న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నికైన యశ్వంత్ సిన్హాకు సుదీర్ఘ పాలనానుభవంతో పాటుగా రాజకీయ అనుభవం కూడా ఉంది. 1936 నవంబర్ 6న బీహార్ రాష్ట్రంలో జన్మించిన సిన్హా పాట్నాలోనే తన పాఠశాల, యూనివర్శిటీ విద్యను కొనసాగించారు. 1958లో పాట్నా యూనివర్శిటీనుంచి రాజకీయ శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన ఆయన అదే వర్సిటీలో రెండేళ్ల పాటు రాజకీయ శాస్త్రాన్ని బోధించారు. 1960లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐఎఎస్)లో చేరిన ఆయన తన 24 ఏళ్ల కెరీర్‌లో పలు పదవులు నిర్వహించారు. 1984లో ఐఎఎస్‌కు రాజీనామా చేసిన సిన్హా జనతాపార్టీ సభ్యుడిగా క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.1986లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితుడైన ఆయన 1988లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. విపి సింగ్ నాయకత్వంలో జనతా దళ్ ఏర్పాటయినప్పుడు సిన్హా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1990 నవంబర్‌నుంచి 1991 జూన్ దాకా చంద్రశేఖర్ ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ఆర్థిక మంత్రిగా పనిచేశారు.
1996లో భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. 1998, 1999, 2009లోజార్ఖండ్‌లోని హజారీబాగ్‌నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2002లో వాజపేయి ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పని చేశారు. బిజెపిలో సీనియర్ నేత అద్వానీకి సిన్హా ఎంతో సన్నిహితుడిగా ఉండే వారు. అంతేకాదు, విపక్షాలకు చెందిన వివిధ పార్టీల నేతలతోనూ ఆయనకు సత్సంబంధాలున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి అధినాయకత్వం ఆయనకు టికెట్ నిరాకరించడమే కాకుండా హజారీ బాగ్‌నుంచి ఆయన చిన్నకుమారుడు జయంత్ సిన్హాను నిలబెట్టడంతో ఆయన పార్టీనుంచి బైటికివచ్చారు. 2018లో పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో క్రియాశీల రాజకీయాలనుంచి వైదొలగుతున్నట్లు కూడా ప్రకటించారు. అయితే 2021లో అనూహ్యంగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌లో చేరడంతో పాటుగా ఆ పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. నీలిమను వివాహం చేసుకున్న సిన్హాకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.