మన తెలంగాణ/క్రీడా విభాగం: టీమిండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ టెస్టు క్రికెట్‌కు శ్రీకారం చుట్టాడు. వీధి బాలుడి స్థాయి యశస్వి అతి తక్కువ సమయంలో భారత జట్టులో చోటు సంపాదించి పెను ప్రకంపనలు సృష్టించాడు. వెస్టిండీస్‌తో డొమినికా వేదికగా బుధవారం రోజు ప్రారంభమైన తొలి టెస్టులో యశస్వికి చోటు దక్కింది. అతనితో పాటు యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా టెస్టు క్రికెట్ కెరీర్‌ను ఆరంభించాడు. ఇటీవల ముగిసిన ఐపిఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారించిన యశస్వి చిన్న వయసులో భారత జట్టులో స్థానాన్ని సంపాదించాడు. వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్టులో యశస్వి జైస్వాల్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు.
భీకర ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్‌ను కాదని యశస్విని ఓపెనర్‌గా దించడం విశేషం. పదేళ్ల కిందట యశన్వి ఓ వీధి బాలుడి కిందే లెక్క. అయితే క్రికెట్ మోజుతో ముంబై మహా నగరానికి వచ్చేశాడు. ఈ మహా నగరంలో అడుగిడిని యశస్వికి సమస్యలు స్వాగతం పలికాయి. కాలే కడుపుతో పస్తులుండాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. అయితే యశస్వి మాత్రం తన పట్టుదలతో కొనసాగించాడు. ఎలాగైనా క్రికెటర్ కావాలనే కాంక్షతో ముందుకు సాగాడు. తండ్రికి పానీ పూరి అమ్మడంలో సహాయపడ్డాడు. ఈ క్రమంలో ఎన్నో అవమానాలను, అవహేళనలను భరించాడు.
అయినా యశస్వి మాత్రం ఏనాడు కూడా అధైర్య పడలేదు. తన లక్షం దిశగా అడుగులు వేశాడు. పదేళ్ల కఠోర శ్రమ తర్వాత ప్రస్తుతం టీమిండియాలో చోటు కూడా సంపాదించాడు. ప్రతిభావంతులకు భారత జట్టులో ఎప్పుడూ తెరిచే ఉంటాయనడానికి యశస్వినే నిదర్శనం. ఐపిఎల్‌తో పాటు డొమెస్టిక్ క్రికెట్‌లో అసాధారణ బ్యాటింగ్‌తో పెను ప్రకంపనలు సృష్టించిన యశస్వి ఏకంగా జాతీయ జట్టులోనే స్థానం దక్కించుకున్నాడు. కఠోర సాధన, ఆటపై అంకితభావం వల్లే యశస్వికి ఇది సాధ్యమైంది. చటేశ్వర్ పుజారా వంటి దిగ్గజాన్ని సయితం కాదని బిసిసిఐ యశస్వి వంటి యువ క్రికెటర్‌ను టెస్టు జట్టులోకి తీసుకుని ఆదర్శంగా నిలిచింది. యశస్వి కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని టీమిండియాలో చోటును శాశ్వతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు.