరకు రూ.7275, మినుముకు రూ.6300 మద్దతు ధరలను ప్రకటించి అమల్లోకి తెచ్చింది. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న పప్పుధాన్య పంటల సాగును పెంచడంలో భాగంగా రైతులను ఆ దిశగా ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పప్పు ధాన్యాల కొనుగోళ్లలో ప్రస్తుతం ఉన్న పరిమితులను ఎత్తివేసి వంద శాతం పంటలకు కనీస మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ అధ్యక్షతన నూనెగింజలు , అపరాలు, ఆయిల్ పామ్ మిషన్ , వయసాయ ఎగుమతులపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నూనెగింజలు , అపరాల సాగుకు అందజేయాల్సిన ప్రోత్సాహకాలను ప్రస్తావించాగా కేంద్రం సానుకూలత వ్యక్తం చేసింది.

నూనెగింజ పంటలకు ప్రభుత్వం మద్దతు ధరలు కూడా ప్రకటించింది. వేరుశనగకు రూ.5550, పొద్దుతిరుగుడుకు రూ.6015,నువ్వులకు రూ.7307 మద్దతు ధరలను ప్రకటించింది. వచ్చే ఏడాదిని ఎఫ్‌ఏఓ అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రం ముందుగానే మేల్కొంది. రాష్ట్రంలో చిరుధాన్యాల సాగుకు ఉన్న అనుకూలతలపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో ఉన్న పంటల సాగు విస్తీర్ణంలో 20శాతం చిరుధాన్య పంటలు సాగు చేసేదిశగా ప్రభుత్వం ప్రతిపాదించింది. వర్షాధారంగా యాసంగిలో జొన్నలు , కొర్రలు, రాగులు , సజ్జలు తదితర చిరుధాన్య పంటల సాగును గణనీయంగా పెంచేందుకు చర్యలు చేపడుతోంది. చిరుధాన్య పంటలకు కూడా మద్దతు ధరలను పెంచింది. జొన్నలకు రూ.2738, రాగులకు రూ.3377, సజ్జలకు 2250 మద్దతు ధరలను ప్రకటించి వీటిని తక్షనం అమల్లోకి వస్తున్నట్టు ప్రకటించి రైతులను చిరుధాన్యల సాగు పట్ల ప్రొత్సాహపరుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News