Friday, March 21, 2025

ఢిల్లీ హైకోర్టు జడ్జిపై సుప్రీం కోర్టు దర్యాప్తు మొదలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ అధికార నివాసంలో అగ్ని ప్రమాదం సమయంలో వెలుగు చూసినట్లుగా పేర్కొంటున్న భారీ నోట్ల కట్టల ఘటనపై సుప్రీం కోర్టు కొలీజియం శుక్రవారం ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. యశ్వంత్ వర్మను అలహాబాద్‌హైకోర్టుకు బడలీ చేయాలనే సూచనలు కూడా వచ్చాయి. ఆ దర్యాప్తు సుప్రీం కోర్టు తీర్పుల్లో సూచించినట్లుగా అంతర్గత విచారణ కాదు. ఆ ఘటనపై ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి ప్రాథమిక నివేదికను కూడా సుప్రీం కోర్టు కొలీజియం కోరగలదు.

భారత ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) సంజీవ్ ఖన్నా సారథ్యంలోని కొలీజియం వెంటనే కార్యోన్ముఖమై తక్షణ సమావేశం నిర్వహించింది. జస్టిస్ వర్మను తొలుత పని చేసిన అలహాబాద్ హైకోర్టుకు బదలీ చేసే ప్రక్రియకు కొలీజియం శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించడం కేవలం ఒక చర్య అని, కొలీజియం ఈ విషయమై మరింతగా క్రియాశీలం కావచ్చునని తెలుస్తోంది. దేశ రాజధానిలో జస్టిస్ వర్మ అధికార నివాసంలో నగదు కట్టలు కనిపించడానికి సంబంధించిన వివాదం గురించి, ఆ దరిమిలా కొలీజియం సంప్రదింపుల గురించి తొలుత ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక తెలియజేసింది.

కొలీజియం సిఫార్సును కేంద్రం ఆమోదించిన తదుపరి జస్టిస్ వర్మ ప్రతిపాదిత బదలీ చోటు చేసుకుంటుంది. కొలీజియం తన సిఫార్సును అధికారికంగా ఇంకా పంపవలసి ఉంది. జస్టిస్ వర్మ అధికార నివాసంలో మంటలను ఆర్పివేసేందుకు వెళ్లిన ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారుల కంట పడినట్లుగా పేర్కొంటున్న అధికారిక నగదు మొత్తం ఇంకా తెలియరావలసి ఉంది. ఢిల్లీ హైకోర్టు వెబ్‌సైట్ సమాచారరం ప్రకారం, జస్టిస్ వర్మ 1992 ఆగస్టు 8న న్యాయవాదిగా నమోదు అయ్యారు. ఆయన 2014 అక్టోబర్ 13న అలహాబాద్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియుక్తుడయ్యారు. ఆయన 2016 ఫిబ్రవరి 1న అలహాబాద్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఆయన ఆ తరువాత 2021 అక్టోబర్ 11న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియుక్తుడయ్యారు. ఆయన ప్రస్తుతం అమ్మకం పన్ను, జిఎస్‌టి, కంపెనీ అప్పీళ్లు, ఇతర అప్పీళ్ల కేసులను పరిశీలిస్తున్న డివిజన్ బెంచ్‌కు సారథ్యం వహిస్తున్నారు. ఇది ఇలా ఉండగా, ఢిల్లీ హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తుల్లో రెండవ స్థానంలో ఉన్న జస్టిస్ వర్మ శుక్రవారం కోర్టులో బాధ్యతలు నిర్వర్తించలేదు. ఆ విషయాన్ని హైకోర్టు మాస్టర్ న్యాయవాదులకు తెలియజేశారు. కాగా, సీనియర్ న్యాయవాది ఒకరు బెంచ్ ముందు ఈ అంశం ప్రస్తావించినప్పుడు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డికె ఉపాధ్యాయ బాధ, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

జస్టిస్ వర్మ నివాసంలో భారీ అగ్ని ప్రమాదం దరిమిలా భారీగా నగదు కట్టలు బహిర్గత కావడం గురించి ప్రభుత్వ అధికారులు కొందరు సమాచారం అందజేసిన తరువాత సర్వోన్నత న్యాయస్థానం కార్యోన్ముఖం అయినట్లు తెలుస్తోంది. జస్టిస్ వర్మను బదలీ చేయడమే కాకుండా ఆయనపై కఠిన చర్య తీసుకోవాలని కొలీజియంలోని సీనియర్ సభ్యులు కొందరు కోరినట్లు తెలుస్తోంది. ఆయన రాజీనామాను కోరాలని, అందుకు నిరాకరిస్తే సర్వోన్నత న్యాయస్థానం తీర్పుల్లో సూచించినట్లుగా అంతర్గత దర్యాప్తు ప్రారంభించాలని వారు కోరినట్లు తెలుస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News